'ఉషా పరిణయం' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ!

Movie Name: Usha Parinayam

Release Date: 2024-11-15
Cast: Sri kamal, Tanvi Akanksha, Surya Srinivas, Ali, Amani, Vennela kishore
Director: Vijay Bhaskar
Producer: Vijay Bhaskar
Music: RR Dhruvan
Banner: Vijay Bhaskar Kraft
Rating: 2.00 out of 5
  • శ్రీ కమల్ హీరోగా 'ఉషా పరిణయం'
  • ఆగస్టు 2న థియేటర్లకు వచ్చిన సినిమా 
  • ఈ రోజు నుంచి మొదలైన స్ట్రీమింగ్ 
  • రొటీన్ గా సాగే లవ్ స్టోరీ               

విజయ్ భాస్కర్ కె. దర్శకత్వంలో గతంలో చాలా పెద్ద హిట్లు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అలాంటి ఆయన తన తనయుడు శ్రీ కమల్ ను హీరోగా పరిచయం చేస్తూ రూపొందించిన సినిమానే 'ఉషా పరిణయం'. తన్వి ఆకాంక్ష కూడా ఈ సినిమాతోనే కథానాయికగా పరిచయమైంది. ఆగస్టు 2వ తేదీన థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, ఈ రోజు నుంచే 'ఈటీవీ విన్'లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా కథేమిటనేది చూద్దాం. 

కథ: హనీ (శ్రీ కమల్) దుబాయ్ లో ఒక కోర్స్ ను పూర్తిచేసి ఇండియాకి బయల్దేరతాడు. ఆ సమయంలోనే అతను దొంగల బారినపడిన ఆనంద్ ( సూర్య శ్రీనివాస్)ను కాపాడతాడు. ఇద్దరూ చేరుకోవలసింది హైదరాబాద్ కావడంతో, కలిసి ప్రయాణం చేస్తారు. ఆ సమయంలోనే ఇద్దరూ ఒకరిని గురించి ఒకరు తెలుసుకుంటారు. తనకి నిశ్చితార్థం అయిందని ఆనంద్ చెబుతాడు. తాను ఒక యువతిని ప్రేమించానుగానీ, ఆమెతో వివాహం జరుగుతుందో లేదో చెప్పలేనని హనీ అంటాడు. 

దుబాయ్ వెళ్లడానికి ముందు, హనీ ఒక సంస్థలో పని చేస్తూ ఉంటాడు. అదే సంస్థలో పనిచేస్తున్న ఉష (తన్వి ఆకాంక్ష)ను ప్రేమిస్తాడు. అయితే ఆమె పట్ల తన ప్రేమను మనసులోనే దాచుకుంటాడు. దుబాయ్ కి వెళ్లి ఫలానా కోర్స్ పూర్తి చేసి రమ్మనీ, ఈ లోగా తాను ఉష పేరెంట్స్ తో మాట్లాడతాననని హనీకి తండ్రి మాట ఇస్తాడు. కొడుకుకి ఇచ్చిన భరోసా మేరకు, హనీ తండ్రి వెళ్లి ఉష తండ్రిని కలుస్తాడు. అయితే అప్పటికే వేరొకరితో ఆమె నిశ్చితార్థం జరిగిపోయిందని తెలిసి షాక్ అవుతాడు.

  ఉష నిశ్చితార్థం జరిగింది ఆనంద్ తోనే అనే విషయం హనీకీ తెలుస్తుంది. పెళ్లి పనులు జరుగుతున్న సమయంలోనే, తనని హనీ ప్రేమించిన సంగతి ఉషకి తెలుస్తుంది. ఇక ఆనంద్ మేనమామ నాగరాజు ఈ పెళ్లి విషయంలో గుర్రుగా ఉంటాడు. తన కూతురును కాదన్నందుకు ఈ పెళ్లి జరక్కుండా చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఈ నేపథ్యంలో ఏం జరుగుతుంది? హనీ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుంది? అనేది కథ. 
  
 విశ్లేషణ: కథ మొదలవుతూ ఉండగానే హనీ దుబాయ్ నుంచి ఇండియా బయల్దేరతాడు. ఆ సమయంలోనే అతనికి ఆనంద్ తో పరిచయమవుతుంది. ఇండియాకి వెళ్లగానే తాను ఉషను పెళ్లి చేసుకోవాలనే ఆశతో హనీ ఉంటాడు. తనతో కలిసి ప్రయాణిస్తున్న ఆనంద్ తో ఆల్రెడీ ఉష ఎంగేజ్ మెంట్ జరిగిందనే విషయం వరకూ ఫస్టాఫ్ కవర్ చేస్తుంది. ఇక అప్పటి నుంచి ఈ ఇద్దరిలో ఉష ఎవరికి దక్కుతుందనే మలుపులతో సెకండాఫ్ నడుస్తుంది.

సాధారణంగా కొన్ని సినిమాలలో కొంత కథ నడిచిన తరువాత, క్లైమాక్స్ ఎలా ఉంటుందనే ఒక విషయాన్ని ప్రేక్షకులు అంచనా వేయగలుగుతారు. కానీ ఈ సినిమాలో కథ మొదలైన కాసేపటికే, ముగింపు ఏమై ఉంటుందనే ఒక అంచనాకి ప్రేక్షకులు వచ్చేస్తారు. ఇక వాళ్ల అంచనాలను తలక్రిందులు చేయడం ఇష్టం లేనట్టుగా, వాళ్లు అనుకుంటున్నదే నిజం చేస్తూ ఈ కథ చివరి వరకూ కొనసాగుతుంది.

ఇక అలా అంచనాకి రాలేని ప్రేక్షకులకు దర్శకుడు ఒక హింట్ కూడా ఇచ్చాడు. పెళ్లికి ముందు షాపింగ్ కి వెళ్లిన పెళ్లి కొడుకు,పెళ్లి డ్రెస్ ను తనతో పాటు తన స్నేహితుడికి కూడా ఒకటి తీసుకుంటాడు. క్లైమాక్స్ చాలా దూరంలో ఉండగానే వచ్చే ఇలాంటి సీన్స్ వలన ప్రేక్షకులలో కుతూహలం తగ్గుతూ పోతుంది. ఆల్రెడీ చాలా లవ్ స్టోరీస్ లో చూసిన సీన్స్ ను పోగేసుకుని ఒకే దగ్గర చూస్తున్నట్టుగా అనిపిస్తుంది.

ఈ లవ్ స్టోరీకి సంబంధించిన ట్రాక్ పక్కన పెడితే, హనీ పేరెంట్స్ వైపు నుంచి గానీ, ఉష వైపు నుంచి గాని ఎమోషన్స్ కనెక్ట్ కావు. కథలో విలనిజం తగ్గిందేమో అన్నట్టుగా, పెళ్లి కొడుకు మేనమామ పాత్రను రంగంపైకి తీసుకుని వచ్చారు. కానీ ఆ పాత్రలో విషయం కూడా అంతంత మాత్రమే కావడంతో కథ మరింత డీలా పడుతుంది. హమ్మయ్య కామెడీ పాళ్లు సర్దడానికి వెన్నెల  కిశోర్ వచ్చాడని అనుకునేలోగా తెరపై నుంచి ఆ పాత్ర మాయమవుతుంది.


ఇక 'డాన్ బాస్కో' ఫేమస్ ఫ్యాషన్ డిజైనర్ అంటూ హడావిడి చేసిన అలీ పాత్ర నవ్విస్తుందని అంతా అనుకుంటారు. విషయం లేకపోవడం వలన ఆ పాత్ర చాలా ఫాస్టుగా పక్కకి తప్పుకుంటుంది. ఆడియన్స్ కూడా అంతే ఫాస్టుగా ఆ పాత్రను గురించి మరిచిపోతారు. ఇలా కామెడీ పుంజుకోలేక ఎప్పటికప్పుడు వెనకబడిపోతూ ఉంటుంది.     

పనితీరు: దర్శకుడిగా విజయ్ భాస్కర్ కి మంచి అనుభవం ఉంది. కానీ ఎందుకనో ఆయన సరైన కంటెంట్ ను ఎంచుకోలేదని అనిపిస్తుంది. ఎందుకంటే ఒక ప్రేమకథకు కావలసిన అంశాలు .. ఫీల్ తో కూడిన పాటలు ఈ కథలో లోపించాయి. కథ .. స్క్రీన్ ప్లే రెండూ కూడా బలహీనంగానే అనిపిస్తాయి.  విజయ్ భాస్కర్ తనయుడు శ్రీకమల్ కి హీరోగా ఇది మొదటి సినిమానే అయినా, తడబడకుండా చేశాడు. హీరోయిన్ పరంగా చూసుకుంటే, గ్లామర్ పరంగా మార్కులు తక్కువే పడతాయి. 

 సతీశ్ ముత్యాల ఫొటోగ్రఫీ .. ఆర్ ఆర్ ధృవన్ సంగీతం .. వర్మ ఎడిటింగ్ ఓకే. మొత్తంగా చూసుకుంటే, ఇది ఏ మాత్రం కొత్తదనం లేని ఒక రొటీన్ లవ్ స్టోరీ అనే చెప్పవలసి ఉంటుంది.

Trailer

More Movie Reviews