Doctor Archana: డాక్టర్ అర్చన ఆత్మహత్యపై భావోద్వేగానికి గురైన హీరోయిన్ ప్రణీత
- ప్రసవం సమయంలో చనిపోయిన ఒక మహిళ
- డాక్టర్ అర్చనే కారణమంటూ కేసు నమోదు
- అవమానకరంగా భావించి ఆత్మహత్య చేసుకున్న అర్చన
రాజస్థాన్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పని చేస్తున్న డాక్టర్ అర్చన ఆత్మహత్యకు పాల్పడటం దేశ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ ఆత్మహత్యపై భారతీయ వైద్య సంఘం తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. వివరాల్లోకి వెళ్తే, ప్రసవం సమయంలో ఓ మహిళ మరణించింది. దీంతో డాక్టర్ అర్చనపై ఆమె కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ క్రమంలో ఆమెపై పోలీసు కేసు నమోదయింది. అయితే సదరు మహిళ మరణానికి తాను కారణమని నిందించడాన్ని అవమానకరంగా భావించిన అర్చన ఆత్మహత్య చేసుకున్నారు. అంతేకాదు, అమాయక వైద్యులను వేధించవద్దని సూసైడ్ నోట్ కూడా రాశారు.
ఈ నేపథ్యంలో అర్చనకు హీరోయిన్ ప్రణీత మద్దతుగా స్పందించింది. తాను నిర్దోషి అని నిరూపించుకోవడానికి ఓ వైద్యురాలు తన జీవితాన్ని ముగించడం బాధాకరమని వ్యాఖ్యానించారు. ప్రతి సందర్భంలో ఒక డాక్టర్ వేధింపులకు గురవుతున్నారని... దీంతో మరొకరి ప్రాణాన్ని కాపాడేందుకు మరో 100 మంది డాక్టర్లు రిస్క్ తీసుకోవడాన్ని మానేస్తున్నారని చెప్పారు. ఈ క్రమంలో దురదృష్టకరంగా మీరు ఎంతో ప్రేమించే వ్యక్తి మూల్యం చెల్లించుకునే పరిస్థితి రావచ్చని... ఈ విషయం మీకు తెలియకుండానే జరిగిపోతుందని అన్నారు.