Ravi Shankar Alok: భవంతిపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న బాలీవుడ్ రచయిత రవి శంకర్ అలోక్!
- 'అబ్ తక్ చప్పన్'కు రచయితగా పనిచేసిన రవి
- గత ఏడాదిగా అవకాశాలు రాక ఒత్తిడి
- గత రాత్రి రూఫ్ టాప్ పై నుంచి దూకి ఆత్మహత్య
నానా పటేకర్ నటించిన 'అబ్ తక్ చప్పన్' వంటి చిత్రాలకు కథా రచయితగా పనిచేసిన రవి శంకర్ అలోక్ (32) ముంబైలోని ఓ బహుళ అంతస్తుల భవంతిపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, రవిశంకర్ పశ్చిమ అంధేరీలోని సెవన్ బంగ్లాస్ ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు.
బుధవారం రాత్రి 2 గంటల సమయంలో తన భవంతి పై అంతస్తుకు చేరుకున్న ఆయన, అక్కడి నుంచి దూకాడు. అతని వద్ద, అతని ఇంట్లో ఏ విధమైన సూసైడ్ నోట్ దొరకలేదు. ఆయన ప్రస్తుతం తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడని, సైకియాట్రిక్ చికిత్స తీసుకుంటున్నాడని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన సుబ్రుబాన్ వెర్సోవా పోలీసులు విచారణ ప్రారంభించారు. కాగా, గడచిన ఏడాది కాలంగా అతనికి బాలీవుడ్ లో అవకాశాలు రాలేదని తెలుస్తోంది.