Champalal Devda: దుర్భాషలాడుతూ.. కానిస్టేబుల్ చెంపలు వాయించిన బీజేపీ ఎమ్మెల్యే.. వీడియో వైరల్
- వరుసగా వివాదాల్లో ఇరుక్కుంటున్న బీజేపీ నేతలు
- మధ్యప్రదేశ్ దేవాస్ జిల్లాలో మరో ఘటన
- పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ చెంపలు పగలగొట్టిన ఎమ్మెల్యే దేవ్డా
బీజేపీ నేతలు వరుసగా వివాదాల్లో ఇరుక్కోవడం సాధారణ అంశంగా మారిపోయింది. తాజాగా మధ్యప్రదేశ్ లో బీజేపీ ఎమ్మెల్యే చంపాలాల్ దేవ్డా ఓ కానిస్టేబుల్ పై దాడి చేయడం సీసీ కెమెరాల్లో రికార్డయింది. కానిస్టేబుల్ ను దుర్భాషలాడుతూ, రెండు చెంపలూ వాయించిన సన్నివేశాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటన నిన్న రాత్రి జరిగింది.
సీసీ కెమెరాలో రికార్డయిన సన్నివేశాల ప్రకారం.... దేవాస్ జిల్లాలోని ఉదయ్ నగర్ పోలీస్ స్టేషన్ కు ఎమ్మెల్యే మేనల్లుడు తొలుత వచ్చాడు. పోలీస్ స్టేషన్ లోని నిషేధిత ప్రాంతంలోకి వెళ్లాడు. లాకప్ లో ఉన్న ఓ ఖైదీ నుంచి వాటర్ బాటిల్ తీసుకున్నాడు. ఈ సందర్భంగా కానిస్టేబుల్ సంతోష్ ఎమ్మెల్యే మేనల్లుడిని అడ్డుకున్నాడు. పోలీస్ స్టేషన్ లోపలకు ఎందుకు వచ్చావంటూ ప్రశ్నించాడు. వెంటనే అక్కడ జరిగిన విషయం గురించి ఎమ్మెల్యేకు మేనల్లుడు సమాచారం అందించాడు. ఆ తర్వాత సీసీ కెమెరా ఫుటేజీలో ఎమ్మెల్యే ఎంటరయ్యాడు. కానిస్టేబుల్ ను బూతులు తిడుతూ, రెండు చెంపలూ వాయించాడు.
ఈ ఘటనపై కేసు నమోదు చేశామని, దర్యాప్తు జరుగుతోందని జిల్లా ఎస్పీ అన్షుమన్ సింగ్ తెలిపారు. ఈ ఘటన అర్ధరాత్రి 12 గంటల తర్వాత జరిగిందని చెప్పారు. సెక్షన్ 353 (ప్రభుత్వ ఉద్యోగిని విధులు నిర్వహించకుండా అడ్డుకోవడం), సెక్షన్ 332 (ప్రభుత్వ ఉద్యోగిపై చేయి చేసుకోవడం) కింద కేసు నమోదయింది.