cigarette: సిగరెట్ తాగవద్దన్న అన్న.. చంపేసిన తమ్ముడు
- ఢిల్లీలోని పర్బత్ ప్రాంతంలో ఘటన
- షూ లేస్ ను గొంతుకు బిగించి హత్య
- పోలీసు విచారణలో నిజం ఒప్పుకున్న తమ్ముడు
తమ్ముడిలో పరివర్తన తీసుకురావాలనుకున్న ఓ అన్న... చివరకు తన ప్రాణాలనే పోగొట్టుకున్నాడు. ఈ దారుణ ఘటన ఢిల్లీలోని ఆనంద్ పర్బత్ ప్రాంతంలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే సత్యదేవ్ కుమార్, శిశుపాల్ కుమార్ లు అన్నదమ్ములు. ఒకే ఇంట్లో కలిసి నివాసముంటున్నారు.
తమ్ముడు శిశుపాల్ కు సిగరెట్లు తాగే అలవాటు ఉంది. సిగరెట్లు తాగితే ఊపిరితిత్తులు దెబ్బతిని, ఆరోగ్యం పాడవుతుందని తమ్ముడికి చెప్పాడు అన్న సత్యదేవ్. దీంతో, ఇద్దరి మధ్య చిన్నపాటి వాగ్వాదం చోటు చేసుకుంది. ఆవేశాన్ని తట్టుకోలేక అన్న గొంతుకు షూ లేస్ ను బిగించి, చంపేశాడు తమ్ముడు. ఆ తర్వాత అన్న చనిపోయాడంటూ తండ్రికి సమాచారం ఇచ్చాడు. పోలీసు విచారణలో కూడా అన్నను తానే చంపానని ఒప్పుకున్నాడు.