vijay: హీరో విజయ్ ఇంట్లో బాంబ్ ఉందని ఫోను చేసి కంగారు పెట్టించిన గుర్తు తెలియని వ్యక్తి!
- గత అర్ధరాత్రి పోలీసులకు ఫోన్
- బాంబు స్క్వాడ్‌తో ఆయన ఇంటికి వెళ్లిన పోలీసులు
- బాంబు లేదని తేల్చిన పోలీసులు
తమిళ హీరో విజయ్ ఇంట్లో బాంబు పెట్టారని గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ కాల్ చేయడంతో కలకలం చెలరేగింది. గత అర్ధరాత్రి పోలీసులకు ఫోన్ చేసిన ఆ వ్యక్తి సాలగ్రామంలోని విజయ్ ఇంట్లో బాంబ్ ఉందని, ఆయన ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని చెప్పాడు. ఈ ఫోన్ కాల్ అందుకున్న వెంటనే పోలీసులు బాంబు స్క్వాడ్‌తో ఆయన ఇంటికి వెళ్లి గాలింపు చర్యలు చేపట్టారు.
అయితే, ఆయన ఇంటి వద్ద బాంబు లేక పోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. తప్పుడు సమాచారం ఇచ్చిన ఆ వ్యక్తిని పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇటీవలే సినీనటుడు రజనీకాంత్ నివాసంలో బాంబు ఉందని పేర్కొంటూ ఓ గుర్తు తెలియని వ్యక్తి ఇదే విధంగా ఫోను చేసి చెప్పాడు. అయితే, ఆయన ఇంట్లో బాంబు లేదని పోలీసులు తేల్చి, ఈ పని చేసింది మతిస్థిమితం లేని ఓ ఎనిమిదో తరగతి విద్యార్థి అని గుర్తించారు.