jayasudha: నేను స్టార్ హీరోయిన్ ను అవుతానని అక్కినేనిగారి శ్రీమతి చెప్పారట: జయసుధ
- 16 యేళ్ల వయసులో 'జ్యోతి' సినిమా చేశాను
- ఆ తరువాత నాగేశ్వరరావు గారిని కలిశాను
- అప్పుడు ఆయన ఆ మాట చెప్పారు
జయసుధ కెరియర్లో చెప్పుకోదగిన చిత్రాల్లో 'జ్యోతి' ముందువరుసలో కనిపిస్తుంది. కెరియర్ ఆరంభంలోనే ఆమెకి ఈ సినిమా ఎంతో పేరు తెచ్చిపెట్టింది. అలాంటి ఈ సినిమాను గురించి తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో జయసుధ ప్రస్తావించారు. 'జ్యోతి' సినిమా సమయంలోనే నేను 16 పూర్తి చేసుకుని 17వ సంవత్సరంలోకి అడుగుపెట్టాను. ఆ షూటింగు సమయంలోనే నేను పుట్టినరోజు వేడుక జరుపుకున్నాను.
ఈ సినిమాలో కేన్సర్ తో బాధపడుతోన్న నా పాత్ర .. ఒక ఆశయ సాధన కోసం ప్రేమించిన వ్యక్తికి దూరమై పెద్ద వయసున్న వ్యక్తిని పెళ్లాడుతుంది. ఈ పాత్ర చేసేటప్పుడు 'నీ కెరియర్ అయిపోయినట్టే' అని కొంతమంది నన్ను భయపెట్టారు. ఆ తరువాత ఎక్కడో అక్కినేని నాగేశ్వరరావుగారిని కలిశాను.
"అమ్మాయ్ .. 'జ్యోతి' అనే సినిమా చేశావా?" అని అడిగారు. 'అవునండి .. రాఘవేంద్రరావుగారి దర్శకత్వంలో చేశాను' అని అన్నాను. 'చాలా బాగుందటా .. మా ఆవిడ చూసింది .. ఈ కొత్తమ్మాయి ఎవరో చాలా బాగుంది .. పెద్ద హీరోయిన్ అవుతుంది అని చెప్పింది' అన్నారు. అలా 'జ్యోతి' సినిమా నాకు చాలా మంచి పేరు తీసుకొచ్చింది" అని జయసుధ చెప్పుకొచ్చారు.