Perni Nani: పవన్ తన పార్టీని చంద్రబాబుకు లాంగ్ లీజుకు ఇచ్చేశారు: పేర్ని నాని సెటైర్
- జనసేన ఓ టెంట్ హౌస్ పార్టీ అంటూ విమర్శలు
- చంద్రబాబు మనుగడ కోసమే పవన్ పనిచేస్తాడన్న పేర్ని నాని
- పవన్ కు రాష్ట్ర ప్రజలపై ప్రేమ లేదని వ్యాఖ్యలు
వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని జనసేనాని పవన్ కల్యాణ్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పవన్ కల్యాణ్ కు రాష్ట్ర ప్రజలపై ప్రేమ లేదని, చంద్రబాబు మనుగడ కోసమే పవన్ కల్యాణ్ పనిచేస్తాడని అన్నారు. పవన్ తన పార్టీని చంద్రబాబుకు లాంగ్ లీజుకు ఇచ్చేశాడని వ్యంగ్యం ప్రదర్శించారు.
తాను నాలుగేళ్ల కిందటే చెప్పానని, పవన్ కల్యాణ్ స్థాపించింది రాజకీయ పార్టీ కాదని, ఒక టెంట్ హౌస్ పార్టీ అని విమర్శించారు. మన ఇళ్లలో పండుగలు, పబ్బాలు, వేడుకలు చేసుకునేందుకు షామియానాలు, కుర్చీలు అద్దెకు తెచ్చుకుంటామని, అలాగే పవన్ కల్యాణ్ కూడా తన పార్టీని అద్దెకు ఇస్తుంటాడని ఎద్దేవా చేశారు.
పవన్ కల్యాణ్, ఆయన కుటుంబ సభ్యులు తెలంగాణలోనే ఓటేస్తారని, రాజకీయాలు మాత్రం ఏపీలో చేస్తుంటారని పేర్ని నాని వ్యాఖ్యానించారు. కానీ తాను, జగన్ మాత్రం చనిపోయినా ఏపీలోనే, తమ శవాలను పూడ్చినా ఏపీలోనే అని పేర్ని నాని భావోద్వేగంతో అన్నారు.