'రాయన్' - మూవీ రివ్యూ!

Movie Name: Raayan

Release Date: 2024-07-26
Cast: Dhanush, S J Suryah, Prakash Raj, Slvaraghavan, Sundeep Kishan, Kalidas Jayaram, Dushara Vijayan
Director: Dhanush
Producer: Kalanithi Maran
Music: AR Rehman
Banner: Sun Pictures
Rating: 2.75 out of 5
  • ధనుష్ ప్రధాన పాత్రగా 'రాయన్'
  • అన్నాచెల్లెళ్ల ఎమోషన్స్ నేపథ్యంలో సాగే కథ
  • ఆకట్టుకునే యాక్షన్ .. ఎమోషన్స్ 
  • లోపించిన లవ్ .. రొమాన్స్ పాళ్లు 
  • అక్కడక్కడా కనిపించని లాజిక్
      

ధనుశ్ 50 వ సినిమాగా 'రాయన్' రూపొందింది. సహజంగానే ధనుశ్ తన సినిమాల కథల విషయంలో చాలా కేర్ తీసుకుంటాడు. అలాంటిది 'రాయన్' ఆయన 50వ సినిమా కావడం వలన మరింత కేర్ తీసుకోవడం సహజమనే విషయం ఆయన అభిమానులకు అర్థమైంది. ఈ సినిమాకి కథను అందించినది .. దర్శకత్వం వహించింది ఆయనే కావడం వాళ్లలో మరింత ఆసక్తిని పెంచింది. అలా నిర్మితమైన ఈ సినిమా, ఈ రోజునే తమిళంతో పాటు తెలుగులోను విడుదలైంది.

కార్తవ రాయన్ (ధనుశ్) ముత్తు రాయన్ (సందీప్ కిషన్) మాణిక్య రాయన్ (కాళిదాసు జై రామ్) ముగ్గురూ అన్నదమ్ములు. ఓ మారుమూల గ్రామంలో పేద కుటుంబంలో జీవిస్తూ ఉంటారు. ఆ ముగ్గురికీ చెల్లెలు దుర్గ (దుషారా విజయన్). వీళ్లంతా చిన్నపిల్లలుగా ఉన్నప్పడు, పనిపై పక్క ఊరుకి వెళ్లిన తల్లిదండ్రులు తిరిగిరారు. వాళ్లు ఏమైపోయారనేది వీళ్లకి తెలియదు. పొరుగింటి వ్యక్తి దుర్గను అమ్మేయాలని చూస్తుంటే, అతణ్ణి చంపేసి అక్కడి నుంచి బయటపడతారు. 

అలా వాళ్లు చెన్నైలోని 'అంజనాపురం' చేరుకుంటారు. అక్కడ వాళ్లని శేఖరన్ (సెల్వ రాఘవన్) ఆదరిస్తాడు. అతని సహకారంతో తన తమ్ముళ్లను .. చెల్లెలిని రాయన్ పెంచుతాడు. మాణిక్యం కాలేజ్ లో చదువుతూ ఉంటాడు. ముత్తు తమ కాలనీలోని మేఖల (అపర్ణ బాలమురళి)తో ప్రేమలో పడతాడు. ఇక రాయన్ మాత్రం పెళ్లి చేసుకోకుండా, టిఫిన్ సెంటర్ నడుపుతూ కష్టపడుతూ ఉంటాడు. అతనంటే చెల్లెలు దుర్గకు ఎంతో ఇష్టం. ఆమెకి పెళ్లి చేయాలనే ఉద్దేశంతో రాయన్ ప్రయత్నాలు మొదలెడతాడు. 

స్థానికంగా అక్కడ రెండు గ్యాంగుల మధ్య యుద్ధం నడుస్తూ ఉంటుంది. ఒకటి దొరై గ్యాంగ్ అయితే, మరొకటి సేతు (ఎస్.జె.సూర్య) గ్యాంగ్. ఆ రెండు గ్యాంగ్ ల సంగతి తెలిసినవాడు కావడం వలన, వాళ్లకి సాధ్యమైనంత దూరంగా రాయన్ ఉంటాడు. గతంలో ఆ ప్రాంతానికి పోలీస్ ఆఫీసర్ గా వచ్చిన తన తండ్రి, అక్కడి రౌడీయిజం కారణంగానే మరణించడం ఏఎస్ పి (ప్రకాశ్ రాజ్) కి గుర్తుంటుంది. అందువలన తెలివిగా అతను ఈ రెండు గ్యాంగుల మధ్య గొడవపెడతాడు. 

దొరై మనుషులపై దాడి చేయమని తన అనుచరులను సేతు పంపిస్తాడు.  అనుకోకుండా అక్కడికి ముత్తు వస్తాడు. అతని కారణంగానే అక్కడ గొడవ మొదలవుతుంది. ఈ రెండు గ్యాంగులకు చెందినవారు అతని చేతిలో చనిపోతారు. అలా చనిపోయినవారిలో గ్యాంగ్ స్టర్ దొరై కొడుకు ఉంటాడు. ఈ విషయం తెలిసి రాయన్ నివ్వెరపోతాడు. ఒక వైపున రెండుమూడు రోజులలో చెల్లి పెళ్లి ఉండగా ఇలా జరగడం అతనికి ఆందోళన కలిగిస్తుంది. 

రాయన్ ఊహించినట్టుగానే అతనికి దొరై కాల్ చేస్తాడు. తన కొడుకుని చంపిన ముత్తును తమకి అప్పగించమనీ, లేదంటే ఆకుటుంబ సభ్యులందరినీ చంపుతానని అంటాడు. అందుకు ఒకే ఒక్క రోజు అతను గడువు ఇస్తాడు. అప్పుడు రాయన్ ఏం చేస్తాడు? అక్కడి నుంచి అతని జీవితం ఎలాంటి మలుపు తీసుకుంటుంది? అనేవి ఆసక్తికరమైన అంశాలు. 

ధనుశ్ తయారు చేసుకున్న కథ ఇది. అన్నాచెల్లెళ్ల ఎమోషన్స్ తో కలిసి నడిచే యాక్షన్ మూవీ ఇది. సన్ పిక్చర్స్ వారి నిర్మాణం కనుక, భారీతనం విషయంలో వంకబెట్టడానికి లేదు. ఇక ధనుశ్ తయారు చేసుకున్న కథ కూడా సిల్లీగా ఏమీ లేదు. కాస్త బరువైన కథనే .. కాకపోతే కొన్ని లోపాలు కనిపిస్తాయి. హీరో ఎంతో కష్టపడి తన ఇద్దరి తమ్ముళ్లను .. ఒక చెల్లిని పెంచి పెద్ద చేస్తాడు. కానీ అతను ఏదో కోల్పోయినట్టుగా ఎప్పుడూ ముఖం మాడ్చుకుని ఉంటాడు. హీరో అలా ఉండటం చూసి .. మనకి తెలియని మరో ఫ్లాష్ బ్యాక్ మరేదైనా ఉందా? అనే అనుమానం కలుగుతుంది.

హీరో తన తమ్ముళ్లను ఎంతో ప్రేమగా పెంచుతాడు. అయినా వాళ్లు అతనికి ఎదురు తిరుగుతారు. ఆస్తిపాస్తుల వైపు నుంచి గానీ .. భార్యల వైపు నుంచి గానీ .. అధికారం విషయంలోగాని వాళ్ల మధ్య ఎలాంటి గొడవలు ఉండవు. అలాంటప్పుడు వాళ్లు ఎందుకు అంతలా మారిపోయారు? అనడానికి బలమైన కారణం కనిపించదు. ఇక హీరోకి జోడీలేదు .. ఆ పాత్ర వైపు నుంచి ఎలాంటి ఎంటర్టైన్ మెంట్ లేకపోవడం అభిమానులకు అసంతృప్తిని కలిగించే విషయం. 

దొరై గ్యాంగ్ పై హీరో విరుచుకుపడే సీన్ .. సేతు గ్యాంగ్ బారి నుంచి తన చెల్లెలిని రాయన్  కాపాడుకునే సీన్ .. హాస్పిటల్లో బెడ్ పై ఉన్న అతణ్ణి చెల్లెలు రక్షించుకునే సీన్ హైలైట్ గా నిలుస్తాయి. ఈ మొత్తం కథలో ఆశ్చర్యపోయే అంశం మరొకటి ఉంది. అదేమిటంటే వరలక్ష్మి శరత్ కుమార్ పాత్రను నామమాత్రంగా చూపించడం. అన్ని రకాలుగా అవకాశం ఉన్నప్పటికీ ఆ పాత్రను అలా వదిలేయడం నిరాశ పరుస్తుంది. 

ఏఆర్ రెహ్మాన్ నేపథ్య సంగీతం ఈ సినిమాకి ప్రధానమైన బలంగా నిలిచిందనే చెప్పాలి. ఓం ప్రకాశ్ ఫొటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. ప్రసన్న ఎడిటింగ్ కూడా బాగా కుదిరింది. ఈ కథ కొత్తదేం కాదు .. కొన్ని పాత సినిమాలను గుర్తుచేస్తూనే ఉంటుంది. ఎమోషన్స్ తో ముడిపడిన కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ మాత్రం ఆకట్టుకుంటాయి.    

Trailer

More Movie Reviews