'అతిథి' - (హాట్ స్టార్) వెబ్ సిరీస్ రివ్యూ

Movie Name: Athidhi

Release Date: 2023-09-19
Cast: Venu Thottempudi, Avanthika, Adithi Gautham, Ravi Varma, Venkatesh Kakumanu, Bhadram
Director: Bharath
Producer: Praveen Sattaru
Music: Kapil Kumar
Banner: Random Frames
Rating: 3.00 out of 5
  • వేణు తొట్టెంపూడి హీరోగా 'అతిథి'
  • గ్లామర్ పరంగా ఆకట్టుకున్న అవంతిక 
  • సస్పెన్స్ ను .. హారర్ ను చరిత్రకు ముడిపెట్టిన దర్శకుడు
  • బంగ్లాకు పరిమితమైన కథను ఆసక్తికరంగా నడిపిన వైనం
  • బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. ఫొటోగ్రఫీ ఓకే 
  • ఔరా అనిపించకపోయినా, బోర్ కొట్టని వెబ్ సిరీస్

ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ పై హారర్ థ్రిల్లర్ జోనర్ కి మంచి డిమాండ్ ఉంది. ఈ జోనర్ కి చెందిన వెబ్ సిరీస్ లను చూడటానికి ఆడియన్స్ ఎక్కువ ఆసక్తిని చూపుతున్నారు. దాంతో ఓటీటీ సెంటర్లు ఈ జోనర్ కి ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నాయి. భారీ బడ్జెట్ తో ఈ తరహా కంటెంటును అందిస్తున్నాయి. 'హాట్ స్టార్' వేదికపైకి అలా వచ్చిన మరో హారర్ థ్రిల్లర్ 'అతిథి'. హీరో వేణు తొట్టెంపూడి చేసిన ఫస్టు వెబ్ సిరీస్ ఇది. 6 ఎపిసోడ్స్ గా ఈ రోజు నుంచి స్ట్రీమింగ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం.

కథలోకి వెళితే .. ఊరికి దూరంగా ఉన్న బంగళాలో రవివర్మ ( వేణు తొట్టెంపూడి) దంపతులు నివసిస్తూ ఉంటారు. అనారోగ్య కారణాల వలన భార్య నడవలేని స్థితిలో ఉంటుంది. రవివర్మ ఒక వైపున కథలు రాసుకుంటూ .. మరో వైపున తన భార్యకి సేవలు చేస్తూ ఉంటాడు. అంత పెద్ద బంగళాలో ఆ ఇద్దరు మాత్రమే ఉండటం గురించి తెలిసినవారు ఆశ్చర్యపోతుంటారు. ఒక రాత్రివేళ వర్షం వస్తుండగా, ఒంటరిగా 'మాయ' (అవంతిక మిశ్ర) అనే ఒక యువతి రవివర్మ బంగళాకు వస్తుంది. ఒక ముఖ్యమైన పనిపై 'దెయ్యాలమిట్ట'కి వెళుతూ ఉండగా, వర్షంలో చిక్కుపడ్డానని అంటుంది. 

ఆ రాత్రికి ఆమె అక్కడ ఉండటానికి రవివర్మ అంగీకరిస్తాడు. వాళ్లిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా, సవారి (వెంకటేశ్ కాకుమాను) అనే యూ ట్యూబర్ అక్కడికి పరిగెత్తుకు వస్తాడు. విషయమేమిటని రవివర్మ అడుగుతాడు. దెయ్యాలు లేవనే విషయాన్ని నిరూపించడం కోసం తాను 'దెయ్యాలమిట్ట'కి వెళ్లాననీ, కానీ అక్కడ తాను దెయ్యాన్ని చూశానని అంటాడు. అది తన వెంటపడిందేమోనని అనుమానంగా ఉందనే సందేహాన్ని వ్యక్తం చేస్తాడు. 'మాయ' దెయ్యమై ఉండొచ్చునని రవివర్మతో రహస్యంగా చెబుతాడు. 

సవారి అన్నట్టుగానే 'మాయ' దెయ్యం ఆవహించినట్టుగా ప్రవర్తిస్తూ, తనని తాను కత్తితో పొడుచుకుని కుప్పకూలిపోతుంది. ఊహించని ఆ సంఘటనకి రవివర్మ - సవారి బిత్తరపోతారు. శవాన్ని అక్కడ నుంచి మాయం చేయడానికి వాళ్లు ప్రయత్నిస్తుండగా, క్రైమ్ బ్రాంచ్ లో పనిచేసే స్పెషల్ ఆఫీసర్ నంటూ ప్రకాశ్ (రవివర్మ) ఎంట్రీ ఇస్తాడు. అక్కడ జరిగిన మర్డర్ ఎవరికీ తెలియకూడదంటే, తనకి పాతిక లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తాడు. అందుకు రవివర్మ అంగీకరిస్తాడు ... క్షణాల్లో పాతిక లక్షలు తెచ్చి చేతిలో పెడతాడు. 

దాంతో ఇంకా రవివర్మ దగ్గర ఎంత డబ్బు ఉందో .. అసలు మిగతా గదుల్లో ఏవుందో తెలుసుకోవాలనే ఉద్దేశంతో ప్రకాశ్ లోపలికి వెళతాడు. రవివర్మ భార్య గదిలోకి అడుగుపెట్టిన ఆయన ఉలిక్కిపడతాడు .. అందుకు కారణం ఏమిటి? ఒక గది నిండా బ్యాంకును తలపించే స్థాయిలో లాకర్లు ఉంటాయి. ఆ లాకర్లలో ఏమున్నాయి? అసలు రవివర్మ ఎవరు? ఊరు చివర బంగ్లాలో ఆయన ఎందుకు ఉంటున్నాడు? ఎవరికీ తెలియని ఆయన ఫ్లాష్ బ్యాక్ ఏంటి? అనేవి ఆసక్తిని రేకెత్తించే అంశాలు.

ఈ వెబ్ సిరీస్ కి రచయితగా .. దర్శకుడిగా భరత్ వ్యవహరించాడు. ఆయన ఈ కథను రెడీ చేసుకున్న తీరు .. దానిని నడిపించిన విధానం ఇంట్రెస్టింగ్ గానే అనిపిస్తుంది. 'దెయ్యాలమిట్ట'లో దెయ్యాలు ఉన్నాయా? లేవా? అనే ఒక ఆసక్తికరమైన అంశంతో ఈ కథ బయలుదేరుతుంది. ఆ తరువాత ఇదంతా ఒక సైకో చుట్టూ తిరుగుతున్న డ్రామా అనిపిస్తుంది. ఆ అభిప్రాయం బలపడుతూ ఉండగానే, చారిత్రక నేపథ్యంలోకి కథ అడుగుపెడుతుంది. 

చారిత్రక నేపథ్యంలో రాజులు .. మంత్రులు .. అధికారం కోసం వారసుల వ్యూహాలు ఇలా మరో ట్రాక్ లో ఈ కథ ముందుకు వెళుతుంది. అక్కడ ఆడియన్స్ కుదురుకుంటూ ఉండగానే, మళ్లీ హారర్ థ్రిల్లర్ ను రుచి చూపిస్తుంది. ఇలా ఈ కథ అనేక మలుపులు తిరుగుతూ .. అనేక వేరియేషన్స్ చూపిస్తూ ముందుకు వెళుతూ ఉంటుంది. చారిత్రక నేపథ్యాన్ని సెంటర్ పాయింటుగా పెట్టుకుని హారర్ ను .. సస్పెన్స్ ను దర్శకుడు బ్యాలెన్స్ చేసిన తీరు బాగుంది. కథ బంగ్లాకే పరిమితమైనా,  అతి .. అనవసరపు సన్నివేశాలు కనిపించవు. అద్భుతం అనిపించకపోయినా, బోర్ కొట్టకుండా విషయాన్ని ఇంట్రెస్టింగ్ గా చెప్పగలిగాడు. 

వేణు పాత్రను డిజైన్ చేసిన తీరు .. ఆయన నటన ఆకట్టుకుంటాయి. ఇక అవంతిక మిశ్ర గ్లామర్ .. దెయ్యంగా ఆమె పలికించిన హావభావాలు బాగున్నాయి. దెయ్యాలు లేవని నిరూపిస్తానంటూ రంగంలోకి దిగి, దెయ్యాలు ఉన్నాయ్ బాబోయ్ అంటూ పారిపోయే పాత్రకి వెంకటేశ్ కాకుమాను జీవం పోశాడు. ఆయన నటన ఎక్కువమందికి కనెక్ట్ అవుతుంది. కపిల్ కుమార్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆడియన్స్ ను కథతో ట్రావెల్ చేయిస్తుంది.

 ఇక మనోజ్ కాటసాని కెమెరా పనితనం కూడా గొప్పగా ఉంది. నైట్ ఎఫెక్ట్ సీన్స్ ను చిత్రీకరించిన తీరు బాగుంది. ధర్మేంద్ర కాకరాల ఎడిటింగ్ ఓకే .. ఎక్కడా సాగదీయడం .. అనవసరమైన సీన్స్ కనిపించవు. సాధారణంగా హారర్ థ్రిల్లర్ కథలన్నీ ఒక బంగ్లాకి పరిమితమై జరుగుతూ ఉంటాయి. ఇది కూడా ఆ తరహాలో సాగే కథనే .. కాకపోతే కథ ఎప్పటికప్పుడు తీసుకునే మలుపులు బోర్ కొట్టకుండా కూర్చోబెడతాయి. సస్పెన్స్ ను .. హారర్ ను చరిత్రకు ముడిపెట్టిన తీరు కొత్తగా అనిపిస్తుంది. 

Trailer

More Movie Reviews