UK: కేన్సర్ గుట్టును తేల్చేందుకు.. అతిచిన్న కెమెరాలు మింగనున్న 11 వేల మంది!
- బ్రిటన్ ఎన్ హెచ్ఎస్ ప్రయోగాత్మక పరిశీలన
- సెకనుకు రెండు ఫొటోలు తీయనున్న కెమెరా
- ఆదిలోనే కేన్సర్ లను గుర్తించొచ్చంటున్న నిపుణులు
- కరోనాతో దేశంలో ఆగిన ఎండోస్కోపీ పరీక్షలు
- 2001 నుంచే అమెరికాలో టెక్నాలజీ
11,000 మంది.. అక్షరాలా పదకొండు వేల మంది చిన్న చిన్న కెమెరాలు మింగబోతున్నారు. ఆ కెమెరాలు ఎంత చిన్నగా ఉంటాయంటే.. ఏదైనా జబ్బు వస్తే మనం వేసుకునే ఓ గొట్టం గోలి (క్యాప్సూల్) పరిమాణంలోనే ఉంటాయి. అవేం చేస్తాయనేనా మీ అనుమానం? మామూలు కెమెరాల్లాగే అవీ ఫొటోలు తీస్తాయి. నోటి నుంచి మొదలై.. గొంతు, పేగులు, పొట్ట భాగాలను క్లిక్ మనిపిస్తాయి. ఎందుకంటారా..? కేన్సర్ ఉందా? లేదా? తెలుసుకోవడానికి.
బ్రిటన్ లోని పెద్దాస్పత్రి అయిన నేషనల్ హెల్త్ సర్వీసెస్ (ఎన్ హెచ్ఎస్) ఈ ప్రయోగం చేయబోతోంది. 40 ప్రాంతాల్లో 11 వేల మందితో ఈ పిల్ కెమెరాలను మింగించనుంది. ప్రస్తుతం శరీరం లోపలి భాగాల్లో జబ్బులను గుర్తించేందుకు వాడుతున్న ఎండోస్కోపీకి ఇది ప్రత్యామ్నాయమని ఎన్ హెచ్ఎస్ నిపుణులు చెబుతున్నారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో దాదాపు అన్ని ఆస్పత్రుల్లోనూ ఎండోస్కోపీ పరీక్షలను ఆపేశారని అక్కడి అధికారులు చెబుతున్నారు. కొన్ని చోట్ల చేస్తున్న అతికొద్ది మందికి మాత్రమే ఆ సేవలు అందుతున్నాయి.
ఈ నేపథ్యంలోనే ‘కొలన్ క్యాప్సూల్ ఎండోస్కోపీ’గా పిలిచే పిల్ కెమెరాలను ప్రయోగాత్మకంగా ఎన్ హెచ్ఎస్ వాడబోతోంది. 23 మిల్లీమీటర్ల సైజులో ఉండే ఈ కెమెరా సెకనుకు రెండు ఫొటోలను తీసి.. సమాచారాన్ని మణికట్టుకు పెట్టుకునే పరికరానికి పంపుతుంది. ఆ డేటా ద్వారా పెద్దపేగు కేన్సర్ ఉందో లేదో తెలుసుకోనున్నారు వైద్య నిపుణులు. దీని ద్వారా పొట్ట, పేగు కేన్సర్ లను ఆదిలోనే తెలుసుకునే వీలుంటుందని భావిస్తున్నారు. కాగా, 2001 నుంచే అమెరికాలో ఈ టెక్నాలజీని వాడుతున్నారు.