'బహిష్కరణ' (జీ 5) వెబ్ సిరీస్ రివ్యూ!

Movie Name: Bahishkarana

Release Date: 2024-07-19
Cast: Anjali, Ravindra Vijay, Sri Tej, Ananya Nagalla, Mahaboob Basha, Shanmukh
Director: Mukesh Prajapathi
Producer: Prashanthi Malisetty
Music: Sidharth Sadashivuni
Banner: Pixel Pictures
Rating: 3.50 out of 5
  • అంజలి ప్రధానపాత్రగా సాగే 'బహిష్కరణ'
  • ఆమె నటన ఈ సిరీస్ కి హైలైట్ 
  • గ్రామీణ నేపథ్యంలో నడిచే కథ 
  • ఆసక్తిని రేకెత్తించే స్క్రీన్ ప్లే 
  • ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే ఎమోషన్స్ 
  • ఇంట్రెస్టింగ్ తెలుగు వెబ్ సిరీస్  

అంజలి ఒక వైపున సినిమాలలో విభిన్నమైన కథలను ఎంచుకుంటూనే, మరో వైపున వెబ్ సిరీస్ లలో విలక్షణమైన పాత్రలతో మెప్పిస్తోంది. ఇంతవరకూ ఆమె చేసిన వెబ్ సిరీస్ లన్నీ కూడా బలమైన కంటెంట్ ఉన్నవే .. ఫ్యామిలీ ఆడియన్స్ వైపు నుంచి మంచి ఆదరణ పొందినవే. ఈ నేపథ్యంలో ఆమె చేసిన 'బహిష్కరణ' ..  జీ 5 ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి ఈ రోజునే వచ్చింది. 6 ఎపిసోడ్స్ గా రూపొందిన ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం.

ఈ కథ 1990లలో .. గుంటూరు జిల్లా 'పెద్దపల్లి' నేపథ్యంలో నడుస్తూ ఉంటుంది. ఆ గ్రామానికి శివయ్య (రవీంద్ర విజయ్) సర్పంచ్ గా వ్యవహరిస్తూ ఉంటాడు. ఆ ఊళ్లో అతను చెప్పిందే వేదం .. చేసిందే శాసనం. దర్శి (శ్రీతేజ్) సూరి (షణ్ముఖ్) అతని ప్రధానమైన అనుచరులుగా పనిచేస్తూ ఉంటారు. దర్శికి 'లక్ష్మి' (అనన్య నాగళ్ల) అనే మరదలు ఉంటుంది. ఇక చిట్టి (మహబూబ్ బాషా) అనే స్నేహితుడు ఎప్పుడు చూసినా దర్శితోనే తిరుగుతూ ఉంటాడు. 

ఆ ఊళ్లో టీనేజ్ పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు. అందుకు కారణమేమిటనేది తెలియక అంతా అయోమయానికి లోనవుతూ ఉంటారు. సాధ్యమైనంత త్వరగా నేరస్థులను పట్టుకోమని పోలీసులను శివయ్య తొందర పెడుతుంటాడు. ఇలాంటి పరిస్థితులలోనే ఆ ఊరికి పుష్ప (అంజలి) వస్తుంది. నేరుగా ఆమె శివయ్యను వెతుక్కుంటూ వస్తుంది. పుష్ప మాటలను బట్టి ఆమె వేశ్య అనే విషయం శివయ్యకి అర్థమవుతుంది. ఆమెను ఊరి చివరన ఒక ఇంట్లో ఉంచుతాడు.       

పుష్ప మంచి అందగత్తె .. అలాంటి ఆమె మంచిగా బ్రతకొచ్చుగదా అనే ఆలోచనలో దర్శి ఉంటాడు. ఆ విషయంలో ఆమె పట్ల కాస్త కోపంగా కూడా ఉంటాడు. అదే మాటను ఆమెతో అంటాడు కూడా. అయితే సరిదిద్దుకోలేని దారిలో తాను చాలా దూరం వచ్చేసినట్టుగా పుష్ప చెబుతుంది. ఇక పుష్ప దగ్గర చనువు తీసుకోబోయి భంగపడిన సూరి, ఆమె దర్శికి దగ్గరవుతూ ఉండటాన్ని భరించలేకపోతాడు. వాళ్లిద్దరి విషయంలో అతను కోపంతో రగిలిపోతుంటాడు.

సర్పంచ్ ఏదో పనిపై ఒక వారం రోజుల పాటు వేరే ఊరు వెళతాడు. ఆ సమయంలో పుష్ప - దర్శి మరింత దగ్గరవుతారు. అప్పటివరకూ వాళ్ల మధ్య ఉంటూ వచ్చిన సాన్నిహిత్యం ప్రేమగా మారుతుంది. దాంతో పుష్పను పెళ్లి చేసుకోవాలని దర్శి నిర్ణయించుకుంటాడు. అది చాలా ప్రమాదమని చిట్టి చెప్పినా అతను వినిపించుకోడు. మొదటి నుంచి సర్పంచ్ పట్ల విపరీతమైన విశ్వాసం ఉన్న దర్శి, తాను చెబితే అతను అర్థం చేసుకుంటాడని భావిస్తాడు. 

సర్పంచ్ ఊరు నుంచి రాగానే, పుష్పను వెంటబెట్టుకుని వెళ్లి, ఆమెను తాను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని చెబుతాడు. అప్పుడు సర్పంచ్ ఎలా స్పందిస్తాడు? ఆ తరువాత ఏం చేస్తాడు? పర్యవసానంగా దర్శి .. పుష్ప .. లక్ష్మి .. చిట్టి జీవితాలు ఎలాంటి మలుపు తిరుగుతాయి? అనేది మిగతా కథ.  

ఈ సిరీస్ కి కథ - స్క్రీన్ ప్లే అందించింది ముఖేశ్ ప్రజాపతి. దర్శకుడు కూడా ఆయనే. కథ విషయానికి వస్తే, రావు గోపాలరావు .. నాగభూషణం విలనిజం కాలంలో, విలేజ్ నేపథ్యంలో వచ్చిన సినిమాలు కొన్ని గుర్తొస్తాయి. ఈ కథలోని టీనేజ్ అమ్మాయిల ఆత్మహత్యలు మినహా, మిగతా అంశాలు అవే విషయాలను గుర్తుచేస్తూ ఉంటాయి. అలా అని చెప్పి ఎక్కడా బోర్ అనిపించదు .. కథ పాతదే అయినా దర్శకుడు దానిని నడిపించిన విధానం కొత్తగా అనిపిస్తుంది. 

కథ మొదలైన దగ్గర నుంచి చివరివరకూ దాని గ్రాఫ్ పెరుగుతూ పోతుందే తప్ప పడిపోదు. ఒకటో ఎపిసోడ్ లో ఒక హత్య జరుగుతుంది. అక్కడి నుంచి ఏడేళ్ల పాటు వెనక్కి వెళ్లిన కథ, ఫ్లాష్ బ్యాక్ లో నుంచి బయటపడి, ఐదో ఎపిసోడ్ లో ప్రస్తుతంలోకి వస్తుంది. ఈ మధ్యలో కథ అనేక ఆసక్తికరమైన మలుపులు తిరుగుతుంది. ప్రీ క్లైమాక్స్ .. క్లైమాక్స్ రెండూ కూడా ఆడియన్స్ లో ఉత్కంఠను పెంచుతూ, ఎమోషన్స్ తో కూడిన ముగింపును ఇస్తాయి. 

దర్శకుడి టేకింగ్ బాగుంది. ప్రతి పాత్రను డిజైన్ చేసిన తీరు .. ప్రతి ఎపిసోడ్ ను టైట్ కంటెంట్ తో నడిపించిన విధానం ఆకట్టుకుంటాయి. అంజలి నటన హైలెట్ .. అలాగే సింపుల్ గా కనిపిస్తూనే  రవీంద్ర విజయ్ పలికించిన విలనిజం వెరైటీగా అనిపిస్తుంది. మిగతా వాళ్లంతా కూడా తమ పాత్రలను సహజత్వానికి చాలా దగ్గరగా తీసుకుని వెళ్లారు.

ఈ సిరీస్ కి ప్రధానమైన ఆకర్షణగా లొకేషన్స్ నిలుస్తాయి. గ్రామీణ వాతావరణాన్ని తెరపై ఆవిష్కరించడంలో ప్రసన్న కుమార్ కెమెరా పనితనం మెప్పిస్తుంది. సిద్ధార్థ్ సదాశివుని బాణీలు మంచి ఫీల్ తో సాగుతాయి. నేపథ్య సంగీతం కూడా మంచి మార్కులు కొట్టేస్తుంది. ఎడిటర్ గా రవితేజ గిరజాల వర్క్ కూడా నీట్ గా అనిపిస్తుంది. 

ఇక సంభాషణల విషయానికొస్తే, 'ఇది నా సుఖార్జితం' .. 'గుడిసెలో దూరి .. గుడికి దారి అనుకున్నా అన్నట్టు' .. 'నిప్పు .. నిజాన్ని తగలెట్టమంటది' .. 'బుర్రలో బురద చేతిలోకి వస్తుందేరా' .. 'నిస్వార్ధం నీళ్ల మీద నీడలాంటిది' .. 'మంచోడు చేసే మొదటి తప్పేమిటో తెలుసా? చెడ్డోడి చరిత్ర తెలుసుకోవడం' వంటి డైలాగ్స్ గుర్తుండిపోతాయి. ఇలా అన్ని రకాలుగా .. అన్ని వైపుల నుంచి కుదిరిన కంటెంట్ ఇది. ఈ మధ్య కాలంలో వచ్చిన ఒక ఇంట్రెస్టింగ్ తెలుగు వెబ్ సిరీస్ గా దీనిని గురించి చెప్పుకోవచ్చు. 

Trailer

More Movie Reviews