'సత్తిగాని రెండెకరాలు' - మూవీ రివ్యూ (ఆహా)

Movie Name: Sathi Gani Rendekaralu

Release Date: 2023-05-26
Cast: Jagadeesh, Mohanasri, Raj Thirandas, Vennela Kishore, Muralidhar, Aneesha Dama, Master Rasool
Director: Abhinav Danda
Producer: Naveen Yerneni
Music: Jai Krish
Banner: Mythri Movie Makers
Rating: 2.50 out of 5
  • 'ఆహా'లో స్ట్రీమింగ్ అవుతున్న 'సత్తిగాని రెండెకరాలు'
  • నిదానంగా సాగిన కథనం
  • కనెక్ట్ కాని ఎమోషన్స్  
  • సరిగ్గా డిజైన్ చేయని ప్రధానమైన పాత్రలు
  • కొనసాగింపుగా రానున్న 'చాప్టర్ 2'

మైత్రీ మూవీ మేకర్స్ వారు ఇంతవరకూ స్టార్ హీరోలతో భారీ సినిమాలను నిర్మిస్తూ వచ్చారు. వాళ్ల సక్సెస్ రేటు కూడా ఒక రేంజ్ లో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలోనే ఓటీటీ సినిమాలను కూడా నిర్మించాలనే ఉద్దేశంతో, 'సత్తిగాని రెండెకరాలు' సినిమాను నిర్మించారు. ఈ సినిమాకి సంబంధించిన 'చాప్టర్ 1' నిన్నటి నుంచి 'ఆహా'లో స్ట్రీమింగ్ అవుతోంది. 'పుష్ప' జగదీశ్ ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమాకి,  అభినవ్ దండ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ఎంతవరకూ కనెక్ట్ అయిందనేది ఇప్పుడు చూద్దాం. 

కొల్లూరు గ్రామంలో సత్తి (జగదీశ్) ఆటో నడుపుతూ జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. భార్య అండమ్మ (మోహనశ్రీ) కొడుకు లోకేశ్ (మాస్టర్ రసూల్) ఓ పసిబిడ్డ అతని లోకం. కూతురుకి హార్ట్ లో హోల్ ఉందనీ .. సర్జరీ చేయాలని డాక్టర్లు చెబుతారు. అందుకు చాలా పెద్దమొత్తం ఖర్చు అవుతుందని అంటారు. దాంతో సత్తి తన ఆటో అమ్ముతాడు. మిగతా డబ్బు కోసం ఏం చేయాలనే ఆలోచనలో పడతాడు.

సత్తికి ఒక మేనమామ ఉంటాడు .. అతను ఆ ఊరు సర్పంచ్ (మురళీధర్). ఆయన తన 20 ఎకరాల భూమిని అమ్మకానికి పెడతాడు. మంచి రేటు ఇస్తామనీ .. అయితే ఆ పొలంలోకి ఎంటర్ కావడానికి రోడ్డు వైపున ఉన్న రెండు ఎకరాలు కూడా ఇస్తేనే తాము మొత్తంగా కొంటామని అవతల పార్టీవారు అంటారు. ఆ రెండు ఎకరాలు సత్తిగానివి. దాంతో పొలం అమ్మేయమని అతనిపై మేనమామ ఒత్తిడి చేస్తుంటాడు. తాతకి ఇచ్చిన మాట కోసం సత్తి వెనకడుగు వేస్తుంటాడు. 

ఇలాంటి పరిస్థితుల్లోనే ఓ కారు పొలాల్లోకి దూసుకెళ్లి ఓ చెట్టుకు ఢీ కొడుతుంది. ఆ కారులో ఉన్న వ్యక్తి అక్కడే చనిపోతాడు. ఆ సమయంలో అటుగా వస్తున్న సత్తి ఆ దృశ్యం చూసి, వెనక సీట్లో ఉన్న సూట్ కేసు అందుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ కారులోని వ్యక్తి ఏమైపోయాడో .. అతను తీసుకెళ్లిన సూట్ కేసు ఏమైపోయిందో తెలియని సంస్థ వారు, వెన్నెల కిశోర్ ను రంగంలోకి దింపుతారు. ఆ వ్యక్తి కారు ప్రమాదంలో చనిపోయాడని తెలుసుకున్న వెన్నెల కిశోర్, సూట్ కేసు కోసం అన్వేషించడం మొదలెడతాడు. 

కారులో నుంచి తాను దొంగిలించిన సూట్ కేసును అంజి (రాజ్ తిరందాస్) దగ్గరికి సత్తి తీసుకుని వెళతాడు. అతను దొంగతనాలు చేస్తూ ఉంటాడు. సర్పంచ్ కూతురు సంగీత (అనీషా దామా)తో ప్రేమాయణం కొనసాగిస్తూ ఉంటాడు. అతనితో ఉన్న పరిచయం కారణంగా సత్తి విషయం చెబుతాడు. అతనికి వాటా ఇస్తానని చెప్పి, ఆ సూట్ కేసు ఓపెన్ చేయమని ఇస్తాడు. మొత్తానికి ఆ సూట్ కేసు ఓపెన్ అవుతుంది .. అందులో ఖరీదైన వజ్రాలు ఉండటం చూసి ఇద్దరూ ఆశ్చర్యపోతారు. 

తనకి వజ్రాలు దొరికిన విషయాన్ని సత్తి తన భార్యతో చెబుతాడు. చంటిపిల్ల ఆపరేషన్ కి తగిన డబ్బు సమకూరుతుందనే ఆశతో ఉంటారు. ఇక వజ్రాల విషయాన్ని సంగీతతో అంజి చెబుతాడు. ఆ వజ్రాలు తీసుకుని పారిపోదామని అంజితో అంటుంది సంగీత. అందుకు అతను సిద్ధమవుతాడు. ఇక అదే సమయంలో సత్తి  పొలాన్ని తక్కువ రేటుకు అమ్మిస్తాడు మేనమామ. ఆ తరువాత ఏం జరుగుతుంది? అది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది? అనేది కథ. 

 టైటిల్ కి తగినట్టుగానే రెండు ఎకరాల పొలంలోనే ఈ కథ మొదలవుతుంది. ఆ రెండు ఎకరాలకు గల ప్రాధాన్యత ఏమిటనేది కూడా ఫస్టు సీన్ లోనే చూపించేశారు. అందువలన సత్తి ఎలాగైనా ఆ పొలాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో, దొంగతనానికి పాల్పడటం కూడా జరుగుతుంది. కూతురు ఆపరేషన్ డబ్బుకోసం మోసం చేయడానికి సిద్ధపడటం కనిపిస్తుంది. ఓ  భర్తగా .. ఓ తండ్రిగా ఆయన పాత్రలోని టెన్షన్స్ ను బాగా చూపించారు. 

అయితే ఈ కథ ప్రకారం చూసుకుంటే సత్తి పాత్రతో పాటు, మిగతా ప్రధానమైన పాత్రలను కూడా మరింత ఆసక్తికరంగా మలచవచ్చు. మరింత ఉత్కంఠ పెంచవచ్చు. అందుకు తగిన అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ డైరెక్టర్ ఉపయోగించుకోలేదు. వెన్నెల కిశోర్ .. లలిత్ పాత్రల విషయంలోను ఇదే పొరపాటు జరిగింది. అందువల్లనే ఎంటర్టైన్ మెంట్ పాళ్లు తగ్గాయి. ఇక సత్తి భార్య పాత్రకి మోహనశ్రీ సెట్ కాలేదు. ఆమె డైలాగ్స్ కూడా అర్థం కాలేదు. 

ఒక వైపున సత్తి కూతురు ఆపరేషన్ ... ఆ డబ్బు కోసం సత్తి ప్రయత్నాలు .. డబ్బు కోసం అతను దొంగతనానికి పాల్పడగా, అతణ్ణి మోసం చేయడానికి అంజి సిద్ధపడటం. వజ్రాలపై ఇటు సత్తి భార్య .. అటు అంజి లవర్ ఆశలు పెట్టుకోవడం .. వజ్రాల సూట్ కేసు ఎవరు దొంగిలించారనే విషయంలో వెన్నెల కిశోర్ అన్వేషణ .. ఇలా ఈ మొత్తం డ్రామా టెన్షన్ తో స్పీడ్ గా నడవాలి .. మధ్యలో కామెడీ టచ్ అవుతూ ఉండాలి. ఆ మేజిక్ ఇందులో మిస్సయింది. ఈ కంటెంట్ ను తాపీగా .. కూల్ గా నడిపించడమే కాస్త అసంతృప్తిని కలిగిస్తుంది. 

సత్తిగాడు ఎంతో ప్రాణంగా చూసుకుంటూ వచ్చిన పొలాన్ని అమ్మేయడానికి వెంటనే ఒప్పుకోవడం ..  నెక్స్ట్ పార్టు ఉంది కదా అని ఈ పార్టు ఎండ్ ను సాదా సీదాగా వదిలేయడం కూడా కరెక్టుగా అనిపించవు.  జై క్రిష్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. విశ్వనాథ్ రెడ్డి కెమెరా పనితనం బాగున్నాయి. ఎడిటింగ్ పరంగా చూసుకుంటే, కొన్ని సీన్స్ ను ట్రిమ్ చేయవచ్చు. మొత్తంగా చెప్పుకోవాలంటే ఆశించిన స్థాయిలో ఇది కనెక్ట్ కాలేకపోయింది. 

ప్లస్ పాయింట్స్ : కథ .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. ఫొటోగ్రఫీ. 

మైనస్ పాయింట్స్: స్క్రీన్ ప్లే .. పాత్రలను ఆశించిన స్థాయిలో ఆవిష్కరించలేకపోవడం .. ఎమోషన్ గానీ .. కామెడీ గాని కనెక్ట్ కాకపోవడం. 

Trailer

More Movie Reviews