Samantha: తొలి సినిమాకు 13 ఏళ్లు.. సమంత స్పందన
- ‘ఏమాయ చేసావె’ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సమంత
- తనపై ప్రేమను చూపిస్తున్న అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతూ ఇన్ స్టాలో పోస్ట్
- గతంలో ఎన్నో విషయాలు బాధించేవని.. ఇకపై అలా జరగదని వెల్లడి
- ప్రతి రోజూ ప్రేమ, కృతజ్ఞతతో ముందుకు సాగుతున్నానని వ్యాఖ్య
‘ఏమాయ చేసావె’ అని యువకులు కలవరించిన నటి సమంత. తొలి సినిమాతోనే ప్రేక్షకుల గుండెల్లో చెరిగిపోని స్థానం సంపాదించుకుంది. ఏమాయ చేసావె సినిమా వచ్చి ఇప్పటికి 13 ఏళ్లు గడిచిపోయాయి. ఈ నేపథ్యంలో అభిమానులను ఉద్దేశిస్తూ ఇన్ స్టా గ్రామ్ లో సమంత ఓ పోస్ట్ పెట్టింది. తనపై ప్రేమను చూపిస్తున్న అభిమానులకు కృతజ్ఞతలు తెలిపింది.
‘‘నేను ఎంత ఎదిగినా.. ఎంత దూరం వెళ్లినా.. మీరు చూపించే ప్రేమ, అభిమానాన్ని మరిచిపోలేను. అందుకు ధన్యవాదాలు. గతంలో ఎన్నో విషయాలు నన్ను బాధించేవి. కానీ ఇకపై అలా జరగబోదు. ప్రతి రోజూ ప్రేమ, కృతజ్ఞతతో మాత్రమే ముందుకు సాగుతున్నా. థ్యాంక్యూ’’ అని సమంత పేర్కొంది.
అక్కినేని నాగ చైతన్య హీరోగా ఏమాయా చేసావె సినిమా 2010 ఫిబ్రవరిలో విడుదలైంది. ఇందులో ‘జెస్సీ’ పాత్రలో నటించిన సమంత యువతలో క్రేజ్ సంపాదించుకుంది. తన తొలి సినిమా హీరో నాగచైతన్యను 2017లో పెళ్లి చేసుకుంది. కానీ వ్యక్తిగత కారణాలతో వారిద్దరూ విడిపోయారు. సమంత నటించిన శాకుంతలం సినిమా త్వరలోనే రిలీజ్ కానుంది.