Chiranjeevi: ఈ రోజు రెండు పండుగలు... చిరంజీవికి ప్రముఖుల శుభాకాంక్షలు
- చిరుకి తెలంగాణ గవర్నర్ శుభాకాంక్షలు
- మరిన్ని మైలురాళ్లు అందుకోవాలన్న తమిళిసై
- తమ 'ఆచార్యు'డు చిరంజీవేనన్న బన్నీ, వరుణ్ తేజ్
- వినాయక చవితి, చిరంజీవి పుట్టినరోజు పండుగలు వచ్చాయన్న పరుచూరి
మెగాస్టార్ చిరంజీవి ఈ రోజు పుట్టినరోజు వేడుక జరుపుకుంటున్న సందర్భంగా ఆయనకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు చెప్పారు. చిరంజీవి ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు.
'మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీ అద్భుతమైన నటనా కౌశలంతో ప్రేక్షకులను మరింతగా అలరించాలని ఆశిస్తున్నాను. ప్రజలకు సేవ చేయడానికి మీకు ఆయురారోగ్యాలను ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. మీ కెరీర్లో మరిన్ని గొప్ప మైలురాళ్లు అందుకోవాలని ఆశిస్తున్నాను' అని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ట్వీట్ చేశారు.
'స్వయం కృషితో మెగాస్టార్ గా ఎదిగి, తెలుగు చలనచిత్ర పరిశ్రమకే వన్నె తెచ్చిన మీ సినీ ప్రస్థానం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం. తెలుగింటి అభిమాన నటుడిగా ప్రజా హృదయాల్లో తనదైన ముద్ర వేసుకున్న మిత్రులు, శ్రేయోభిలాషి శ్రీ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను' అని బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పేర్కొన్నారు. వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు, టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు కూడా చిరుకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
'చిరంజీవి నాకు మంచి మిత్రుడు, అతని పేరులోనే ఉంది చిరంజీవి అంటే ఆంజనేయస్వామి. అంటే ఎల్లకాలము చిరంజీవివై వర్ధిల్లుగాక. అంటే నిండు నూరేళ్లు ఉత్సాహంగా కుటుంబ సభ్యులతో పుట్టినరోజు జరుపుకోవాలని ఆ షిరిడీ సాయినాథున్ని కోరుకుంటున్నాను. బెస్ట్ ఆఫ్ లక్ మై డియర్ ఫ్రెండ్' అని సినీనటుడు మోహన్ బాబు ట్వీట్ చేశారు.
'ఆయన మెగా స్టార్ మాత్రమేకాదు మెగామనసున్న మహామనిషి. నేడు మెగా అభిమానులకు రెండు పండుగలు. ఒకటి వినాయక చవితి పండుగ. రెండు వారు అభిమానించే దేవుడు చిరంజీవిగారి పుట్టినరోజు పండుగ. సినీ కార్మికులకు తమను ఆదుకుంటున్న ఆపద్భాంధవుడి జన్మదిన వేడుక జన్మదిన శుభాకాంక్షలు చిరంజీవి గారు. శతమానం భవతు' అని సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ పేర్కొన్నారు.
'మన వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్‌కి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన పట్ల నాకు ఎల్లప్పుడూ గౌరవం, కృతజ్ఞత ఉంటాయి. ఆయనే నా నిజమైన ఆచార్యుడు' అని అల్లు అర్జున్ పేర్కొన్నారు. తన 'ఆచార్య' చిరంజీవేనంటూ వరుణ్ తేజ్ కూడా ట్వీట్ చేశాడు. 'హ్యాపీబర్త్ డే చిరంజీవి గారు' అంటూ జూనియర్ ఎన్టీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.
'చిరు నా బెస్ట్ ఫ్రెండ్.. ఆయన ఎల్లప్పుడు ఆయురారోగ్యాలతో ఉండాలని నేను కోరుకుంటాను. హ్యాపీ బర్త్ డే చిరంజీవి' అని సీనియర్ నటి రాధిక పేర్కొన్నారు.
'వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ అన్నయ్యకు జన్మదిన శుభాకాంక్షలు' అంటూ సినీనటుడు సునీల్ ట్వీట్ చేశాడు.