'రాక్షస కావ్యం' (ఆహా) మూవీ రివ్యూ

Movie Name: Rakshasa Kavyam

Release Date: 2023-12-15
Cast: Abhay, Anvesh Michael, Pawon Ramesh, Dayanand Reddy, Rohini Aretty, Kushalini, Yadamma Raju
Director: Sriman Keerthi
Producer: Damu Reddy
Music: Rajeev Raj- Srikanth
Banner: Garuda Production
Rating: 2.50 out of 5
  • నిన్నటి నుంచి మొదలైన 'రాక్షస కావ్యం' స్ట్రీమింగ్
  • యాక్షన్ .. ఎమోషన్ .. కామెడీని టచ్ చేస్తూ సాగే సినిమా 
  • సాదా సీదాగా అనిపించే చిత్రీకరణ
  • వినోదానికి దూరంగా నడిచే కథ  
  • ఆలోచింపజేసే సందేశం

ఈ మధ్య కాలంలో వచ్చిన చిన్న సినిమాల జాబితాలో 'రాక్షస కావ్యం' ఒకటిగా కనిపిస్తుంది. అక్టోబర్ 13వ తేదీన ఈ సినిమా థియేటర్లకు వచ్చింది. అయితే సరైన పబ్లిసిటీ లేకపోవడం వలన, ఈ సినిమా ఎప్పుడు థియేటర్లకు వచ్చి వెళ్లిందనేది చాలామందికి తెలియదు. అలాంటి ఈ సినిమా, నిన్నటి నుంచి 'ఆహా'లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా కథేమిటో .. అది ఎంతవరకూ ఆకట్టుకుంటుందో ఇప్పుడు చూద్దాం. 

ఈ కథ 1989 - 2006కి మధ్యలో హైదరాబాదులో నడుస్తుంది. చైతన్య (పవాన్ రమేశ్) ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్. తెల్లవారితే ఎగ్జామ్ ఉండగా, ఫ్రెండ్స్ మాట కాదనలేక తాగుతాడు. వాళ్లతో కలిసి బయటికి వెళతాడు. తాగిన మత్తులో  చూసుకోకుండా ఫ్రెండ్స్ అతణ్ణి ఓ గల్లీలో వదిలేసి వెళ్లిపోతారు. ఆ సమయంలోనే అక్కడ ఒక మర్డర్ జరుగుతుంది. అజయ్ (అభయ్) అనే ఒక రౌడీ తన అనుచరులతో కలిసి హత్య చేయడాన్ని చైతన్య చూస్తాడు. అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించి అజయ్ అనుచరులకు దొరికిపోతాడు. 

చైతన్యను వెంటబెట్టుకునే అజయ్ ఆ రాత్రి మరో రెండు మర్డర్లు చేస్తాడు. హత్య జరిగిన చోటున చైతన్యతో కలిసి సెల్ఫీ తీసుకుంటారు. తన కెరియర్ పాడుచేయవద్దని అతను ఎంతగా బ్రతిమాలినా అజయ్ అనుచరులు అతనిని వదిలిపెట్టరు. చదువుకునే వాళ్లంటే తనకి ఇష్టమనీ, అందువలన చైతన్యను చంపే ఉద్దేశం తనకి లేదని అజయ్ చెబుతాడు. తాను ఇంత కిరాతకంగా మారడానికి గల కారణం చెబుతాడు. 

అదే సమయంలో విజయ్ (అన్వేశ్ మైఖేల్)  అనుచరులు దాడి చేయడంతో, అజయ్ తప్పించుకుంటాడు. చైతన్య మాత్రం విజయ్ అనుచరులకు దొరికిపోతాడు. విజయ్ కూడా ఒక హంతకుడే .. అతను అజయ్ కి తమ్ముడే అనే సంగతి తెలిసి, చైతన్య షాక్ అవుతాడు. అజయ్ చెప్పిన ఫ్లాష్ బ్యాక్ లో ఎక్కడా విజయ్ ప్రస్తావన లేకపోవడం అతనికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అందుకు గల కారణాన్ని విజయ్ అతనికి వివరిస్తాడు. 

చదువుకున్న వాళ్లంటే ఇష్టం ఉండటం వలన తనని అజయ్ చంపకుండా వదిలేశాడు. చదువుకున్న వాళ్లంటే ఎంతమాత్రం ఇష్టం లేని విజయ్, తనని చంపడం ఖాయమనే సంగతి చైతన్యకి అర్థమైపోతుంది. అప్పుడు అతను ఏం చేస్తాడు? అజయ్ ఫ్లాష్ బ్యాక్ ఏంటి? తమ్ముడైన విజయ్ తో శత్రుత్వానికి కారణం ఏమిటి? వాళ్లిద్దరి మధ్య చైతన్య ఎలా నలిగిపోయాడు? అనేది మిగతా కథ. 

దర్శకుడు శ్రీమాన్ కీర్తి ఈ సినిమాను తెరకెక్కించాడు. ఈ కథ అంతా కూడా హైదరాబాదులోని ఓ బస్తీలో జరుగుతుంది. ఆ బస్తీలో కూలి పనులు చేసుకునే ఓ కుటుంబం .. ఆ దంపతులకు ఇద్దరు మగపిల్లలు .. పరిస్థితులు వాళ్ల జీవితంపై ఎలాంటి ప్రభావాన్ని చూపాయనే అంశం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. బడ్జెట్ పరంగా చూసినా .. కాస్టింగ్ ప్రకారం చూసినా ఇది చాలా చిన్న సినిమా. కానీ సహజత్వానికి దగ్గరగా అనిపించే కంటెంట్ ఉన్న సినిమానే అని చెప్పాలి. 

'రాక్షస కావ్యం' అనే టైటిల్ చూడగానే హింస చాలా ఎక్కువగా ఉంటుందనే విషయం అర్థమైపోతుంది. ఓ వర్గం ప్రేక్షకులు మాత్రమే ఈ తరహా కంటెంట్ చూడటానికి వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమాలో హింస ఉంది .. కానీ అంతకుమించిన ఎమోషన్స్ ఉన్నాయి. తన కొడుకు వృద్ధిలోకి రావాలని ఒక తల్లి ఎంతగా తపిస్తుందనేది ఆవిష్కరించిన తీరు కనెక్ట్ అవుతుంది. వ్యసనాలకి బానిసలైనవాళ్లు ఎంతకి తెగిస్తారు? అనే అంశాన్ని ఆవిష్కరించిన విధానం కూడా బాగుంది.

ఈ సినిమాలో హీరోయిన్స్ .. డ్యూయెట్లు .. రొమాన్స్ అంటూ ఏమీ కనిపించవు. అన్న పాత్ర ద్వారా యాక్షన్ .. తమ్ముడి పాత్ర ద్వారా కామెడీని .. తల్లి నేపథ్యంలో సాగే ఎమోషన్స్ ను వర్కౌట్ చేశారు. తండ్రి పాత్ర చెడ్డదే అయినా .. ఆ పాత్ర ద్వారా ఒక సందేశం ఇచ్చారు. సినిమా మొత్తం చూసిన తరువాత 'రాక్షస కావ్యం' అనే టైటిల్ ఈ కథకి ఎక్కువైపోయినట్టుగా అనిపిస్తుంది. అలాగే హీరో పాత్రను డిజైన్ చేసే విషయంలో దర్శకుడు మరింత కసరత్తు చేయవలసింది. ఎందుకంటే ఎన్నో మంచి పనులు చేసే హీరోను ఆరంభంలో ఒక సైకోలా చూపించారు.

రాజీవ్ రాజ్ - శ్రీకాంత్ సంగీతం, రుషి ఫొటోగ్రఫీ కథకి తగినట్టుగానే నడిచాయి. హైదరాబాద్ చుట్టూ పక్కలనే చిత్రీకరణ జరిపారు. స్లమ్ ఏరియాల్లోనే ఎక్కువ కథ నడుస్తుంది. ఒక సినిమాకి సంబంధించిన అన్ని అంశాలు ఈ కథలో కనిపించవు. జరిగే కథ వాస్తవానికి దగ్గరగా అనిపించినా, అక్కడి నుంచి లభించే వినోదం తక్కువే. సినిమా ప్రధానమైన ఉద్దేశం అన్ని వర్గాల వారికి వినోదాన్ని అందించడమే అయితే, ఈ కథ మాత్రం ఒక వర్గానికి నచ్చవచ్చునేమో. 
Trailer

More Movie Reviews