'మూన్ వాక్' (జియో సినిమా) వెబ్ సిరీస్ రివ్యూ!

Movie Name: Moonwalk

Release Date: 2024-12-20
Cast: Kumar Anshuman, Samir Kochhar, Neha Chouhan, Nidhi Singh, Sheeba Chadda
Director: Ajay Bhuyan
Producer: Jyothi Desh Pande
Music: Sneha Khanwalkar
Banner: Ajar Pictures
Rating: 2.50 out of 5
  • హిందీలో రూపొందిన 'మూన్ వాక్'
  • 10 ఎపిసోడ్స్ తో పలకరించిన సిరీస్ 
  • కామెడీ ప్రధానంగా నడిచే కథ 
  • నిదానంగా సాగే స్క్రీన్ ప్లే 
  • సాదా సీదాగా అనిపించే కంటెంట్

'మూన్ వాక్' .. వెబ్ సిరీస్ ఈ నెల 20వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జ్యోతి దేశ్ పాండే - అజయ్ రాయ్ నిర్మించిన ఈ సిరీస్ కి అజయ్ భుయాన్ దర్శకత్వం వహించాడు. కుమార్ అన్షు మాన్ .. సమీర్ కొచ్చర్ .. షీబా చద్దా .. నేహా చౌహన్ .. నిధి సింగ్ .. గీతాంజలి కులకర్ణి ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సిరీస్ ను 10 ఎపిసోడ్స్ గా రూపొందించారు. హిందీతో పాటు ఇతర భాషలోను ఈ సిరీస్ అందుబాటులో ఉంది. ఈ సిరీస్ కథ ఏమిటనేది ఇప్పుడు చూద్దాం. 

కథ: ఈ కథ ఉత్తర్ ప్రదేశ్ లోని రాంపూర్ లో జరుగుతుంది. రాంపూర్ లో తారిఖ్ (కుమార్ అన్షుమాన్) చిన్నచిన్న దొంగతనాలు చేస్తూ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. తన పనిలో తాను సక్సెస్ అయినప్పుడు సంతోషంతో 'మూన్ వాక్' చేయడం అతనికి అలవాటు. అతను చాందిని (  నిధి సింగ్) ప్రేమలో పడతాడు. అయితే అదే సమయంలో చాందినీని మ్యాడీ (సమీర్ కొచ్చర్) అనే మరో దొంగ తన వలలో వేసుకుంటాడు. దాంతో ఆ ఇద్దరి మధ్య చాందిని గురించి గొడవ జరుగుతూ ఉంటుంది. 
 
 ఆ ఇద్దరిలో త్వరలో ఎవరైతే ఎక్కువ ఖరీదైన వస్తువును కొట్టేస్తారో వాళ్లతోనే తాను ఉంటానని చాందిని ఒక షరతు పెడుతుంది. దాంతో బంగారు కమ్మోడ్ ను దక్కించుకునే ప్రయత్నాలలో తారిఖ్, డైమండ్ నెక్ లెస్ ను కాజేసే ప్లాన్ లో మ్యాడీ ఉంటారు. ఈ సమయంలోనే తారిఖ్ కి అజ్మత్ (నేహా చౌహాన్) పరిచయం అవుతుంది. ఇక గ్యాంగ్ స్టర్ బదన్ సింగ్, తిరిగి తాను పుంజుకోవడానికి తగిన డబ్బును కూడగట్టే పనిలో పడతాడు, అతని కొడుకు చప్పన్ (అనిల్ చరణ్ జిత్) ఏవో ప్రయోగాలు చేస్తూ ఉంటాడు. 

చంద్రుడికి సంబంధించిన ఒక రాయి ఫలానా చోటున భూమిపై పడుతుందనీ, అది ఎంతో విలువైనదని తన తండ్రితో చప్పన్ చెబుతాడు. వాళ్లు ఆ రాయిని రహస్యంగా దక్కించుకోవడం తారిఖ్ కంటపడుతుంది. అప్పుడు అతను ఏం చేస్తాడు? ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటాడు? అజ్మత్ ఎవరు? ఆమెతో అతని పరిచయం ఎంతవరకూ వెళుతుంది?  చాందిని అతనికి దక్కుతుందా లేదా? అనేది మిగతా కథ. 

విశ్లేషణ: ఇది 10 ఎపిసోడ్స్ గా రూపొందిన సిరీస్. చాందిని అనే ఒక యువతిని దక్కించుకోవడానికి తారిఖ్  .. మ్యాడీ పోటీపడుతూ ఉంటారు. ఈ ఇద్దరి తల్లుల మధ్య కూడా గతంలో వార్ జరుగుతుంది. అదేమిటనేది దాచేస్తూ దర్శకుడు ఈ కథను ముందుకు తీసుకుని వెళతాడు. అలాగే ఒక వైపున తారిఖ్ .. మరో వైపున మ్యాడీ ఇద్దరూ చాందిని కోసం దొంగతనాలు చేసే పనుల్లో ఉంటే, ఈ ఇద్దరినీ పట్టుకోవడానికి రంగంలోకి దిగిన పోలీస్ ఆఫీసర్ రమేశ్ వైపు నుంచి కూడా కథ నడుస్తూ ఉంటుంది. 

ఇక డబ్బులేకపోతే గ్యాంగ్ స్టర్ అయినా ఎంత బలహీనుడవుతాడనేది బదన్ సింగ్ పాత్ర ద్వారా చూపించాడు. ఇక బలహీనుడి చేతికి ఖరీదైన వస్తువు దొరికితే దానిని కాపాడుకోవడం ఎంత కష్టమనే విషయాన్ని చప్పన్ పాత్ర ద్వారా చెప్పాడు. ఇలా ఈ కథ అంతటికీ కలిపి కామెడీ కోటింగ్ ఇచ్చాడు. అయితే అది సరిపోలేదేమో అనిపిస్తుంది. చప్పన్ - అతని తండ్రికి సంబంధించిన ట్రాక్ సరిగ్గా డిజైన్ చేయలేదు. దాంతో కథ ఆ వైపు నుంచి స్లో అయింది.

దర్శకుడు వేసుకున్న స్క్రీన్ ప్లే బాగానే ఉంది. కానీ దానిని నిదానంగా నడిపించడం ఇబ్బందిని కలిగిస్తుంది. ఎత్తులు .. పయ్యెత్తులు .. ట్విస్టులు పెద్దగా వర్కౌట్ చేయలేదు. అలాగే దొంగతనాలు జరిగే తీరు కూడా అంతగా ఆసక్తిని రేకెత్తించలేదు .. నవ్వించనూ లేదు. సిరీస్ ముగింపుకు చేరుకుంటున్నప్పటికీ, ఏం జరగనుందనే ఉత్కంఠను రేకెత్తించలేకపోయారు. అందువలన ఇది ఒక సాదాసీదా సిరీస్ గానే మిగిలిపోయిందని చెప్పాలి. 

పనితీరు: ఈ సిరీస్ మొత్తం చూసిన తరువాత, దర్శకుడు మరికాస్త దృష్టిపెడితే నెక్స్ట్ లెవెల్ కి వెళ్లేదే అనిపిస్తుంది. ఈ కథలో కామెడీ .. రొమాన్స్ పాళ్లు కాస్త పెంచి, దొంగతనాలు జరిగే ఎపిసోడ్స్ ను మరింత ఇంట్రెస్టింగ్ గా డిజైన్ చేసుకుని ఉంటే బాగుండేదని అనిపించకమానదు. కథ - స్క్రీన్ ప్లే విషయంలో శివ సింగ్ ఇంకాస్త దృష్టి పెట్టవలసింది. 

ప్రధానమైన పాత్రలను పోషించిన ఆర్టిస్టులంతా తమ పాత్రలలో మెప్పించారు. ముఖ్యంగా కుమార్ అన్షుమాన్ నటన ఎక్కువగా ఆకట్టుకుంటుంది. ఆయన 'మూన్ వాక్' చేసే తీరు అలరిస్తుంది. జితిన్ హర్మీత్ సింగ్ ఫొటోగ్రఫీ బాగుంది. దృశ్యాలను చాలా సహజంగా ఆయన తెరపైకి తీసుకుని వచ్చాడు. స్నేహా ఖాన్ వాల్కర్ నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. హర్షిత్ శర్మ ఎడిటింగ్ ఓకే. నిదానంగా సాగే 'మూన్ వాక్' గా ఈ సిరీస్ ను గురించి చెప్పుకోవచ్చు. 

Trailer

More Movie Reviews