indira gandhi: ఇందిరాగాంధీతో ప్రియాంక కుటుంబం... పాత ఫొటో ఒకటి షేర్ చేసిన ప్రియాంక!
- సహనం కోల్పోయిన నెటిజన్లు
- గాంధీ కుటుంబాన్ని విమర్శిస్తూ కామెంట్లు
- హత్యాకాండ జరిపిన కుటుంబానికి మద్దతివ్వడం తగదంటూ వ్యాఖ్యలు
ప్రియాంక చోప్రా... గ్లోబల్ స్టార్‌గా ప్రపంచమంతా పాప్యులారిటీ సంపాదించిన భారతీయ నటి. ఇన్స్టాగ్రాం, ట్విట్టర్ ద్వారా ప్రతి ఒక్క విషయాన్ని అభిమానులతో పంచుకోవడానికి ఎప్పుడూ ముందుండే నటి. ఈ నేపథ్యంలోనే అక్టోబర్ 31న మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్థంతి సందర్భంగా ఇన్‌స్టాగ్రాంలో ఓ పాత ఫొటోనే షేర్ చేసింది. ఈ ఫొటోలో ఇందిరాగాంధీతో పాటు ప్రియాంక తల్లి, పిన్ని, ఇతర కుటుంబ సభ్యులు ఉన్నారు.
ఈ ఫొటో షేర్ చేసిన కొన్ని గంటల్లోనే చాలా లైకులు, కామెంట్లు చాలా వచ్చాయి. ఈ కామెంట్లలో నెటిజన్లు తమ సహనం కోల్పోయి ప్రవర్తించారు. ఒక వర్గంపై జరిగిన సామూహిక హత్యాకాండకు బాధ్యురాలిగా పరిగణించబడే ఇందిరా గాంధీతో ఫొటో దిగడానికి ప్రియాంక కుటుంబానికి సిగ్గు లేదా? అని, ఆ ఫొటో షేర్ చేయడానికి ప్రియాంకకు మనసెలా వచ్చిందని కామెంట్లు చేశారు. కొంతమంది నెటిజన్లు అసభ్య పదజాలాన్ని కూడా ఉపయోగించారు. అయితే మరికొంత మంది అభిమానులు మాత్రం ఫొటో బాగుందని, ఇంకా ఏమైనా పాత ఫొటోలు షేర్ చేయాలని ప్రియాంకను కోరారు.