Dil Raju: పుట్టినరోజు సందర్భంగా దిల్ రాజు కీలక నిర్ణయం
- దిల్ రాజు 50వ పుట్టినరోజు
- ఇకపై చురుగ్గా సామాజిక సేవ చేయాలని నిర్ణయం
- సమాజానికి తిరిగివ్వాలని భావిస్తున్నట్టు వెల్లడి
- ఆసక్తి ఉన్నవాళ్లు తమతో కలవొచ్చని ఆహ్వానం
- విద్య, ఆరోగ్యపరమైన అంశాలకు ప్రాధాన్యత అని వివరణ
దిల్ సినిమాతో హిట్ కొట్టి అదే పేరును తన ఇంటి పేరుగా మార్చుకున్న దిల్ రాజు ఇవాళ పుట్టినరోజు సందర్భంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై తాను సామాజిక సేవలోనూ భాగస్వామినవుతానని వెల్లడించారు. చిత్ర నిర్మాణంతో పాటు సామాజిక సేవల రంగంలోనూ తన కార్యకలాపాలు కొనసాగుతాయని వివరించారు.
ఇటీవలే తాను సెకండ్ లైఫ్ ప్రారంభించానని, ఏంచేయాలన్న ఆలోచన నుంచి పుట్టిందే ఈ సామాజిక సేవా నిర్ణయం అని తెలిపారు. సమాజానికి ఏదైనా తిరిగివ్వాలన్నదే తన అభిమతమని దిల్ రాజు స్పష్టం చేశారు. ఈ కొత్త కార్యాచరణలో తానొక్కడినే కాదని, సామాజిక సేవపై ఆసక్తి ఉన్నవాళ్లెవరైనా తమతో చేయి కలపొచ్చని స్పష్టం చేశారు.
మీడియా దృష్టికి వచ్చే సమస్యలను తన దృష్టికి తెస్తే వాటిని పరిష్కరించేందుకు సాధ్యమైనంత మేర కృషి చేస్తానని వెల్లడించారు. అయితే, విద్య, ఆర్యోగ పరమైన అంశాలకే తన తొలి ప్రాధాన్యత అని దిల్ రాజు వివరించారు.