కన్నడలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ 'కరికాడ'. నటరాజ్ హీరోగా ఆయన సొంత బ్యానర్లో ఈ సినిమా నిర్మితమైంది. యశ్ శెట్టి కీలకమైన పాత్రను పోషించిన ఈ సినిమాలో,నిరీక్ష శెట్టి కథానాయికగా కనిపిస్తుంది. వెంకటేశ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ ఏడాది ఫిబ్రవరి 6వ తేదీన థియేటర్లకు వచ్చింది. అలాంటి ఈ సినిమా ఈ నెల 29వ తేదీ నుంచి 'అమెజాన్ ప్రైమ్' లో స్ట్రీమింగ్ అవుతోంది. కన్నడతో పాటు తెలుగులోను అందుబాటులోకి వచ్చింది.
అది అడవిని ఆనుకుని ఉన్న ఒక మారుమూల గ్రామం. ఆ గ్రామానికి ఓ మోతుబరి రైతు భూపతి (బల్ రాజ్) ప్రెసిడెంట్ గా ఉంటాడు. అతనికి మల్లి (యశ్ శెట్టి) కాంత (విపిన్ ప్రకాశ్) అనే ఇద్దరు కొడుకులు ఉంటారు. ఇక జార్జ్ అనే యువకుడు కూడా ప్రెసిడెంట్ కి నమ్మకస్తుడిగా ఉంటాడు. ప్రెసిడెంట్ మేనకోడలు 'కనక' ( నిరీక్ష) ఆ ఇంట్లోనే పెరుగుతుంది. ఆమె పేరుతో భూమి ఉండటం వలన, తన కొడుకు 'కాంత'కి ఇచ్చి పెళ్లి చేయాలని భూపతి నిర్ణయించుకుంటాడు. అయితే ఆమె 'కాడ'ను ఇష్టపడుతూ ఉంటుంది.
'కాడ'కి వయసు పైబడిన తండ్రి తప్ప మరెవరూ లేరు. అతను తన కష్టాన్ని నమ్ముకుని బ్రతుకుతుంటాడు. అడవి పందులను వేటాడటంలో ఆయనకి మంచి నైపుణ్యం ఉంటుంది. చేనులోకి అడవిపందులు రాకుండా అతను కాపలా కాస్తూ ఉంటాడు. అక్కడ అతనిని 'కనక' రహస్యంగా కలుస్తూ ఉంటుంది. అయితే ఆమె కలవారి అమ్మాయి కావడం వలన, కాడ పెద్దగా ఆసక్తిని చూపించడు. ఆమె మనసులో ఏముందనేది భూపతికి అర్థమైపోతుంది.
'కనక' గనుక 'కాడ'ను పెళ్లి చేసుకుంటే తన కుటుంబ పరువు ప్రతిష్ఠలు దెబ్బతింటాయి. అంతేకాదు కనక పేరుతో ఉన్న భూమి తన చేజారిపోతుందని భూపతి భావిస్తాడు. అందువలన కాడ అడ్డు తొలగించుకోవాలని భావిస్తాడు. అందుకోసం అతను తన ఇద్దరు కొడుకులను రంగంలోకి దింపుతాడు. ఆ ముగ్గురూ కలిసి ఏం చేస్తారు? వారి కారణంగా 'కాడ'కి ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయి? అనేది మిగతా కథ.
చరిత్రను ఒకసారి పరిశీలిస్తే భూమికోసం యుద్ధాలు జరిగాయి. భుక్తి కోసం తిరుగుబాట్లు జరిగాయి. అలాగే స్త్రీ కోసం పోరాటాలు జరిగాయి. భూమి కోసం .. స్త్రీ కోసం జరిగే పోరాటమే ఈ సినిమా కథ. ఈ అంశాన్ని ప్రధానంగా చేసుకునే దర్శకుడు ఈ కథను అల్లుకున్నాడు. ఒక ప్రెసిడెంట్ .. ఆ ఇంటికి చెందిన ఓ అందమైన అమ్మాయి .. అడవి పందులను వేటాడే ఒక యువకుడు. ఈ ముగ్గురి చుట్టూ ఈ కథ తిరుగుతూ ఉంటుంది.
అడవి నేపథ్యంలో సాగే కథలో అందమైన ప్రేమకథ కూడా భాగం కావడంతో, ఆడియన్స్ ఈ సినిమా నుంచి లవ్ .. రొమాన్స్ ఆశిస్తారు. హీరోయిన్ వర్షంలో .. రాత్రివేళలో హీరోను కలుసుకునే సన్నివేశాలు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాయి. కానీ హీరో ఆమె పట్ల తనకి ఎలాంటి ఫీలింగ్స్ లేవని కసురుకుంటూ ఆడియన్స్ ను నిరుత్సాహ పరుస్తూ వెళతాడు.
తన మేనకోడలు వేరొకరిపై మనసు పడటం ప్రెసిడెంట్ కి నచ్చదు. అవతల వ్యక్తి ఆమెను ప్రేమించడం ..ప్రేమించకపోవడం అనే విషయాలు ప్రెసిడెంట్ కి అనవసరమైన విషయం. అందువలన హీరో .. హీరోయిన్స్ మధ్య రొమాన్స్ ఉంచవలసింది. అందుకు అవకాశం లేకుండా చేయడం ప్రధానమైన లోపంగానే చెప్పుకోవాలి. ఒక బలమైన ట్రాక్ బలహీనపడినట్టుగా మనకి అనిపిస్తుంది.
హీరో అడవి పందులను వేటాడే సన్నివేశాలు .. శత్రువుల బారి నుంచి తప్పించుకునే సన్నివేశాలు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాయి. ఈ కథను చెప్పడానికి దర్శకుడు ఎంచుకున్న లొకేషన్స్ ఎక్కువ మార్కులు కొట్టేస్తాయని చెప్పాలి. అక్కడక్కడా అనవసరమైన సన్నివేశాలు ఉన్నాయి. అలాగే ఈ సినిమా ఆరంభంలోను .. క్లైమాక్స్ లోను జోడించిన ఒక అంశం ఆడియన్స్ ను అయోమయానికి గురిచేస్తుంది. ఆ విషయాన్ని ఎలా తీసుకోవాలా అనే ఒక విషయం సామాన్య ప్రేక్షకుడికి అర్థం కాదు.
ఇక సినిమా చివరిలో ఒక ట్విస్ట్ ఉంటుంది. ఆడియన్స్ గెస్ చేయని ఆ ట్విస్ట్ థ్రిల్ ఫీలయ్యేలా చేస్తుంది. కెమెరా పనితనం .. నేపథ్య సంగీతం ఫరవాలేదు. ఎడిటింగ్ వైపు నుంచి చూస్తే, ట్రిమ్ చేయవలసిన సన్నివేశాలు కనిపిస్తాయి. యాక్షన్ ను తప్ప మరే అంశాన్ని వాడుకోలేకపోయారు. ప్రధానమైన కథ ఆసక్తికరంగానే ఉన్నప్పటికీ, అదనంగా జోడించిన అంశం అయోమయానికి గురిచేసిందని చెప్పాలి.
'కరికాడ' (అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ!
Karikaada Review
Movie Details
Movie Name: Karikaada
Release Date: 2026-05-29
Cast: Kaada Nataraj, Nireksha Shetty, Yash Shetty, Balrajwadi, Krithi Varma, Vijay Chandar
Director: Venkatesh
Music: Athishay Jain
Banner: Riddhi Entertainments
Review By: Peddinti
Disclaimer:
This review is based on the reviewer’s individual perspective. Audience opinions may vary.
Trailer