regina: అవన్నీ పుకార్లేనండీ బాబూ: హీరోయిన్ రెజీనా
- నాకు నిశ్చితార్థం జరగలేదు
- పెళ్లి తేదీ ఖరారు కాలేదు
- ఈ పుకార్లు ఆందోళన కలిగిస్తున్నాయి
తెలుగులో కథానాయికగా రెజీనా మంచి క్రేజ్ తెచ్చుకుంది. అయితే సరైన సమయంలో హిట్లు పడకపోవడంతో, సహజంగానే ఆమె కాస్త వెనుకబడిపోయింది. అవకాశాలు తగ్గడం వలన పెళ్లికి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా వార్తలు వచ్చాయి. ఈ నెల 13వ తేదీన కుటుంబ సభ్యులు .. సన్నిహితుల సమక్షంలో ఆమె నిశ్చితార్థం జరిగిందనీ, వచ్చే ఏడాది ఆమె వివాహం జరగనుందనే ప్రచారం జోరుగా జరుగుతోంది.
ఈ వార్త అంతకంతకూ బలాన్ని పుంజుకుంటూ ఉండటంతో, రెజీనా రంగంలోకి దిగిపోయింది. "వారం రోజులుగా నా పెళ్లి గురించిన వార్తలు షికారు చేస్తున్నాయి. ఇవి అంతకంతకూ ఎక్కువవుతుండటం నాకు ఆందోళన కలిగించింది. ఈ ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదు. నాకు నిశ్చితార్థం జరగలేదు .. పెళ్లి తేదీ ఫిక్స్ కాలేదు. ఇలాంటి పుకార్లు ఎవరు పుట్టిస్తున్నారో .. ఎందుకు పుట్టిస్తున్నారో అర్థం కావడం లేదు. నిజంగానే నాకు పెళ్లి కుదిరితే ఆ విషయాన్ని నేనే స్వయంగా తెలియజేస్తాను .. అప్పటివరకూ ఇలాంటి పుకార్లు నమ్మొద్దు" అని చెప్పుకొచ్చింది.