Lavanya: నాకు నిత్యామీనన్ అంటే ఇష్టం: 'ఉండిపోరాదే' హీరోయిన్ లావణ్య
- చైల్డ్ ఆర్టిస్ట్ గా 'డార్లింగ్' చేశాను
- షార్ట్ ఫిలిమ్స్ గుర్తింపు తెచ్చాయి
- ఆమెలా మంచి పేరు తెచ్చుకోవాలని వుందన్న లావణ్య
తెలుగు తెరకి 'ఉండిపోరాదే' సినిమాతో కొత్త హీరోయిన్ పరిచయమైంది .. ఆ అమ్మాయి పేరే 'లావణ్య'. సినిమా ఫలితం ఎలా ఉన్నప్పటికీ, లుక్స్ పరంగా .. నటన పరంగా లావణ్య మంచి మార్కులు కొట్టేసింది. తాజా ఇంటర్వ్యూలో లావణ్య మాట్లాడుతూ, "నేను 6వ తరగతి చదువుతున్నప్పుడే శ్రీకాంత్ గారి సినిమా 'అ ఆ ఇ ఈ' సినిమాలోను, ప్రభాస్ 'డార్లింగ్' సినిమాల్లోను చైల్డ్ ఆర్టిస్ట్ గా చేశాను. ఆ తరువాత పూర్తిగా చదువుపైనే దృష్టిపెట్టాను.
'భీమవరం' కాలేజ్ లో బీటెక్ చదువుతూ షార్ట్ ఫిలిమ్స్ చేశాను .. అవి మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఈ నేపథ్యంలోనే 'ఉండిపోరాదే' సినిమాలో చేసే అవకాశం వచ్చింది. ఈ సినిమాలో నాకు మంచి పాత్ర పడింది. నటనకి అవకాశం వున్న ఈ తరహా పాత్రలు చేయడానికి నేను ఆసక్తిని చూపుతాను. మొదటి నుంచి కూడా నాకు నిత్యామీనన్ నటన అంటే ఇష్టం. ఆమె సినిమాలు ఎక్కువగా చూస్తాను. హీరోయిన్ గా ఆమెలా మంచి పేరు తెచ్చుకోవాలని వుంది" అని చెప్పుకొచ్చింది.