Balineni Srinivasa Reddy: పవన్ కల్యాణ్ కోరినట్టుగా చేనేత దుస్తులు ధరించిన బాలినేని... పవన్ స్పందన ఇదిగో!
- నేడు జాతీయ చేనేత దినోత్సవం
- చేనేత వస్త్రాల చాలెంజ్ విసిరిన కేటీఆర్
- చంద్రబాబు, బాలినేని వాసు, లక్ష్మణ్ లను నామినేట్ చేసిన పవన్
- పవన్ చాలెంజ్ ను స్వీకరించిన బాలినేని
ఇవాళ (ఆగస్టు 7) జాతీయ చేనేత దినోత్సవం. ఈ సందర్భంగా తెలంగాణ మంత్రి కేటీఆర్ విసిరిన చేనేత ఛాలెంజ్ ను స్వీకరించిన జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్... టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు, వైసీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, బీజేపీ నేత డాక్టర్ కె.లక్ష్మణ్ లను నామినేట్ చేశారు.
ఈ నేపథ్యంలో, పవన్ ఛాలెంజ్ పట్ల బాలినేని వాసు వెంటనే స్పందించారు. చేనేత దుస్తులను ధరించిన ఫొటోను ట్విట్టర్ లో పంచుకున్నారు. పవన్ కల్యాణ్ విసిరిన చేనేత ఛాలెంజ్ ను స్వీకరించానని వెల్లడించారు. వైఎస్సార్ ప్రభుత్వంలో చేనేత మంత్రిగా చిత్తశుద్ధితో పనిచేశానని తెలిపారు. నాడు వైఎస్సార్ రూ.300 కోట్ల మేర చేనేతలకు రుణమాఫీ చేశారని వివరించారు.
ఇవాళ తమ నాయకుడు వైఎస్ జగన్ ప్రభుత్వంలోనూ చేనేత కార్మికుల సంక్షేమం కోసం నేతన్న నేస్తం తదితర పథకాలు అమలు చేస్తున్నామని బాలినేని పేర్కొన్నారు. అప్పుడైనా, ఇప్పుడైనా చేనేతల సంక్షేమం కోసం, వారి అభివృద్ధి కోసం నిజాయతీతో పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. అందరూ చేనేత వస్త్రాలు ధరించాలని పిలుపునిచ్చారు.
దీనిపై జనసేనాని పవన్ కల్యాణ్ స్పందించారు. "గౌరవనీయ బాలినేని వాసు గారూ... నాడు చేనేత కార్మికుల అభ్యున్నతి కోసం మీరు చిత్తశుద్ధితో చేసిన ప్రయత్నాలు అభినందనలకు నోచుకున్నాయి. ఇప్పుడు మీరు నా చాలెంజ్ ను స్వీకరించి చేనేత కార్మికుల పట్ల మరోసారి మీ అంకితభావాన్ని ప్రదర్శించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సర్" అంటూ పవన్ ట్వీట్ చేశారు.