Teja: సందేశం ఇద్దామనుకుంటే చేతులు, కాళ్లూ కాలాయి... ఇక ఆ పని చేయబోను: దర్శకుడు తేజ
- సినిమాలు వినోదం కోసం మాత్రమే
- 'నిజం' విషయంలో తప్పు చేశా
- 'సీత' చిత్రం 'తేజ రామాయణం'
సినిమాలు వినోదానికి మాత్రమే తప్ప, సందేశాలు ఇచ్చేందుకు కాదని దర్శకుడు తేజ అభిప్రాయపడ్డారు. ఓ టీవీ చానల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన, తాను 'నిజం' పేరిట ఓ సందేశాత్మక చిత్రాన్ని నిర్మించి, చేతులు, కాళ్లూ కాల్చుకున్నానని, మరోసారి అదే పని చేసే ప్రయత్నాలు చేయబోనని స్పష్టం చేశారు.
ప్రస్తుతం కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా, బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తీస్తున్న 'సీత' గురించి ప్రస్తావిస్తూ, ఇది తేజ రామాయణమని, ఆ కాలంలో సీత చాలా సాఫ్ట్ మహిళని, తన సీత మాత్రం అగ్రెసివ్ గా ఉంటుందని చెప్పారు. తన అన్ని సినిమాల్లో అమ్మాయిలను స్ట్రాంగ్ గానే చూపిస్తానని, 'సీత' సినిమాలో హీరో, హీరోయిన్లు ఇద్దరికీ సముచిత పాత్రలు ఉంటాయని చెప్పారు.
తాను ఈ కథను కాజల్ కు చెప్పిన తరువాత, తానే ఈ సినిమాను చేస్తానని పట్టుబట్టిందని, ఆ కారణంగానే ఆమెనే ప్రధాన పాత్రకు తీసుకున్నానని స్పష్టం చేశారు. ఏ డైరెక్టర్ అయినా హిట్ ఇస్తేనే గొప్పవారవుతారని, కొట్టారనో, తిట్టారనో పేరు రాదని అన్నారు. ప్రతి శుక్రవారం తమ జాతకాలు మారిపోతుంటాయని అభిప్రాయపడ్డారు.