Tovino Thomas: '2018' మూవీ ఓటీటీలో రానుందనే టాక్ పై స్పందించిన బన్నీ వాసు!
- మలయాళంలో ఈ నెల 5న విడుదలైన '2018'
- అక్కడ హిట్ టాక్ తెచ్చుకున్న సినిమా
- ఈ నెల 26వ తేదీన తెలుగులో విడుదల
- ఇప్పట్లో ఈ సినిమా ఓటీటీలో రాదన్న బన్నీవాసు
ఈ మధ్య కాలంలో మలయాళంలో విడుదల రోజునే హిట్ టాక్ తెచ్చుకున్న సినిమాల జాబితాలో, '2018' కూడా చేరిపోయింది. కావ్య ఫిల్మ్ కంపెనీవారు నిర్మించిన ఈ సినిమాకి, ఆంటోని జోసెఫ్ దర్శకత్వం వహించాడు. '2018'లో కేరళలో వచ్చిన వరదల నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది.
ఈ నెల 5వ తేదీన విడుదలైన ఈ సినిమా, విడుదల రోజునే సక్సెస్ టాక్ తెచ్చుకుంది. ఆ తరువాత కూడా ఈ సినిమా అదే ఊపుతో వసూళ్లను రాబడుతూ దూసుకుపోతోంది. టోవినో థామస్ .. కుంచకో బోబన్ .. కల్యాణ్ అరసన్ .. అపర్ణ బాలమురళి .. తన్వీ రామ్ ప్రధానమైన పాత్రలను పోషించారు.
ఈ సినిమా తెలుగు వెర్షన్ ఈ నెల 26వ తేదీన విడుదల కానుంది. ఈ నేపథ్యంలో కొంతసేపటి క్రితం హైదరాబాదులో ప్రెస్ మీట్ జరిగింది. గీతా ఆర్ట్స్ 2 వారు ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా వచ్చేవారం ఓటీటీలో రానుందనే ప్రచారం జరుగుతోందనీ, అలాంటిదేమీ లేదని బన్నీవాసు తేల్చి చెప్పాడు.