Kangana Ranaut: హీరోయిన్ల దుస్తులపై ప్రశ్నించిన జర్నలిస్టు.. 'ఇక కూర్చో' అంటూ కంగనా రనౌత్ ఆగ్రహం
- మీడియా సమావేశంలో పాల్గొన్న కంగన
- మహిళ ధరించిన దుస్తులు ఆధారంగా కామెంట్లు వస్తున్నాయన్న జర్నలిస్టు
- దీపికా పదుకొణె దుస్తుల విషయంలో వచ్చిన విమర్శలపై ప్రశ్న
- దీపిక తనను తాను రక్షించుకోగలదన్న కంగన
ఓ జర్నలిస్టుపై సినీ హీరోయిన్ కంగనా రనౌత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కంగన హోస్ట్ గా కొత్త రియాల్టీ షో 'లాక్ అప్' త్వరలో ఏఎల్టీ బాలాజీ, ఎంఎక్స్ ప్లేయర్ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో ప్రసారం కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆ షో నిర్వాహకులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఈ షో కోసం ఏక్తా కపూర్ క్రియేట్ చేసిన కాన్సెప్ట్ తనకెంతో నచ్చిందని, అందుకే తాను ఈ షో చేస్తున్నానని చెప్పింది.
ఈ సందర్భంగా, ఓ జర్నలిస్టు వేసిన ప్రశ్న ఆమెకు చిరాకు తెప్పించింది. ఈ మధ్య కాలంలో మహిళ ధరించిన దుస్తుల ఆధారంగా ఎదుటివాళ్లు ఆమె ప్రవర్తనపై కామెంట్ చేస్తున్నారని, బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణె కూడా ఇదే విషయంపై విమర్శలు ఎదుర్కొన్నారని సదరు జర్నలిస్టు అన్నాడు. దీపికా పదుకొణె, సిద్ధాంత్, అనన్య పాండే నటించిన గెహ్రియాన్ సినిమా ప్రచారంలో దీపిక ధరించిన దుస్తులపై విపరీతంగా కామెంట్లు వచ్చాయని చెప్పాడు.
దీనిపై కంగనా రనౌత్ ఎలా స్పందిస్తారని అడిగాడు. దీంతో ఆ జర్నలిస్టుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ 'ఇక కూర్చో..' అని కంగన కసురుకుంది. తమను తాము రక్షించుకోలేని వారిని రక్షించడానికి తాను ఇక్కడ ఉన్నానని, దీపికా పదుకొణె మాత్రం తనను తాను రక్షించుకోగలదని, ఆమెకు ఆ అధికారం ఉందని చెప్పింది. దీపిక సినిమా గురించి మాట్లాడి ఈ ప్లాట్‌ఫామ్‌పై తాను ఆ సినిమాకు ప్రచారం చేయనని చెప్పింది.