Ravi Shastri: తండ్రికి లేని రికార్డును అర్జున్ టెండూల్కర్ సొంతం చేసుకున్నాడు: రవిశాస్త్రి
- ఇటీవల ఐపీఎల్ అరంగేట్రం చేసిన సచిన్ తనయుడు
- సన్ రైజర్స్ తో మ్యాచ్ లో తొలి వికెట్ అందుకున్న అర్జున్ టెండూల్కర్
- సచిన్ ఐపీఎల్ లో ఒక్క వికెట్ కూడా తీయలేదన్న రవిశాస్త్రి
- ఆఖరి ఓవర్ ఎలా వేయాలన్నదానిపై అర్జున్ కు పూర్తి స్పష్టత ఉందని వెల్లడి
- యార్కర్లు అద్భుతంగా వేశాడని కితాబు
బ్యాటింగ్ మ్యాస్ట్రో సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ ఐపీఎల్ అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల ముంబయి ఇండియన్స్-సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ లో చివరి ఓవర్ వేసిన అర్జున్ టెండూల్కర్ అద్భుతంగా బౌలింగ్ చేసి ఓ వికెట్ కూడా సాధించాడు. దీనిపై క్రికెట్ దిగ్గజం రవిశాస్త్రి స్పందించారు.
తండ్రి సచిన్ టెండూల్కర్ కు లేని రికార్డును తనయుడు అర్జున్ టెండూల్కర్ సాధించాడని కొనియాడారు. సచిన్ టెండూల్కర్ ఐపీఎల్ లో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడని, కానీ అర్జున్ మాత్రం ఓ వికెట్ తీశాడని వివరించారు.
కాగా, సన్ రైజర్స్ పై చివరి ఓవర్ ను ఎలా వేయాలన్నదానిపై అర్జున్ టెండూల్కర్ కు పూర్తి స్పష్టత ఉందని రవిశాస్త్రి విశ్లేషించారు. పేస్ ను ఎప్పటికప్పుడు మార్చాడని, కచ్చితత్వంతో కూడిన యార్కర్లను ప్రతిభావంతంగా సంధించాడని అభినందించారు.