Dinesh Karthik: మాట విననందుకు ప్రసీద్ కృష్ణను బూతులు తిట్టిన దినేశ్ కార్తీక్
- సహనం కోల్పోయిన కార్తీక్
- తన మాటలు పట్టించుకోని ప్రసీద్పై చిందులు
- వైరల్ అవుతున్న వీడియో
సాధారణంగా కూల్‌గా కనిపించే కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ దినేశ్ కార్తీక్ మొన్నటి మ్యాచ్‌లో సహనం కోల్పోయాడు. మాట వినకుండా బంతి విసిరిన ఫాస్ట్ బౌలర్ ప్రసీద్ కృష్ణను బూతులు తిట్టాడు. క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్-సన్ రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.
ప్రసీద్ వేసిన తొమ్మిదో ఓవర్ చివరి బంతిని షకీబల్ హసన్ ఆఫ్ సైడ్ ఆడి సింగిల్ తీశాడు. ఆ బంతిని అందుకున్న ప్రసీద్ నాన్-స్ట్రైకింగ్ ఎండ్ వైపు విసిరాడు. అయితే స్టంప్స్ వెనక ఉన్న దినేశ్ కార్తీక్ బంతిని విసరొద్దని ప్రసీద్‌కు సూచించాడు. కెప్టెన్ మాటలు పట్టించుకోని ప్రసీద్ ఆ బంతిని నాన్-స్ట్రయికింగ్ ఎండ్‌వైపు విసిరాడు. అయితే, అది ఓవర్ త్రో కావడంతో బ్యాట్స్‌మెన్ మరో పరుగు తీశారు. ఇది చూసిన కార్తీక్‌కు చిర్రెత్తుకొచ్చింది. వెంటనే ప్రసీద్ను బూతులు తిట్టేశాడు. స్టంప్స్ వద్ద ఉన్న కెమెరాల్లో కార్తీక్ మాటలు రికార్డు కావడంతో వైరల్ అయింది.