'బ్యాడ్ కాప్' (హాట్ స్టార్) వెబ్ సిరీస్ రివ్యూ!

Movie Name: Bad Cop

Release Date: 2024-06-21
Cast: Anurag Kashyap, Gulshan Devaiah, Harleen Sethi, Palle Singh,
Director: Adihya Dutt
Producer: Leena Tondon
Music: -
Banner: Fremantle
Rating: 3.00 out of 5
  • క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే 'బ్యాడ్ కాప్'
  • ద్విపాత్రాభినయం చేసిన గుల్షన్ దేవయ్య
  • కథ పాతదే అయినా కొత్తగా అనిపించే కథనం   
  • మెప్పించిన మొదటి రెండు ఎపిసోడ్స్
  • త్వరలో అందుబాటులోకి రానున్న మిగతా ఎపిసోడ్స్ 
     

బాలీవుడ్ నటుడిగా గుల్షన్ దేవయ్యకి మంచి పేరు ఉంది. పాత్ర ఏదైనా దానిని సజీవంగా ప్రేక్షకుల ముందుంచడం ఆయన ప్రత్యేకత. అలాంటి గుల్షన్ దేవయ్య నుంచి ఆ మధ్య వచ్చిన 'గన్స్ అండ్ గులాబ్స్' వెబ్ సిరీస్ కి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు ఆయన ద్విపాత్రాభినయం చేసిన 'బ్యాడ్ కాప్' సిరీస్ వచ్చింది. 8 ఎపిసోడ్స్ తో రూపొందించిన ఈ సిరీస్ లో ముందుగా 2 ఎపిసోడ్స్ ను వదిలారు. ఈ రెండు ఎపిసోడ్స్ లోని కథ ఏమిటనేది ఇప్పుడు చూద్దాం. 

ఈ కథ ముంబై నేపథ్యంలో నడుస్తుంది. కరణ్ (గుల్షన్ దేవయ్య) అర్జున్ (గుల్షన్ దేవయ్య) ఇద్దరూ ట్విన్స్. ఒక అనాథ శరణాలయంలో పెరుగుతారు. ఆ తరువాత కరణ్ ఒక కుటుంబానికి దత్తత వెళతాడు. అలా వెళ్లిన కరణ్ పోలీస్ ఆఫీసర్ అవుతాడు. ప్రస్తుతం అతను ముంబైలో పనిచేస్తూ ఉంటాడు. ఇక అర్జున్ దొంగగా మారతాడు. చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ అదే ముంబైలో ఉంటాడు. 

కరణ్ కి దేవిక (హర్లీన్ సేథీ)తో పెళ్లి అవుతుంది. వాళ్లకి 'రియా' అనే ఓ పాప ఉంటుంది. దేవిక కూడా పోలీస్ ఆఫీసర్ గానే పనిచేస్తూ ఉంటుంది. అయితే ఆమెకి ప్రమోషన్ రావడం వలన, కరణ్ కంటే పైస్థాయికి వెళుతుంది. అది కరణ్ కి కాస్త ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది. ఆ ఇగో అనేది ఇద్దరి మధ్య దూరాన్ని పెంచుతూ ఉంటుంది. అర్జున్ కి దూరంగా ఉండమనీ,  తమ కెరియర్ ను ఇబ్బందుల్లో పడేయవద్దని కరణ్ కి దేవిక తరచూ చెబుతూ ఉంటుంది. కానీ కరణ్ .. అర్జున్ కి టచ్ లోనే ఉంటాడు.  

అలాంటి పరిస్థితుల్లోనే ఒక మర్డర్ కేసులో అర్జున్ చిక్కుకుంటాడు. చనిపోయింది ఆనంద్ మిశ్రా అనే జర్నలిస్ట్. అతని స్నేహితుడైన సీనియర్ పోలీస్ ఆఫీసర్ (సౌరభ్ సచ్ దేవ్) రంగంలోకి దిగుతాడు. దాంతో కంగారు పడిపోయిన అర్జున్, ఓ రాత్రివేళ తన అన్నయ్య కరణ్ ను 'పోర్టు'లో కలుసుకుంటాడు. ఆ కేసు నుంచి తాను బయటపడేలా చేయమని కోరతాడు. అదే సమయంలో 'కస్బా' అనుచరులు వారిపై దాడి చేస్తారు. 


కస్బా ఒక గ్యాంగ్ స్టర్. అతను జైల్లో ఉన్నప్పటికీ, అతనికి సంబంధించిన అక్రమ వ్యాపారాలు ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగిపోతుంటాయి. ముఖ్యంగా అతని నేర సామ్రాజ్యం ఫారెస్టు వరకూ వ్యాపిస్తుంది. ఏనుగులను చంపేసి వాటి దంతాలను పెద్దసంఖ్యలో తరలిస్తుంటాడు. అలాంటి 'కస్బా' అనుచరులను కరణ్ - అర్జున్ ఇద్దరూ కలిసి ఎదుర్కుంటారు. ఒకానొక సందర్భంలో ఇద్దరూ గాయపడి సముద్రంలోకి దూకేస్తారు. 

గాయాలపాలైన కరణ్, హాస్పిటల్లో చికిత్స అనంతరం కోలుకుంటాడు. అతణ్ణి దేవిక ఇంటికి తీసుకుని వస్తుంది. జరిగిన సంఘటనలో కరణ్ చనిపోయాడనీ, తాను హాస్పిటల్ నుంచి తీసుకుని వచ్చింది అరుణ్ ను అని ఆమెకి తెలియదు. దేవిక పోలీస్ ఆఫీసర్ గనుక, ఏ క్షణమైనా తాను ప్రమాదంలో పడే ఛాన్స్ ఉందని అర్జున్ భయపడుతూ ఉంటాడు.    
      
తన లవర్ తో కలిసి గుజరాత్ కి పారిపోవాలనీ., కొంతకాలం పాటు అక్కడే ఉండిపోవాలని అర్జున్ ప్లాన్ చేస్తాడు. ముంబై నుంచి అతను బయటపడే ప్రయత్నంలో ఉండగా, తన అన్నయ్యను చంపింది 'కస్బా' మనుషులు అనే విషయం అర్జున్ కి తెలుస్తుంది. దాంతో వాళ్ళని చంపకుండా తాను అక్కడి నుంచి వెళ్లకూడదని నిర్ణయించుకుంటాడు. అందుకోసం ఆయన ఏం చేస్తాడు? ఆ తరువాత చోటుచేసుకునే పరిణామాలు ఎలాంటివి? అనేది మిగతా కథ. 

అన్నదమ్ములు .. కవలపిల్లలు .. విధిరాత వలన చిన్నప్పుడే విడిపోవడం . ఒకరు పోలీస్ అయితే మరొకరు దొంగ కావడం .. కొన్ని కారణాల వలన అన్నయ్య ప్లేస్ లోకి తమ్ముడు రావడం .. వంటి అంశాలు చూస్తే, ఇలాంటి కథలు చాలా కాలం క్రితమే వచ్చాయిగదా అనిపిస్తుంది. కానీ స్క్రీన్ ప్లే .. ట్రీట్మెంట్ చూస్తే, కొత్తగా ఏదో చెప్పబోతున్నారని మాత్రం అనిపిస్తుంది. అందుబాటులోకి వచ్చింది రెండు ఎపిసోడ్స్ మాత్రమే కాబట్టి, మిగతా ఎపిసోడ్స్ లో బలమైన కంటెంట్ ఉండే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. 

ఈ రెండు ఎపిసోడ్స్ లో ఎక్కడా కూడా అనవసరమైన సీన్స్ కనిపించవు. మిగతా ఎపిసోడ్స్ ను పట్టుగా నడిపించడానికి అవసరమైన బేస్ ను ఈ రెండు ఎపిసోడ్స్ లో వేసేశారు. ఇంతవరకూ ఎంట్రీ ఇచ్చిన పాత్రలు .. వాటిని డిజైన్ చేసిన తీరు పర్ఫెక్ట్ గా అనిపిస్తుంది. ఇంకా కొన్ని పాత్రలు .. ట్రాకులు ఎంటర్ కావలసి ఉంది. అనిక్ రామ్ వర్మ ఫొటోగ్రఫీ .. జితేంద్ర ఎడిటింగ్ .. నేపథ్య సంగీతం ఈ సిరీస్ కి అదనపు బలంగా నిలిచాయని చెప్పచ్చు.

తన అన్నయ్యను చంపినవారిపై పగ తీర్చుకోవడం కోసం అర్జున్ ఏం చేస్తాడు? అతను కరణ్  కాదనే విషయాన్ని దేవిక పసిగడుతుందా? జర్నలిస్ట్ ఆనంద్ మిశ్రాను హత్యచేసింది ఎవరు? ఆ కేసు అర్జున్ ను ఎలా వెంటాడుతూ ఉంటుంది? అనేది ఆడియన్స్ లో ఆసక్తిని రేకెత్తించే అంశాలు. అలాంటి అంశాలతో మిగతా ఎపిసోడ్స్ ఏ స్థాయిలో మెప్పిస్తాయనేది చూడాలి. 

Trailer

More Movie Reviews