Suman: నా జీవితమే ఒక మిరాకిల్: హీరో సుమన్
- హీరోగా 45 ఏళ్లు పూర్తిచేసిన సుమన్
- హీరోను అవుతానని అనుకోలేదని వెల్లడి
- తన వెనుక ఎవరూ లేరని వ్యాఖ్య
- అంతా దేవుడే ఇచ్చాడంటూ వివరణ
హీరో సుమన్ నటుడిగా 45 ఏళ్లను పూర్తిచేసుకున్నారు. సుదీర్ఘమైన ఈ కెరియర్లో ఆయన ఎన్నో విభిన్నమైన .. విలక్షణమైన పాత్రలను పోషించారు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. "నాకు ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేదు. నా ఫ్యామిలీకి సంబంధించిన వాళ్లెవరికీ సినిమాలతో ఎలాంటి సంబంధం లేదు. నటుడిగా నాకు ఎలాంటి అనుభవమూ లేదు" అన్నారు.
"కాలేజ్ చదువు అయిపోయిన తరువాత ఏదైనా ఉద్యోగం చేయాలనీ అనుకున్నాను. అంతే తప్ప సినిమాల్లో నటించాలనే ఆలోచన అప్పటికి లేనే లేదు. అలాంటి నేను సినిమాల్లోకి రావడం .. ఎదగడం .. నా వరకూ నేను చాలానే సాధించానని అనుకుంటున్నాను. సూపర్ హీరోననే భావిస్తున్నాను" అని చెప్పారు.
"నేను ఇన్ని సినిమాలు చేయాలి .. నెంబర్ వన్ కావాలి అనే ఎలాంటి టార్గెట్ పెట్టుకుని ఇండస్ట్రీకి రాలేదు. ఇండస్ట్రీలో నా వెనుక ఎవరూ లేకపోవడం వలన అలా అనుకునే అవకాశం కూడా లేదు. కానీ భగవంతుడు నాకు ఒక పొజీషన్ ఇచ్చాడు .. నన్ను తీసుకుని వెళ్లి నేను అనుకోని చైర్లో నన్ను కూర్చోబెట్టాడు. నా లైఫ్ ఒక మిరాకిల్ అనే నేను చెబుతాను" అని అన్నారు.