priyanka chopra: ప్రియాంక చోప్రాను క్షమాపణలు కోరిన ఫెమినా మేగజైన్!
- ప్రియాంక మాటలను తప్పుగా ప్రచురించిన పత్రిక
- అసంతృప్తి వ్యక్తం చేసిన నటి
- క్షమాపణలు కోరుతూ ప్రకటన జారీ
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రాకి ప్రముఖ మేగజైన్ ఫెమినా క్షమాపణలు తెలుపుతూ ప్రకటన జారీ చేసింది. ఇటీవల ప్రియాంక ఆ మేగజైన్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె చెప్పని విషయాలను చెప్పినట్లు ప్రచురించిన కారణంగా క్షమాపణలు కోరుతున్నట్లు ప్రకటనలో పేర్కొంది. నవంబర్ 9న 'అయామ్ ఆల్ అబౌట్ గర్ల్ లవ్' అనే పేరుతో ఫెమినా పత్రికలో ప్రచురితమైన ఇంటర్వ్యూలో ప్రియాంక తన మాజీ బాయ్‌ఫ్రెండ్ గురించి ప్రస్తావించింది.
అయితే అతని పేరు చెప్పలేదు. కానీ ఫెమినా మేగజైన్ మాత్రం ప్రియాంక అతన్ని `ఎంఎఫ్` అని పిలుస్తుందని ప్రియాంక చెప్పినట్లుగా రాశారు. దీంతో ప్రియాంకతో పాటు ఆమె అభిమానులు కూడా అసంతృప్తికి గురైనట్లు తెలిసి ఆమెకు క్షమాపణలు చెబుతూ ప్రకటన జారీ చేశారు. ప్రియాంక వేసుకునే ఎయిర్పోర్ట్ జాకెట్ ముంబైలో ఉన్న తన బాయ్‌ఫ్రెండ్‌కి చెందనిదని గతంలో కూడా చెప్పింది. కానీ అతని పేరు మాత్రం ఎక్కడా ప్రస్తావించలేదు. అయితే గత అక్టోబర్‌లో కూడా ఈ ప్రస్తావన వచ్చినపుడు కొంతమంది నెటిజన్లు ఆ జాకెట్... షారుక్ ఖాన్ ఇచ్చినదని పుకార్లు కూడా పుట్టించారు.