లెజెండ్ శరవణన్ కథానాయకుడిగా తమిళంలో రూపొందిన సినిమానే 'లీడర్'. దురై సెంథిల్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, శరవణన్ సొంత బ్యానర్లో నిర్మితమైంది. ఈ ఏడాది ఏప్రిల్ 3వ తేదీన థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, యావరేజ్ అనే టాక్ తెచ్చుకుంది. ఈ రోజు (మే 29)వ తేదీ నుంచి ఈ సినిమా 'అమెజాన్ ప్రైమ్'లో స్ట్రీమింగ్ అవుతోంది. తమిళంతో పాటు తెలుగు .. మలయాళ .. కన్నడ భాషల్లోను అందుబాటులో ఉంది.
తమిళనాడులోని 'తూత్తుకూడి'లోని ఒక గ్యారేజ్ లో శక్తివేల్ (శరవణన్) మెకానిక్ గా పనిచేస్తుంటాడు. అతని ఏడేళ్ల కూతురే ఐరేని (ఇయల్)ను ఒక కార్పొరేట్ స్కూల్లో చదివిస్తూ ఉంటాడు. తన భార్య మీరా (పాయల్) ను తానే షూట్ చేసిన శక్తివేల్, తల్లిలేని ఆ బిడ్డను ఎంతో గారాబంగా పెంచుకుంటూ ఉంటాడు. ఆ పాప వినికిడి సమస్యతో బాధపడుతూ ఉంటుంది. ఆ సమస్య నుంచి తన కూతురును బయటపడేయడానికి అవసరమైన డబ్బు కోసమే అతను కష్టపడి పనిచేస్తూ ఉంటాడు. హార్బర్ లో ఉన్న 'సాల్ట్' (కాలకేయ ప్రభాకర్) బ్యాచ్ కి సంబంధించిన కార్ల రిపేర్ శక్తివేల్ చూస్తుంటాడు.
హార్బర్ లోని ఒక కంటెయినర్ ను 'సాల్ట్' కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటాడు. ఆ కంటెయినర్ లో ఏం ఉందనేది తెలుసుకోవాలనే పట్టుదలతో పోలీస్ ఆఫీసర్ ఇందిర ( ఆండ్రియా) ఉంటుంది. అయితే అనవసరమైన విషయాలను పట్టించుకుని ఆపదలో పడొద్దని డీసీపీ భక్తవత్సలం (శ్యామ్) ఆమెని హెచ్చరిస్తాడు. అయినా పట్టించుకోకుండా ఆమె ముందుకు వెళుతుంది. సాల్ట్ పర్యవేక్షణ ఉన్న ఆ ప్రదేశంలోకి వెళ్లడానికి మెకానిక్ శక్తివేల్ కి అవకాశం ఉందని ఆమె తెలుసుకుంటుంది.
సాల్ట్ కారులో తాను ఇచ్చే 'ఆడియో బగ్' పెట్టమని శక్తివేల్ ను ఇందిర కోరుతుంది. అయితే అందుకు అతను నిరాకరిస్తాడు. శక్తివేల్ ను ఇందిర రహస్యంగా వచ్చిన కలిసి వెళ్లడం సాల్ట్ కి తెలుస్తుంది. దాంతో శక్తివేల్ ను .. అతని కూతురు ఐరేనిను అంతం చేయాలనే నిర్ణయానికి సాల్ట్ వస్తాడు. సాల్ట్ ను ఆదేశించే పెద్ద తలకాయ ఎవరు? అతని కారణంగా శక్తివేల్ కీ .. కూతురికి ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి? తన భార్యను శక్తివేల్ ఎందుకు షూట్ చేస్తాడు? అసలు అతని నేపథ్యం ఏమిటి? అనేది మిగతా కథ.
హార్బర్ ను అడ్డాగా చేసుకుని అక్రమ కార్యకలాపాలు సాగించే ఒక మాఫియా ముఠా. ఆ ముఠాను అడ్డుకోలేక వాళ్లకి అనుకూలంగా మారిపోయిన పోలీస్ ఆఫీసర్లు కొంతమంది. ఈ అరాచకాలను చూడలేక అసహనంతో రగిలిపోయే పోలీస్ ఆఫీసర్లు మరికొంతమంది. అటు మాఫియాకి .. ఇటు పోలీస్ వర్గానికి మధ్యలోకి అమాయకంగా వెళ్లి చిక్కుకున్న ఒక సాధారణ మెకానిక్. ఇలా ఈ మూడు వైపుల నుంచి ఈ కథ నడుస్తూ ఉంటుంది.
తమ అక్రమ వ్యాపారానికి అడ్డొస్తే మాఫియా వదిలిపెట్టదు. తన కూతురు జోలికి వస్తే మెకానిక్ ఊరుకోడు. ఇక నిజాయితీ పరులైన పోలీస్ ఆఫీసర్లను అవినీతి పోలీస్ అధికారులు సహించరు. అయితే కథ ఈ మూడు బృందాల చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. హీరో ఒక సాధారణ మెకానిక్ అనే విషయాన్ని చూపిస్తూనే, లేదు అతను కనిపించేంత సాఫ్ట్ కాదు అనే హింట్ ఇస్తూ దర్శకుడు ఆ పాత్రను నడిపిస్తూ ఉంటాడు.
ఇక హీరో ఎందుకు ఇలా ఒక సామాన్యుడిగా మారిపోయాడు? అంతకుముందు ఆయన ఏం చేసేవాడు? తనను ప్రేమించిన యువతినీ .. తన బిడ్డకు తల్లిని ఎందుకు షూట్ చేయవలసి వచ్చింది? అనే ఒక సందేహం ఆడియన్స్ ను వెంటాడుతూ ఉంటుంది. ఆ సస్పెన్స్ ను ఎప్పుడు రివీల్ చేస్తారా అనే ఒక కుతూహలం ప్రేక్షకులలో తలెత్తుతుంది. ఇక 'డెవిల్'గా పిలవబడే విలన్ పోర్షన్ .. పోలీస్ ఆఫీసర్ ఇందిర తండ్రి పోర్షన్ కూడా ఆసక్తిని కలిగిస్తాయి.
దర్శకుడు ఈ కథలో లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ ఉండేలా చూసుకున్నాడు. అయితే లవ్ వైపు నుంచి ఎక్కువగా టచ్ చేయలేదు. ఎమోషన్స్ ఉన్నాయిగానీ అంతగా కనెక్ట్ కావు. ఎటొచ్చి యాక్షన్ సీన్స్ కాస్త హడావిడి చేస్తాయి. కార్ల ఛేజింగ్ .. కంటెయినర్ల ఛేజింగ్ .. ట్రైన్ లోని యాక్షన్ సీక్వెన్స్ .. 42 మంది స్టూడెంట్స్ ను సేవ్ చేయడం వంటి సీన్స్ ఆకట్టుకుంటాయి.
కథానాయకుడిగా శరవణన్ కి ఇది రెండో సినిమా. నటన విషయంలో ఆయన మరింత కసరత్తు చేయవలసిన అవసరం కనిపిస్తుంది. నిర్మాణం విషయంలో ఆయన ఎక్కడా రాజీ పడకపోవడం కనిపిస్తుంది. పాయల్ పాత్రకి పెద్దగా ప్రాధాన్యత లేదు .. కాసేపు అందంగా మెరుస్తుంది అంతే. చైల్డ్ ఆర్టిస్ట్ 'ఇయల్' క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో ఆకట్టుకుంటుంది. శ్యామ్ .. లాల్ .. సంతోష్ ప్రతాప్ తమ పాత్రలకి న్యాయం చేశారు.
ఎస్ వెంకటేశ్ ఫొటోగ్రఫీ బాగుంది. యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించిన తీరు మెప్పిస్తుంది. జిబ్రాన్ నేపథ్య సంగీతం సన్నివేశాలకు తగినట్టుగా సాగుతుంది. ప్రదీప్ రాఘవ్ ఎడిటింగ్ కూడా నీట్ గా అనిపిస్తుంది. భారీతనం .. యాక్షన్ సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయంతే. అంతకుమించి కథాకథనాలలో కొత్తదనమేమీ కనిపించదు. రొటీన్ కి భిన్నంగా ఏమీ అనిపించదు.
'లీడర్' (అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ!
Leader Review
Movie Details
Movie Name: Leader
Release Date: 2026-05-29
Cast: Legend Saravanan, Payal Rajput, Shaam, Andrea Jeremiah, Santhosh Prathap,Iyal
Director: R S Durai Senthilkumar
Music: Ghibran Vaibodha
Banner: Legend Saravana Stores
Review By: Peddinti
Disclaimer:
This review is based on the reviewer’s individual perspective. Audience opinions may vary.
Trailer