Sachin: సచిన్ అనే పేరుతో రైల్వే స్టేషన్... తన ఫొటో ద్వారా పరిచయం చేసిన గవాస్కర్
- గుజరాత్ లోని సూరత్ కు సమీపంలో సచిన్ అనే గ్రామం
- రైల్వే స్టేషన్ లో ఫొటో దిగిన గవాస్కర్
- ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు
గుజరాత్ లోని సూరత్ కు సమీపంలో ఉన్న ఓ రైల్వే స్టేషన్ పేరు సచిన్. అయితే ఇది క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ కు, ఈ రైల్వే స్టేషన్ కు ఎలాంటి సంబంధం లేదు. ఆ ఊరి పేరే సచిన్. ఇంతకీ ఈ రైల్వే స్టేషన్ గురించి ఎలా తెలిసిందంటే... క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఓ పర్యటన సందర్భంగా సచిన్ స్టేషన్ కు వెళ్లాడు. ఆ స్టేషన్ పేరు సచిన్ అని ఉండడం చూసి ఆశ్చర్యపోయిన ఆయన ఈ విషయాన్ని ఓ ఫొటో ద్వారా అందరికీ తెలియజేశాడు.
సచిన్ తన అభిమాన క్రికెటర్ అని, సచిన్ అనే పేరుతో ఓ రైల్వే స్టేషన్ ఉండడం తనకు సంతోషాన్నిచ్చిందని గవాస్కర్ వెల్లడించాడు. అంతేకాదు, గత శతాబ్దంలోని వారికి ఎంతో ముందు చూపు ఉందని, సచిన్ ఘనతలను అప్పుడే ఊహించి స్టేషన్ కు పేరుపెట్టేశారని చమత్కరించాడు. ఈ మేరకు ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేశాడు. గవాస్కర్ పోస్టుకు విపరీతమైన స్పందన వస్తోంది.