'అన్నీ మంచి శకునములే' - మూవీ రివ్యూ

Movie Name: Anni Manchi Shakunamule

Release Date: 2023-05-18
Cast: Santhosh Sobhan, Malavika Nair, Rajendra Prasasd, Rao Ramesh, Naresh, Gowthami
Director: Nandini Reddy
Producer: Priyanka Dutt
Music: Mickey J Meyar
Banner: Swapna Cinema
Rating: 2.50 out of 5
  • నందినీరెడ్డి నుంచి వచ్చిన 'అన్నీ మంచి శకునములే'
  • బలహీనమైన కథాకథనాలు 
  • పేలవమైన సన్నివేశాలు
  • సరిగ్గా డిజైన్ చేయని ప్రధానమైన పాత్రలు 
  • మాళవిక నటనకు ఎక్కువ మార్కులు

సహజంగానే నందినీ రెడ్డి సినిమాల్లో ఇటు యూత్ కి నచ్చే అంశాలు, అటు ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చే అంశాలు పెనవేసుకుపోయి కనిపిస్తూ ఉంటాయి. సున్నితమైన భావోద్వేగాలతో ప్రేమ నడుస్తూ, అది బలమైన ఎమోషన్స్ మధ్య పెద్దల ఆశీస్సులు అందుకుంటూ ఉంటుంది. ఇక ఈ మధ్యలో సరదాలు .. సందళ్లు కూడా కాస్త బలంగానే కనిపిస్తూ ఉంటాయి. అలాంటి నందినీ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన సినిమానే 'అన్నీ మంచి శకునములే'. టైటిల్ తోనే పాజిటివ్ బజ్ తెచ్చుకున్న ఈ సినిమా, ఎన్ని మార్కులు సంపాదించుకుందనేది ఇప్పుడు చూద్దాం.

దివాకర్ (రావు రమేష్) .. సుధాకర్ (నరేశ్) అన్నదమ్ములు. ప్రసాద్ (రాజేంద్రప్రసాద్)తో వారికి ఆస్తి తాలూకు గొడవలు ఉంటాయి. తాతల కాలం నాటి కాఫీ ఎస్టేట్ లో తమ వాటాలకి సంబంధించిన గొడవ చాలాకాలంగా కోర్టులో నడుస్తూ ఉంటుంది. ఒకరిని చూస్తే ఒకరు శత్రుత్వంతో రగిలిపోతుంటారు. సుధాకర్ భార్య వసుధ .. ప్రసాద్ భార్య మీనాక్షి (గౌతమి) ఒకేసారి నెలతప్పుతారు. వారికి పురిటి నొప్పులు మొదలవ్వగానే ఒకే హాస్పిటల్లో చేరుస్తారు. 

డాక్టర్ జగదాంబ (ఊర్వశి)కి మందుకొట్టే అలవాటు ఉంటుంది. ఆ మత్తులోనే ఆమె సుధాకర్ భార్యకు .. ప్రసాద్ భార్యకు డెలివరీ చేస్తుంది. ప్రసాద్ కి కూతురు పుడుతుంది ... సుధాకర్ కి కొడుకు పుడతాడు. అయితే ఆ మత్తులో ఆ డాక్టర్ పాపను సుధాకర్ కి .. బాబును ప్రసాద్ కి ఇస్తుంది. ఆ తరువాత జరిగిన పొరపాటును గ్రహించినప్పటికీ, గొడవ అవుతుందని భయపడి ఆ నిజాన్ని తనలోనే దాచుకుంటుంది. సుధాకర్ దంపతులు పాపకి 'ఆర్య' అని పేరు పెడతారు. ప్రసాద్ దంపతులు బాబుకి 'రిషి' అని నామకరణ చేస్తారు. ఇద్దరూ కూడా టీనేజ్ లోకి అడుగుపెడతారు. 

రిషి (సంతోష్ శోభన్)  ప్రతి విషయాన్ని చాలా తేలికగా తీసుకుంటూ ఉంటాడు. ఆర్య (మాళవిక నాయర్) మాత్రం కాఫీ బిజినెస్ లోనే ఎదగాలనే పట్టుదలతో ఉంటుంది. ఆర్యపై మనసు పారేసుకున్న రిషి, బిజినెస్ పనిపై ఆమెతో పాటు ఇటలీ వెళ్లవలసిన తండ్రిని తెలివిగా ఆపేస్తాడు. తన తండ్రికి కుదరడం లేదంటూ ఆమెతో తాను ఇటలీ వెళతాడు. అక్కడ ఏం జరుగుతుంది? ఆ సంఘటన వారి జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? రెండు కుటుంబాల మధ్య ఆస్తుల గొడవలు ఎంత వరకూ వెళతాయి? పిల్లల మార్పిడి ఎలా బయటపడుతుంది? అనేది మిగతా కథ.

నందినీరెడ్డి ఇంతవరకూ తెరకెక్కిస్తూ వచ్చిన సినిమాలు చూస్తే, ఓ మాదిరి బడ్జెట్ లో చేసినవే కనిపిస్తాయి. కథ ఒక ఫ్రేమ్ లో ఇమిడిపోయి ఉంటుంది .. పరిమితమైనవే అయినా, ఆ పాత్రలు ఎంతో కొంత ప్రత్యేకతను .. ప్రాధాన్యతను సంతరించుకుని కనిపిస్తాయి. ఆ పాత్రల విషయంలో ప్రేక్షకులకు పూర్తి క్లారిటీ ఉంటుంది. ఇంతకుముందు ఆమె చేసిన సినిమాలకు మాదిరిగానే ఇది కూడా ఫ్యామిలీ ఎంటర్టయినర్ అనే చెప్పాలి. కాకపోతే ఈ సినిమాలో ఫ్యామిలీస్ ఉంటాయిగానీ, ఎంటర్టయిన్ మెంట్ కనిపించదు. ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటాయిగానీ .. వాటితో ప్రేక్షకులకు పట్టదు.  

నందినీరెడ్డి ఈ కథను మూడు ప్రధానమైన అంశాలతో నడిపించారు. రెండు కుటుంబాల మధ్య ఆస్తుల తాలూకు గొడవలు .. ఆ రెండు కుటుంబాలకి చెందిన పిల్లలు డాక్టర్ చేసిన పొరపాటు కారణంగా పురిటిలోనే మారిపోవడం .. అలా మారిపోయిన పిల్లలు ప్రేమించుకోవడం. ఈ మూడు అంశాలు కూడా ఈ రెండు కుటుంబాల మధ్యనే జరుగుతాయి. అందువలన దాదాపు అధిక భాగం సన్నివేశాలు వీరి కాంబినేషన్లో జరుగుతుంటాయి. కాకపోతే వాటిలో పస కనిపించదు. 

ఒకానొక సందర్భంలో మూడు అంశాలు పక్కకి వెళ్లిపోయి, ప్రేక్షకులకు సరిగ్గా రిజిస్టర్ చేయని పాత్రల పెళ్లి తతంగం మొదలవుతుంది. ఈ బోరింగ్ ట్రాకును పట్టుకుని చాలాసేపు లాగారు. హీరో .. హీరోయిన్ మధ్య ఇక్కడే సరైన సీన్స్ లేవనుకుంటే, ఇక ఇద్దరినీ కలిపి 'ఇటలీ'లో కూడా తిప్పారు. పోనీ అక్కడైనా బలమైన సీన్స్ పడ్డాయా అంటే అదీ లేదు. అక్కడి నుంచి హీరో యూ ట్యూబర్ గా ఫేమసైపోయి రావడం మరో విశేషం. 

ఈ సినిమాలో మాళవిక నటనకు ఎక్కువ మార్కులు పడతాయి. సంతోష్ శోభన్ కూడా బాగానే చేశాడు. రావు రమేశ్ .. నరేశ్ .. రాజేంద్ర ప్రసాద్ .. గౌతమి వంటి సీనియర్ ఆర్టిస్టులు ఉన్నారు. కానీ వాళ్ల పాత్రలను సరిగ్గా డిజైన్ చేయలేదు. రావు రమేశ్ పెళ్లి చేసుకోలేదని అతని పాత్ర పరిచయంలోనే చెప్పేస్తారు .. అందుకు కారణం ఏమిటో తెలియదు. గౌతమి పాత్రకి వినికిడి లోపం పెట్టారు .. దానివలన ఒరిగేదేమిటో అర్థం కాదు. చివరికి వెన్నెల కిశోర్ ను కూడా తెరపైకి తీసుకుని వచ్చారుగానీ, అతని పాత్ర ద్వారా ఎలా నవ్వించాలనే విషయంలోనూ అదే అయోమయం కనిపిస్తుంది. 

 ఎలాంటి కొత్తదనం లేని కథ .. ఎంతమాత్రం ఆసక్తికరంగా లేని కథనంతో తెరపై సన్నివేశాలు కదులుతూ ఉంటాయి. ఆ క్రమంలోనే కొన్ని పాత్రలు వస్తుంటాయి .. పోతుంటాయి .. వాటి విషయంలోను సాధారణ ప్రేక్షకుడికి క్లారిటీ రాదు. క్లైమాక్స్ లో పాత్రలకు నిజం తెలుస్తుంది గనుక చాలా ఎమోషనల్ అవుతుంటాయి. కానీ ప్రేక్షకులకు కథ మొదట్లోనే ఆ నిజం తెలుసును గనుక, అలా చూస్తూ కూర్చుంటారంతే.  

 మంచి నిర్మాణ విలువలు కలిగిన ఈ సినిమాకి, మిక్కీ జె మేయర్ సంగీతాన్ని అందించాడు. ఒక్క టైటిల్ సాంగ్ మినహా మిగతా సాంగ్స్ పెద్దగా ఆకట్టుకోవు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం బాగుంది. సన్నీ కూరపాటి - రిచర్డ్ ప్రసాద్ కెమెరా పనితనం బాగుంది. సన్నివేశాలను .. పాటలను ఆవిష్కరించిన తీరు ఆకట్టుకుంటుంది. జునైద్ ఎడిటింగ్ విషయానికి వస్తే కొన్ని సీన్స్ ట్రిమ్ చేయవచ్చు .. మరికొన్ని బిట్స్ లేపేయవచ్చు. ఇక అన్నిటికంటే అసలైన ఇబ్బంది .. సంతోష్ శోభన్ ను .. మాళవికను ఒక ఎపిసోడ్ లో టీనేజర్స్ గా చూడవలసి రావడం. 

ప్లస్ పాయింట్స్: నిర్మాణ విలువలు .. మాళవిక నాయర్ నటన .. ఫొటోగ్రఫీ .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ 

మైనస్ పాయింట్స్: కొత్తదనం లేని కథాకథనాలు .. సీనియర్ ఆర్టిస్టుల పాత్రలను సరిగ్గా డిజైన్ చేయకపోవడం .. అలరించని పాటలు .. ఆకట్టుకోని సంభాషణలు.  

Trailer

More Movie Reviews