KTR: ఆటోడ్రైవర్ల సత్తా తెలుసు... మా ఓటమిలో మీ పాత్ర కూడా ఉంది: కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

KTR participated in Indira pak Mahadharna

  • ఆటోవాలాలు భాషా సినిమాలో రజనీకాంత్‌లా 50 వేలమందిని తీసుకురాగలరన్న కేటీఆర్
  • కానీ ఎన్నికల సమయంలో దొంగలను నమ్మి మోసపోయారని వ్యాఖ్య
  • ఈ సినిమా మరో నాలుగేళ్లు ఉందన్న కేటీఆర్
  • ఒక్కసారి తప్పు చేశాక... మరో నాలుగేళ్లు భరించాల్సిందేనని వ్యాఖ్య

ఆటో డ్రైవర్ల సత్తా మాకు తెలుసు... మీరు తలుచుకుంటే భాషా సినిమాలో రజనీకాంత్‌లా 50 వేలమందిని తీసుకురాగలరని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గత ఎన్నికల్లో మమ్మల్ని (బీఆర్ఎస్) ఓడించడంలో మీ పాత్ర కూడా ఉందని ఆటో డ్రైవర్లను ఉద్దేశించి అన్నారు. అయితే ఆటో డ్రైవర్లు ఆ రోజు దొంగల మాటలు నమ్మి మోసపోయారన్నారు. ఇందిరాపార్క్ వద్ద నిర్వహించిన ఆటో డ్రైవర్ల మహాధర్నాలో కేటీఆర్ కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మార్పు మార్పు అని కాంగ్రెస్ అంటే ఆటో డ్రైవర్లతో పాటు యావత్ తెలంగాణ నమ్మి మోసపోయిందన్నారు. రాహుల్ గాంధీ అశోక్ నగర్ వచ్చి.. ఛాయ్ తాగి ఫోజు కొట్టి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పాడని... కానీ దానిని నెరవేర్చలేదన్నారు. రైతుబంధు రూ.15 వేలు, వృద్ధులకు పెన్షన్ల పెంపు... ఇలా ఏ హామీని అమలు చేయలేదన్నారు.

ఈ సినిమా ఇంకా నాలుగేళ్లు (కాంగ్రెస్ ప్రభుత్వం మరో నాలుగేళ్లు ఉంటుందనే ఉద్దేశంలో) ఉందన్నారు. ఒక్కసారి తప్పు చేస్తే భరించాల్సిందే అన్నారు. అయితే తమను ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా... జైల్లో పెట్టినా మీ తరఫున కొట్లాడుతామని హామీ ఇచ్చారు. మన హక్కుల గురించి మనం కొట్లాడితే తప్పులేదన్నారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ పార్టీని కోరుతున్నామన్నారు.

ఎంతోమంది ఆటో డ్రైవర్ల పరిస్థితి చాలా దారుణంగా ఉందన్నారు. ఉచిత బస్సు ప్రయాణానికి బీఆర్ఎస్ వ్యతిరేకం కాదని... కానీ హామీ మేరకు ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్ల సంక్షేమానికి సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని, ఇందుకోసం రానున్న బడ్జెట్‌లో నిధులు కేటాయించాలన్నారు. ఉచిత ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలన్నారు. 420 హామీలు ఇచ్చి... అడ్డగోలు గ్యారెంటీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీపై ఒత్తిడి చేసేందుకు అన్ని పార్టీలు ఒక్కటి కావాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. సంఘటితమైన పోరాటాలు కార్మికుల హక్కులను కాపాడేందుకే అన్నారు.

ఎన్నికలకు మరో నాలుగేళ్ల సమయం ఉందని... కాబట్టి అప్పటి రాజకీయం అప్పుడు చూసుకుందామన్నారు. కాబట్టి అప్పటి వరకు అన్ని పార్టీలు కలిసిమెలిసి కార్మికుల సమస్యలపై పోరాడాల్సి ఉందన్నారు. ఆటో డ్రైవర్ల ధర్నా గురించి, వారి డిమాండ్ల గురించి తాము అసెంబ్లీలో, బయటా కొట్లాడుతామన్నారు.

పోలీసులకు విజ్ఞప్తి

ఈ మహాధర్నా సందర్భంగా కేటీఆర్ పోలీసులకు కూడా ఓ విజ్ఞప్తి చేశారు. పోలీసులు తమ విధులను నిర్వర్తించాలని... కానీ పేదవారి పట్ల, ఇలాంటి (ధర్నాలు) సమయాల్లో... పోలీసులు కాస్త మానవత్వం చూపాలన్నారు. రేవంత్ రెడ్డికి పోలీసులపై నమ్మకం లేదని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో పోలీసు పరిస్థితి కూడా ఏమీ బాగా లేదన్నారు. పోలీసులతోనే బెటాలియన్ పోలీసుల కుటుంబాలను కొట్టించారని ఆరోపించారు. 

  • Loading...

More Telugu News