Sukesh Chandrasekhar: కవిత అరెస్టుపై జైలు నుంచి సుఖేశ్ చంద్రశేఖర్ సంచలన లేఖ
- ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టై మండోలి జైలులో ఉన్న సుఖేశ్ చంద్రశేఖర్
- కవిత అక్కయ్య అంటూ సంబోధిస్తూ తీవ్ర ఆరోపణలు
- లిక్కర్ స్కామ్ కేసులో నిజం రుజువైందంటూ సుఖేశ్ చురకలు
- బీఆర్ఎస్ పార్టీ సింగపూర్, హాంకాంగ్, జర్మనీలో వేలకోట్లు దాచిందంటూ ఆరోపణ
- అవినీతి సూత్రధారి అరవింద్ కేజ్రీవాల్‌ను కాపాడేందుకు నిజాన్ని దాచే ప్రయత్నం చెయ్యొద్దని కవితకు సలహా
- మిమ్మల్ని త్వరలో ముఖాముఖి చూస్తాను అక్కా అంటూ లేఖలో పేర్కొన్న సుఖేశ్ చంద్రశేఖర్
- తదుపరి వికెట్ ఢిల్లీ సీఏం కేజ్రీవాల్‌దేనని జోస్యం
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయిన సుఖేశ్ చంద్రశేఖర్ ప్రస్తుతం మండోలి జైలులో ఉన్న విషయం తెలిసిందే. అయితే, తాజాగా సుఖేశ్ చంద్రశేఖర్ ఎమ్మెల్సీ కవిత అరెస్టుపై స్పందించాడు. జైలు నుంచి లేఖ విడుదల చేశాడు. కవిత అక్కయ్య అంటూ సంబోధిస్తూ తీవ్ర ఆరోపణలతో విరుచుకుపడ్డాడు. "లిక్కర్ స్కామ్ కేసులో నిజం రుజువైంది. బూటకపు కేసులని, రాజకీయ ప్రతీకారమని, ఇన్నాళ్లూ నీవు చేసిన వాదన అబద్ధమని తేలిపోయింది. మీ పార్టీ వేలకోట్లను సింగపూర్, హాంకాంగ్, జర్మనీలో దాచింది. నెయ్యి డబ్బాలన్న మీ కథలపై దర్యప్తు జరుగుతోంది. నన్ను ఎవరూ ఏమీ చేయలేరని అనుకునే వారు. కానీ, కొత్త భారతదేశంలో చట్టమే అన్నింటికన్నా శక్తివంతమైంది. నేను గతంలో విడుదల చేసిన లేఖల్లో రెండు అంశాలు పొందుపరిచాను. అందులో ఒకటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి, రెండోది తిహార్ క్లబ్‌లో చేరేందుకు కవితకు కౌంట్‌డౌన్ మొదలైంది. ఈ రెండూ ఇప్పుడు నిజమయ్యాయని అనిపిస్తోంది. కవిత అరెస్టుతో అవినీతి పండోరా బాక్స్ ఓపెన్ అయింది. కవితతో పాటు ఆమె అవినీతి సహాయకులు, అవినీతి రాజు అరవింద్ కేజ్రీవాల్ చేసిన అక్రమాలన్నీ బయటపడతాయని" చెప్పుకొచ్చాడు.
కేజ్రీ, సిసోడియాతో కవిత కుమ్మక్కు
వేలాది కోట్ల రూపాయల ప్రజాధనం లూటీ చేసి సింగపూర్, హంకాంగ్, జర్మనీవంటి దేశాలకు పంపిన విషయాలు బయటికి వస్తాయి. ఇది ఎవరికి అర్థం కావాలో వారికి అర్థమైందని అనుకుంటున్నాను. అక్కా!.. నేను వాట్సాప్ చాట్ స్క్రీన్ షాట్ల ద్వారా బయటపెట్టిన నెయ్యి డబ్బాల కథలు, రేంజ్ రోవర్ కలెక్షన్ కథలు, గోవా కథలు, కాంట్రాక్ట్ కథలు దర్యాప్తులో నిజమని తేలాయి. బయటపడే మార్గమే లేదు అక్కా. ఇప్పటికైనా నా విన్నపం ఒక్కటే.. అవినీతి సూత్రధారి అరవింద్ కేజ్రీవాల్‌ను కాపాడేందుకు నిజాన్ని దాచే ప్రయత్నం చెయ్యొద్దు. ఎందుకంటే ఈ దేశ ప్రజలు, న్యాయస్థానాలు నిజం తెలుసుకున్నాయి. ఇందుకు కావాల్సినంత సాక్ష్యాలు, ఆధారాలు ఉన్నాయి.
త్వరలో మిమ్మల్ని ముఖాముఖి చూస్తాను అక్కా: సుఖేశ్ చంద్రశేఖర్
ఏదేమైనా ఈడీ, సీబీఐ కన్‌ఫ్రంటేషన్‌లో భాగంగా మిమ్మల్ని త్వరలో ముఖాముఖి చూస్తాను. మా గ్రేటెస్ట్ తిహార్ జైలుకు స్వాగతం అక్కా.. మీ మరో సోదరుడు, అవినీతి సూత్రధారి అరవింద్ కేజ్రీవాల్ మీకు జైలులో లగ్జరీ జీవితం అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేసి ఉంటారు. ఈ లేఖను ముగించే ముందు మరొక్క మాట చెప్పాలి.. సినిమా ఇంకా మిగిలే ఉంది. కేజ్రీవాల్ జీ.. తదుపరి ఇక మీరే. ఎంత ప్రయత్నించినా సాధ్యం కాదు. సినిమా క్లైమాక్స్‌కు చేరుకుంది. కేజ్రీవాల్ జీ.. నా సోదరసోదరీమణులకు తిహార్ క్లబ్‌కు స్వాగతం పలుకుతున్నాను. అని సుఖేశ్ చంద్రశేఖర్ తన లేఖలో పేర్కొన్నాడు.