'గోళం' (అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ!

Movie Name: Golam

Release Date: 2024-10-27
Cast: Ranjith Sajeev, Dileesh Pothan, Sunny Wayne, Alencier Ley Lopez
Director: Samjad
Producer: Anne Sajeev
Music: Aby Salvin Thomas
Banner: Fragrant Nature Film Creations
Rating: 3.00 out of 5
  • మలయాళంలో రూపొందిన 'గోళం'
  • జూన్ 7న విడుదలైన సినిమా 
  • ఆగస్టు 9 నుంచి జరుగుతున్న స్ట్రీమింగ్ 
  • రీసెంటుగా తెలుగులోనూ అందుబాటులోకి 
  • చిన్న బడ్జెట్ లో ఇంట్రెస్టింగ్ కంటెంట్ ను అందించిన డైరెక్టర్    
  

మలయాళంలో ఈ ఏడాదిలో ఇంతవరకు విడుదలైన మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ చిత్రాలలో 'గోళం' ఒకటి. సంజాద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, రంజిత్ సంజీవ్ - దిలీష్ పోతన్ ప్రధానమైన పాత్రలను పోషించారు. జూన్ 7వ తేదీన థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, ఆగస్టు 9వ తేదీన అమెజాన్ ప్రైమ్ ఫ్లాట్ ఫామ్ పైకి వచ్చింది. అప్పటి నుంచి మలయాళంలో మాత్రమే ఈ సినిమా అందుబాటులో ఉంది. రీసెంటుగా తెలుగు .. తమిళ .. కన్నడ .. హిందీ భాషల్లోను అందుబాటులోకి వచ్చింది.

 అది ఓ 15 మంది ఎంప్లాయిస్ పనిచేసే చిన్నపాటి ఆఫీస్. ఆ సంస్థకి మేనేజింగ్ డైరెక్టర్ గా 'జాన్' (దిలీష్ పోతన్) ఉంటాడు. ఆయన అంటే ఆఫీసులోని వారందరికీ భయమే. అక్కడి ఎంప్లాయిస్ ఆయన వచ్చే వరకూ కబుర్లు చెబుతూ గడిపినప్పటికీ, ఆయన వచ్చిన తరువాత కుర్చీలకు అంటుకుపోతుంటారు. వర్క్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఆయన చండశాసనుడు అయిపోతుండటమే అందుకు కారణం. 

ఆఫీసులో రిసెప్షనిస్ట్ గా 'మీరా' పనిచేస్తూ ఉంటుంది. తాను ఊరు వెళుతున్నాననీ, ఏదైనా అత్యవసరమైతే తనకి మెయిల్ చేయమని మీరాతో జాన్ చెబుతాడు. ఆ తరువాత వాష్ రూమ్ కి వెళ్లిన ఆయన ఎంతసేపటికీ బయటకి రాకపోవడంతో అంతా ఆందోళనకి లోనవుతారు. డోర్ ఓపెన్ చేసి చూస్తే, ఆయన చనిపోయి ఉంటాడు. తలకి బలమైన గాయం కావడం వలన, చాలా రక్తం పోతుంది. విషయం తెలియగానే పోలీసులు రంగంలోకి దిగుతారు.

ఏసీపీ సందీప్ (రంజిత్ సంజీవ్) ఆఫీసునంతా పరిశీలిస్తాడు. జాన్ కి బ్రీతింగ్ సమస్య ఉందనీ, వాష్ రూమ్ లో కాలుజారి పడటం వలన చనిపోయి ఉంటాడని అంతా భావిస్తారు. కానీ అది హత్య అనే ఒక అనుమానం సందీప్ కి కలుగుతుంది. అందువలన జాన్ గురించి ఎంప్లాయిస్ ను ఆరాతీస్తాడు. జాన్ కి ఇద్దరు భార్యలు ఉన్నారనీ, ఆ ఇద్దరితోను ఆయనకి విడాకులు అయ్యాయని తెలుస్తుంది. అందువలన తన ఆస్తిపాస్తులను అతను తన తమ్ముడు ఇవాన్ కి రాసిచ్చాడనీ, ఆ తమ్ముడు విదేశాల్లో ఉంటాడని తెలుసుకుంటాడు.

ఇక జాన్ కి వ్యాపార భాగస్వామిగా 'గిబ్సన్' ఉన్నాడనీ, దుబాయ్ కేంద్రంగా ఆయన వ్యాపారాలు నడుస్తూ ఉంటాయని తెలుసుకుంటాడు. ఇప్పుడు జాన్ లేడు గనుక ఆ వ్యాపారాలు 'గిబ్సన్' పర్యవేక్షణలో కొనసాగవలసి ఉంటుందనే విషయాన్ని సందీప్ గ్రహిస్తాడు. ఎంప్లాయిస్ ఫోన్స్ తీసుకుని, వారి కాల్ డేటాను సందీప్ పరిశీలిస్తాడు. ఆ ఆఫీసులో పనిచేసే 15 మందిలో 13 మంది, డాక్టర్ కురియన్ కోస్ ( సిద్ధికీ) ను తరచూ కలుసుకున్నారని తెలుసుకుంటాడు.

సందీప్ వెంటనే బయల్దేరి ఆ డాక్టర్ ఇంటికి వెళతాడు. జాన్ చనిపోయాడని డాక్టర్ తో చెబుతాడు. జాన్ మరణం చుట్టూ ఒక మిస్టరీ ఉందని అంటాడు. జాన్ సంస్థలో పనిచేసే వాళ్లంతా ఆ డాక్టర్ ను  తరచూ కలుస్తుండటం పట్ల అనుమానాన్ని వ్యక్తం చేస్తాడు. అప్పుడు ఆ డాక్టర్ ఓ అనూహ్యమైన విషయాన్ని గురించి సందీప్ కి చెబుతాడు. అదేమిటి? అది తెలుసుకున్న సందీప్ ఏం చేస్తాడు? జాన్ మరణం హత్యనా? సహజమైనదా? అనేది కథ.

ఒక చిన్నపాటి ఆఫీసులోని వాష్ రూమ్ లో బాస్ చనిపోతాడు. ఆ సమయంలో ఆ ఆఫీసుకి కొత్తగా ఎవరూ రాలేదు. ఉన్న ఎంప్లాయిస్ అంతా సీసీటీవీ కెమెరాల పరిధిలోనే ఉన్నారు. బాస్ చనిపోయిన ప్రదేశంలో ఎలాంటి ఆధారాలు లభించవు. కానీ అతనిది హత్య కావొచ్చనే ఒక అనుమానం పోలీస్ ఆఫీసర్ కి ఉంటుంది. ఆయన అనుమానం నిజమేనా? అనే ఒక మర్డర్ మిస్టరీ చుట్టూ ఈ కథ తిరుగుతూ ఉంటుంది.

దర్శకుడు సంజాద్, ప్రవీణ్ విశ్వనాథ్ తో కలిసి తయారు చేసుకున్న కథ ఇది. ఇది చాలా చిన్న కథ .. ఒక ఆఫీసు పరిధిలో జరిగే కథ. అయినా దర్శకుడు ఎక్కడా బోర్ అనిపించకుండా ఈ కథను ముందుకు నడిపించాడు. ఆయన చేసిన స్క్రీన్ ప్లే ఆడియన్స్ లో ఆసక్తిని రేకెత్తిస్తుంది. సన్నివేశాలన్నీ కూడా చాలా సహజంగా .. వాస్తవానికి దగ్గరగా అనిపిస్తాయి. ఇది చాలా చిన్న కంటెంట్ అనుకుంటూ ఉండగా, అది ఒక పెద్ద పాయింటును పట్టుకొని వస్తుంది. అప్పటి నుంచి కథలో ఉత్కంఠ పెరుగుతుంది. 

దర్శకుడు కథను చెప్పిన తీరు బాగుంది. ఎక్కడా ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా నీట్ గా తాను చెప్పదలచుకున్నది చెప్పాడు. సాధారణంగా హారర్ థ్రిల్లర్ జోనర్ కి సంబంధించిన కథలను ఒక ఇంట్లో ప్లాన్ చేసి, తక్కువ బడ్జెట్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకుని వస్తుంటారు. కానీ ఇలాంటి ఒక నేపథ్యంతో .. సింపుల్ కంటెంట్ ను బలంగా చెప్పడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. విజయ్ ఫొటోగ్రఫీ .. అబీ సాల్వన్ థామస్ నేపథ్య సంగీతం .. మహేశ్ భువనేంద్ ఎడిటింగ్ మంచి అవుట్ పుట్ ను అందించాయి.         

     
 ఆర్టిస్టులంతా కూడా చాలా సహజంగా నటించారు. మనం కూడా కథ నడుస్తున్న ఆఫీసులో ఉన్నామని అనిపిస్తుంది. అంత సహజంగా సన్నివేశాలను ఆవిష్కరించారు. అనుమానాస్పద మృతి .. దాని వెనకున్న కారణం .. పోలీస్ ఇన్వెస్టిగేషన్ .. ఈ మూడు అంశాలు బలంగానే కనిపిస్తాయి. 90 శాతం కథ నాలుగు గోడల మధ్యనే జరిగినా, ఎలాంటి అసహనం .. అసంతృప్తి లేకుండా ఈ సినిమా చూడొచ్చు.

Trailer

More Movie Reviews