Raghu Rama Krishna Raju: తణుకు టీడీఆర్ బాండ్ల అక్రమాల్లో అంతిమ లబ్దిదారులు ఎవరో మంత్రి బొత్స చెప్పాలి: రఘురామకృష్ణరాజు

Raghurama comments on Tanuku municipality TDR Bonds issue
  • తణుకు మున్సిపాలిటీలో అక్రమాలు అంటూ టీడీపీ ఆరోపణ
  • టీడీఆర్ బాండ్లతో కోట్లు కొల్లగొట్టారన్న పట్టాభిరాం
  • ప్రభుత్వ విచారణ జరపాలన్న రఘురామ
  • నివేదిక బహిర్గత పరచాలని డిమాండ్
  • లబ్దిదారులు టీడీపీ వాళ్లేనన్న బొత్స
తణుకు పురపాలక సంఘంతో భూములు కొనిపించి, వాటిని మళ్లీ టీడీఆర్ బాండ్ల రూపంలోకి మార్చుకుని రూ.390 కోట్ల మేర అక్రమాలకు పాల్పడ్డారంటూ టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరాం వైసీపీ ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావుపై సంచలన ఆరోపణలు చేశారు. ఈ అంశంపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు స్పందించారు. తణుకు టీడీఆర్ బాండ్ల అక్రమాల్లో అంతిమ లబ్దిదారులు ఎవరో తేల్చాలని డిమాండ్ చేశారు. ఈ అక్రమాల గుట్టును మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించాలని అన్నారు.

కేవలం అధికారులను సస్పెండ్ చేసి చేతులు దులుపుకుంటే సరిపోదని పేర్కొన్నారు. రెండు రెట్లు ఇవ్వాల్సిన టీడీఆర్ లకు, సుమారు రూ.390 కోట్లకు పైగా ఇవ్వాల్సిన అవసరం ఏంటని రఘురామ ప్రశ్నించారు. అయితే, ఈ వ్యవహారంలో స్థానిక ప్రజాప్రతినిధులేనా? లేక, పైస్థాయి ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారా? అనేది తేలాలని ఆయన అన్నారు.  

తణుకు మున్సిపాలిటీలో జరిగిన వ్యవహారాలను రాష్ట్రంలోని ఇతర మున్సిపాలిటీలు కూడా అనుసరించాయా అనేది పురపాలక శాఖ మంత్రి బొత్స, నగరపాలక సహాయక కమిషనర్ శ్రీలక్ష్మి విచారణ జరపాలని, దానిపై ఓ నివేదిక రూపొందించి మీరు, మీ ముఖ్యమంత్రి చూడడంతో సరిపెట్టుకోకుండా, ఆ నివేదికను ప్రజలకు కూడా బహిర్గతం చేయాలని రఘురామ డిమాండ్ చేశారు.

మరోపక్క, తణుకు టీడీఆర్ బాండ్ల వ్యవహారంపై మంత్రి బొత్స స్పందించారు. దీనిపై ప్రభుత్వం విచారణ జరుపుతుందని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో టీడీపీ సానుభూతిపరులే లబ్దిదారులని ఆరోపించారు. వారందరూ ఒకే సామాజిక వర్గానికి చెందినవారని బొత్స పేర్కొన్నారు. 
Raghu Rama Krishna Raju
TDR Bonds
Tanuku Municipality
Botsa Satyanarayana
Karumuri Nageswararao
YSRCP
Andhra Pradesh

More Telugu News