Charan: 'డ్రైవింగ్ లైసెన్స్' రీమేక్ సంగతి చరణ్ తేల్చేదెప్పుడో!
- మలయాళంలో హిట్ కొట్టిన 'డ్రైవింగ్ లైసెన్స్'
- అక్కడ భారీ వసూళ్లను రాబట్టిన సినిమా
- హిందీ రీమేక్ కోసం మొదలైన సన్నాహాలు
- తెలుగు రీమేక్ హక్కులు చరణ్ చేతిలో
మలయాళంలో కొంతకాలం క్రితం వచ్చిన 'డ్రైవింగ్ లైసెన్స్' సినిమా అక్కడ భారీ విజయాన్ని అందుకుంది. కేవలం 4 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ సినిమా అక్కడ 30 కోట్లను రాబట్టింది. పృథ్వీరాజ్ సుకుమారన్ - సూరజ్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి, జీన్ పాల్ లాల్ దర్శకత్వం వహించాడు.
ఈ సినిమా రీమేక్ హక్కుల కోసం వివిధ భాషలకి చెందినవారు పోటీ పడ్డారు. హిందీలో ఈ సినిమా రీమేక్ హక్కులను కరణ్ జొహార్ సొంతం చేసుకున్నాడు. అక్షయ్ కుమార్ - ఇమ్రాన్ హష్మీ కాంబినేషన్లో, రాజ్ మెహతా దర్శకత్వంలో త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి వెళుతోంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు చకచకా జరుగుతున్నాయి.
ఇక తెలుగులో ఈ సినిమా రీమేక్ హక్కులు చరణ్ దగ్గర ఉన్నాయి. పవన్ కల్యాణ్ - రవితేజ కాంబినేషన్లో ఆయన ఈ సినిమా చేయనున్నట్టు ఆ మధ్య వార్తలు వచ్చాయి కానీ, అవి కార్యరూపాన్ని దాల్చలేదు. ప్రస్తుతం చరణ్ పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నాడు. మరి ఆయన ఈ రీమేక్ సంగతి ఎప్పుడు తేల్చుతాడో చూడాలి మరి.