vijetha movie: మా అమ్మాయి ‘కొకొ’ అంటుంటే నాకు అర్థం కాలేదు!: 'విజేత' వేడుకలో అల్లు అర్జున్
- ‘విజేత’ మూవీ విజయోత్సవ వేడుక
- ముఖ్యఅతిథిగా హాజరైన అల్లు అర్జున్
- కల్యాణ్ దేవ్ చాలా బాగా నటించారు
మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ హీరోగా నటించిన తొలి చిత్రం ‘విజేత’ మంచి ప్రేక్షకాదరణను తెచ్చుకుంటోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం విజయోత్సవ వేడుకను హైదరాబాద్ లో ఈరోజు నిర్వహించారు. ఈ వేడుకకు ప్రముఖ నటుడు అల్లు అర్జున్ ముఖ్యఅతిథిగా హాజరయ్యాడు. ఈ సందర్భంగా బన్నీ మాట్లాడుతూ, ఈ చిత్రంలో కల్యాణ్ చాలా బాగా నటించారని, క్లైమాక్స్ బాగుందని చెప్పాడు. అలాగే, నటుడు మురళీశర్మ కూడా అద్భుతంగా నటించారని అన్నారు.
ఈ చిత్రంలోని ‘కో..కొక్కొరోకో..’ పాట గురించి ప్రస్తావిస్తూ ఓ ఆసక్తికర విషయం చెప్పాడు. ‘కల్యాణ్ మా ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయిందని నాకు పంపాడు. ఆ సాంగ్ చాలా బాగుందని చెప్పాను. ఆ తర్వాత నేను ఊరెళ్లాను. ఊరు నుంచి వచ్చాక ఓ రోజున మా ఏడాదిన్నర పాప కారు డెక్ మీద కొడుతూ ‘కొకొ..’ అంటోంది. ‘ఏమంటోంది’ అని నా భార్యను అడిగితే, ‘కల్యాణ్ సినిమా వచ్చింది కదా, అందులోని పాట ‘కొక్కొరోకో’ పాట పెట్టమని అంటోంది’ అని చెప్పింది. మా అబ్బాయికి కూడా ఆ పాట అంటే చాలా ఇష్టం’ అంటూ చెప్పుకొచ్చాడు.