Budda Venkanna: నిన్ను ఢిల్లీలో పెట్టిన చంద్రబాబును అవమానించావ్: అవంతి శ్రీనివాస్ పై బుద్దా వెంకన్న ఫైర్

- నిన్న వైసీపీకి రాజీనామా చేసిన అవంతి శ్రీనివాస్
- కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడిన అవంతి
- అవంతి శ్రీనివాస్ ను ఊసరవెల్లి అన్న బుద్దా వెంకన్న
మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ నిన్న వైసీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. రాజీనామా చేసిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... జగన్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. కూటమి ప్రభుత్వానికి ఏడాది సమయం కూడా ఇవ్వకుండా విమర్శలు గుప్పిస్తున్నారని మండిపడ్డారు. ఆరు నెలలకే ధర్నాలు చేద్దామని అంటున్నారని దుయ్యబట్టారు.
ఈ నేపథ్యంలో అవంతి శ్రీనివాస్ పై టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న విమర్శలు గుప్పించారు. ఊసరవెల్లి అవంతి శ్రీనివాస్.. నీ లాంటి ఊసరవెల్లిలు మాకేం సమయం ఇవ్వాల్సిన అవసరం లేదని అన్నారు. 'ప్రజలకు తెలుసు వైసీపీ ప్రభుత్వంలో నాయకులు సర్వం నాకేశారని. అందులో నువ్వు, జగన్ రెడ్డి కూడా బాగస్వాములే. నీకు రాజకీయ జన్మనిచ్చిన చిరంజీవి గారి కుటుంబం, పవన్ కల్యాణ్ కే ద్రోహం చేసావ్. నీకు రాజకీయ పునర్జన్మ ఇవ్వడమే కాదు, గల్లీ స్థాయి వ్యక్తివైన నిన్ను ఢిల్లీలో పెట్టిన చంద్రబాబు గారిని అవమానించావ్. నీ సానుభూతి ఈ కుటమి ప్రభుత్వానికి ఏమి అవసరం లేదు' అని ట్వీట్ చేశారు.