'కృష్ణమ్మ' (అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ!

Movie Name: Krishnamma

Release Date: 2024-05-17
Cast: Sathyadev, Athira Raj, Lakshman Meesala, Nandagopal, Raghu Kunhe, Archana
Director: Gopalakrishna
Producer: Krishna Monalapati
Music: Kalabhairava
Banner: Arunachala Creations
Rating: 2.50 out of 5
  • సత్యదేవ్ హీరోగా చేసిన 'కృష్ణమ్మ'
  • ఈ నెల 10న థియేటర్లకు వచ్చిన సినిమా
  • ఈ రోజు నుంచే మొదలైన స్ట్రీమింగ్
  • స్నేహం - ప్రేమ ప్రధానంగా నడిచే కథ 
  • వినోదానికి దూరంగా కనిపించే కంటెంట్ 
  • ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యే సినిమా

మొదటి నుంచి కూడా సత్యదేవ్ విభిన్నమైన .. విలక్షణమైన కథలను ఎంచుకుంటూ వస్తున్నాడు. ఆయన తాజా చిత్రంగా 'కృష్ణమ్మ' రూపొందింది. వి.వి. గోపాలకృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ నెల 10వ తేదీన థియేటర్లకు వచ్చింది. థియేటర్ల నుంచి ఆశించినస్థాయి రెస్పాన్స్ ను తెచ్చుకోలేకపోయిన ఈ సినిమా, వారం రోజులలోనే అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులోకి వచ్చింది. అలాంటి ఈ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం. 

ఈ కథ కృష్ణానది తీరంలో .. విజయవాడ నేపథ్యంలో .. 2002 నుంచి 2015 వరకూ నడుస్తుంది. అనాథలుగా పెరిగిన భద్ర ( సత్యదేవ్) కోటి (మీసాల లక్ష్మణ్) శివ, విజయవాడలో నివసిస్తూ ఉంటారు. భద్ర - కోటి ఇద్దరూ దాసన్న  అనే లోకల్ రౌడీ దగ్గర గంజాయి అక్రమ రవాణాకు  సంబంధించిన పనిచేస్తూ ఉంటారు. శివ మాత్రం స్క్రీన్ ప్రింటింగ్ షాప్ నడుపుతూ ఉంటాడు. అదే ప్రాంతంలో తల్లితో కలిసి మీనా (అతిరా రాజ్) నివసిస్తూ ఉంటుంది. 

శివ - మీనా ప్రేమించుకుంటారు .. పెళ్లి చేసుకోవాలనుకుంటారు. దాంతో భద్ర - కోటి వారి పెళ్లి జరిపించాలని భావిస్తారు. అదే సమయంలో మీనా తల్లి అనారోగ్యానికి లోనవుతుంది. ఆమె ట్రీట్మెంట్ కి 3 లక్షల వరకూ అవుతుందని డాక్టర్లు చెబుతారు. ఆ డబ్బు కోసం దాసన్న అప్పగించిన గంజాయి సప్లై పనిని పూర్తిచేయాలని భద్ర భావిస్తాడు. అతను ఎంతగా వారిస్తున్నా వినిపించుకోకుండా శివ కూడా వెళతాడు.

గంజాయి సరుకు తీసుకుని వాళ్ల ముగ్గురూ ఆటోలో తిరిగి వస్తుండగా, లోకల్ గ్యాంగ్ తో గొడవ జరుగుతుంది. దాంతో సరుకుతో పాటు, పోలీస్ స్టేషన్ కి వెళ్లవలసి వస్తుంది. అక్కడ సీన్లోకి ఏసీపీ పాండా (నందగోపాల్) ఎంటరవుతాడు. వేరే కేసును ఒప్పుకుంటే ఈ కేసు నుంచి తప్పిస్తాననీ, మీనా తల్లికి ట్రీట్మెంట్ చేయిస్తామని ఆ ముగ్గురుతో అంటాడు. శివను వదిలేయమనీ, వాళ్లు చెప్పిన కేసును తాము ఒప్పుకుంటామని భద్ర అంటాడు. శివను వదిలేస్తామని చెబుతూనే, ముగ్గురినీ జడ్జి ముందు హాజరుపరుస్తారు. 

ఆ ముగ్గురి కేసు విషయంలో డౌట్ రావడంతో వాళ్ల తరఫున లాయర్ ను ఆ జడ్జి నియమిస్తాడు. అసలు కేసు ఏమిటో తెలియకుండా ఆ ముగ్గురూ ఒప్పుకున్నారని తెలిసి ఆ లాయర్ ఆశ్చర్యపోతాడు. మీనా అనే యువతి హత్యా నేరంలో వాళ్లని ఇరికించే ప్రయత్నం జరుగుతోందని అంటాడు. తాము జైలుకు వచ్చిన తరువాత మీనా చనిపోయిందని తెలుసుకున్న ఆ ముగ్గురూ నివ్వెరపోతారు.

ఆ తరువాత స్నేహితులు ముగ్గురూ ఏం చేస్తారు? మీనాను హత్య చేసింది ఎవరు? ఏసీపీ ఎవరిని కాపాడటం కోసం ఆ ముగ్గురినీ ఇరికించాలని ప్రయత్నిస్తున్నాడు? అతని వెనక ఎవరున్నారు? జైలు నుంచి ముగ్గురు స్నేహితులు బయటపడతారా? అనే ఆసక్తికరమైన మలుపులు ఈ కథలో కనిపిస్తాయి. 

దర్శకుడు గోపాలకృష్ణ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. కృష్ణానదీ తీరంలోని క స్లమ్ ఏరియా .. అక్కడి నేపథ్యం .. వాతావరణం సహజంగా చూపిస్తూ ఈ కథను తెరకెక్కించాడు. సహజత్వం విషయంలో ఒక తమిళ సినిమానో .. మలయాళ మూవీనో చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. స్నేహం - ప్రేమ అనే ఎమోషన్స్ తో కూడిన రెండు ట్రాకులను నడిపిస్తూ, అక్కడక్కడా యాక్షన్ ను యాడ్ చేస్తూ ఆయన ఈ కథను ఇంట్రెస్టింగ్ గా చెప్పడానికి ప్రయత్నించాడు. 

ఇది రొటీన్ గా గ్లామర్ టచ్ తో కూడిన కథ కాదు. ఒక స్లమ్ ఏరియాలో పెరిగిన స్నేహం .. ఆ స్లమ్ ఏరియాలో పుట్టిన ప్రేమ. గమ్యం లేని జీవితాలే అయినా .. త్యాగం చేయడానికి సిద్ధమయ్యే మనసుల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. అలాంటి వారి జీవితంలోకి శ్రీమంతులైన కొంతమంది కామాంధులు ప్రవేశిస్తే, వాళ్లను కాపాడటానికి కొంతమంది అవినీతి పోలీస్ అధికారులు రంగంలోకి దిగితే ఎలా ఉంటుందనేది దర్శకుడు ఆవిష్కరించిన తీరు ఆకట్టుకుంటుంది.

 దర్శకుడు ఏ అంశాన్నయితే చెప్పాలనుకున్నాడో అది స్పష్టంగా చెప్పాడు. అయితే అసలు కథ వరకూ వెళ్లడానికి చాలా సమయం తీసుకున్నాడనిపిస్తుంది. అసలు విషయం దగ్గరికి వెళ్లేవరకూ ఎంటర్టైన్ మెంట్ లేకపోవడం ఒక వెలితిగా అనిపిస్తుంది. కొన్ని పాత్రలను మధ్యలో వదిలేయడం కూడా అసంతృప్తిని కలిగిస్తుంది. స్క్రీన్ ప్లేకి కూడా మంచి మార్కులనే ఇవ్వొచ్చు. 

ప్రధానమైన పాత్రలను పోషించిన ప్రతి ఒక్కరూ తమ పాత్రకి న్యాయం చేశారు. కాలభైరవ నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. సన్నీ కూరపాటి ఫొటోగ్రఫీ .. తమ్మిరాజు ఎడిటింగ్ వర్క్ కూడా నీట్ గా అనిపిస్తుంది. రొమాన్స్ .. డ్యూయెట్లు .. కామెడీ వంటి వినోదపరమైన అంశాలను ఆశించకుండా చూస్తే, ఎమోషనల్ గా ఈ సినిమా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది.

Trailer

More Movie Reviews