rajanikanth: 'కాలా' శాటిలైట్ హక్కులు 75 కోట్లు.. రజనీ క్రేజ్ కి ఇదో నిదర్శనం!
- ధనుష్ నిర్మాతగా రూపొందిన 'కాలా'
- ఆశ్చర్యాన్ని కలిగిస్తోన్న బిజినెస్
- ఏప్రిల్ 27వ తేదీన భారీ విడుదల
రజనీకాంత్ తో ఒక సినిమా చేస్తే చాలని ఎంతో కాలంగా ఎదురుచూస్తోన్న సీనియర్ దర్శకులు ఎంతోమంది వున్నారు. వాళ్లందరికీ కాకుండా ఆయన 'కబాలి' సినిమాతో రంజిత్ కి అవకాశం ఇవ్వడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆ వెంటనే 'కాలా'తో అదే దర్శకుడికి మరో ఛాన్స్ ఇచ్చి ఆయన విస్మయానికి గురిచేశాడు. ఈ సినిమాలోనూ ఆయన డాన్ పాత్రనే చేస్తుండటం విశేషం.
ఇక ఈ సినిమాలో ఆయన లుక్ కూడా .. అభిమానులలో ఒక రేంజ్ లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకి కావాల్సినంత క్రేజ్ వచ్చేసింది. ధనుష్ నిర్మించిన ఈ సినిమా థియేట్రికల్ హక్కులను లైకా ప్రొడక్షన్స్ వారు 125 కోట్లకు కొనుగోలు చేశారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా శాటిలైట్ హక్కులకు భారీస్థాయిలో పోటీ ఏర్పడిందట. తాజాగా స్టార్ టీవీ వారు ఈ సినిమా శాటిలైట్ హక్కులను దక్కించుకున్నట్టు తెలుస్తోంది. తెలుగు .. తమిళ .. హిందీ భాషల హక్కులను కలుపుకుని, ఈ ఛానల్ వారు 75 కోట్లను చెల్లించినట్టు సమాచారం. ఈ రేటు రజనీకి గల క్రేజ్ ను మరోమారు చాటిచెప్పిందనే టాక్ కోలీవుడ్ లో వినిపిస్తోంది. ఏప్రిల్ 27వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు.