naresh: అందుకే ఆమెకు దూరంగా ఉంటున్నా.. రమ్యతో నాకు ఏ సంబంధమూ లేదు: సీనియర్ సినీ నటుడు నరేశ్
- రమ్య రఘుపతిపై పోలీసు కేసు
- డబ్బులు వసూళ్లకు పాల్పడుతోందంటూ ఫిర్యాదులు
- పెళ్లి తర్వాత తమ మధ్య స్పర్థలు వచ్చాయన్న నరేశ్
- ఆరేళ్ల క్రితం నుంచే దూరంగా ఉంటున్నానని వెల్లడి
- రమ్యపై పలు ఆరోపణలు చేసిన నటుడు
సీనియర్ సినీ నటుడు నరేశ్ మాజీ భార్య రమ్య రఘుపతిపై పోలీసు కేసు నమోదైన విషయం తెలిసిందే. నరేశ్ పేరుతో రమ్య డబ్బులు వసూళ్లకు పాల్పడుతోందంటూ కొందరు హైదరాబాదులోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీనిపై నరేశ్ ఈ రోజు అన్నీ వివరిస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. రమ్య జరిపే వ్యాపార, ఆర్థిక వ్యవహారాలతో తనకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
తమ ఇద్దరి మధ్య స్పర్థలు రావడంతో గత ఐదారేళ్లుగా ఆమెకు దూరంగా ఉంటున్నట్లు తెలిపారు. అసలు తాను ఆమెకు ఎందుకు దూరమయ్యానన్న విషయంపై కూడా ఆయన స్పందించారు. తమ వివాహం తరువాత కూడా ఆమె ఇటువంటి వ్యవహారాలు చేస్తుండడం వల్లే దూరమయ్యానని అన్నారు.
ఇలాంటి ఘటనలు మనోవేదనకు గురిచేస్తున్నాయంటూ ఆవేదన చెందారు. ఫిర్యాదు చేసిన వారికి సొమ్ములిచ్చి సర్దుబాటు చేసుకునే యోచనలో రమ్య ఉన్నట్లు తెలిసిందని ఆయన అన్నారు. రమ్య గురించి మీడియాలో కూడా చాలా వార్తలు వస్తున్నాయని ఆయన అన్నారు. దీంతో చాలా మంది తనకు ఫోన్ చేశారని, అందుకే తాను ఈ విషయంపై క్లారిటీ ఇస్తున్నానని తెలిపారు.
అసలు రమ్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. ఆరేళ్ల నుంచి తాము వేర్వేరుగా ఎవరి బతుకు వాళ్లం బతుకుతున్నామని ఆయన అన్నారు. ఆమె వ్యాపార లావాదేవీలతో పాటు ఆమెకు ఉన్న అప్పుల సమస్యల గురించి వస్తున్న వార్తలతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. అంతేగాక, తాను మూడు నెలల క్రితం ఈ విషయంపై పేపర్లో పబ్లిక్ నోటీసు కూడా ఇచ్చానని ఆయన వివరించారు.