'రహస్యం ఇదం జగత్' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ!

Movie Name: Rahasyam Idham Jagath

Release Date: 2024-12-26
Cast: Rakesh, Sravanthi, Manasa Veena, Bhargav, Karthik
Director: Komal R Bharadwaj
Producer: Padma Ravinuthula - Hiranya Ravinuthula
Music: Gyaani
Banner: Singlecell Universe Production
Rating: 2.00 out of 5
  • సైన్స్ ఫిక్షన్ జోనర్లో నడిచే సినిమా 
  • విదేశాలలోనే రూపొందిన కంటెంట్
  • ప్రయోగం దిశగా సాగిన ప్రయత్నం  
  • అంత తేలికగా అర్థంకాని కథాకథనాలు

తెలుగులో అటు సైన్స్ ఫిక్షన్ కథలు .. ఇటు మైథలాజికల్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో కూడిన కథలు వచ్చాయి. సైన్స్ ఫిక్షన్ కి మైథలాజికల్ టచ్ ఇస్తూ రూపొందిన కథనే 'రహస్యం ఇదం జగత్'. కోమల్ ఆర్. భరద్వాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, నవంబర్ 8వ తేదీన థియేటర్లకు వచ్చింది. అయితే పబ్లిసిటీ పెద్దగా లేకపోవడం వలన, థియేటర్స్ కి ఎప్పుడు వచ్చి వెళ్లిందనేది చాలామందికి తెలియదు. అలాంటి ఈ సినిమా ఈ రోజు నుంచి 'ఈటీవీ విన్'లో స్ట్రీమింగ్ అవుతోంది.

కథ:  అభి (రాకేశ్) విదేశాలలో జాబ్ చేస్తూ ఉంటాడు. అక్కడ అతనికి అకీరా (స్రవంతి) పరిచయమవుతుంది. ఆ పరిచయం ప్రేమగా మారుతుంది. తన తండ్రి చనిపోవడంతో, అకీరా ఇండియా వెళ్లడానికి సిద్ధమవుతుంది. అకీరాను విడిచి తాను ఉండలేనని భావించిన అభి, ఆమెతో పాటు తాను కూడా వెళ్లాలని నిర్ణయించుకుంటాడు. అయితే అంతకుముందు ఇద్దరూ కలిసి సరదాగా కార్లో ఒక ట్రిప్ వేస్తారు. 

అలా ఫారెస్టుకి సమీపంలోని ఒక బార్ కి వెళతారు. అక్కడ వారికి అరుణి - కల్యాణ్ - విశ్వతో  పరిచయం అవుతుంది. తప్పనిసరి పరిస్థితులలో వాళ్లంతా ఒకరాత్రి ఒక ఇంట్లో ఉండవలసి వస్తుంది. 'అరుణి'కి టైమ్ ట్రావెల్ .. వామ్ హోల్ .. మల్టీ యూనివర్స్ అనే అంశాలపై అవగాహన ఉంటుంది. అందుకు సంబంధించిన విషయాలపై ఆమె పరిశోధన కూడా చేస్తూ ఉంటుంది. శ్రీరాముడు .. శ్రీకృష్ణుడి కాలంలోనే అలాంటి సైన్స్ ఉందనే విషయాన్ని కూడా ఆమె వాళ్ల దగ్గర ప్రస్తావిస్తుంది.   

అభి విషయంలో విశ్వ చాలా కోపంగా ఉంటాడు. ప్రీతితో కలిసి గతంలో తనని మోసం చేసిన అభిని దెబ్బతీయాలని అతను రగిలిపోతూ ఉంటాడు. కావాలనే అతను అభిని రెచ్చగొడుతూ ఉంటాడు. అప్పుడు అభి ఏం చేస్తాడు? విశ్వతో అతని గొడవ ఎక్కడివరకూ వెళుతుంది? అతను అకీరాను కాపాడుకోగలుగుతాడా? ఇండియాకి తీసుకుని వెళతాననే తన మాటను నిలబెట్టుకోగలుగుతాడా? అనేది మిగతా కథ. 

విశ్లేషణ: ఈ కథ అంతా కూడా విదేశాలలో జరుగుతుంది. అభి - అకీరా ప్రేమ వ్యవహారంతో చాలా సాదాసీదాగా మొదలవుతుంది. ఆ తరువాత నిదానంగా ఇతిహాసమైన రామాయణాన్ని టచ్ చేస్తూ,  సైన్స్ ఫిక్షన్ దిశగా ముందుకు వెళుతుంది. ఇతిహాసాన్ని ఉదాహరణగా చూపుతూ, ఇప్పుడు కూడా టైమ్ ట్రావెల్ చేయవచ్చని నిరూపించే ఉద్దేశం దిశగా ఈ కథ నడుస్తుంది. ఈ మధ్యలో 'శ్రీచక్ర మేరు' సంబంధమైన ఒక ప్రయోగం చోటు చేసుకుంటుంది. 

నిజానికి దర్శకుడు చాలా క్లిష్టమైన అంశాన్ని ఎంచుకున్నాడనే అనిపిస్తుంది. ఈ తరహా కథలపై ఎంతో కసరత్తు చేయవలసి ఉంటుంది. దర్శకుడికి ఎంతవరకూ క్లారిటీ వచ్చిందనేది ఒక విషయమైతే, దానిని ప్రేక్షకులకు ఎంతవరకూ అర్థమయ్యేలా చెప్పాడనేది మరో విషయం. ఒక లవ్ స్టోరీ .. దానిని కలుపుకుని సాగే ఒక చిన్న రివేంజ్ స్టోరీ .. టైమ్ ట్రావెల్ .. శ్రీచక్రమేరు .. ఇలా అన్ని అంశాలు కలపడం వలన సాధారణ ప్రేక్షకులకు ఒక గందరగోళం ఏర్పడుతుంది. 
    
ప్రధానమైన పాత్రలు కొన్ని రిజిస్టర్ అవుతాయి. మధ్యలో మరికొన్ని పాత్రలు ఎంటరవుతాయి. ఆ పాత్రల తాలూకు స్పష్టత ఆడియన్స్ కి ఉండదు. ఇంతకుముందు జరిగింది నిజమా? ఇప్పుడు చూస్తున్నది నిజమా? అనే ఒక సందేహంలో ప్రేక్షకులు ఉండగానే, మిగతా సన్నివేశాలు జరిగిపోతూ ఉంటాయి. కథకు ముగింపు పడినా .. ఆడియన్స్ లోని సందేహాల అలా కొనసాగుతూనే ఉంటాయి. 

పనితీరు: ఆర్టిస్టులంతా కొత్తవారే .. ఎవరి పాత్ర పరిధిలో వాళ్లు నటించారు. దర్శకుడు కథాకథనాలను .. పాత్రలను డిజైన్ చేసే విషయంలో మరింత శ్రద్ధ పెడితే బాగుండేది. ఏది ఎలా ఎందుకు జరుగుతోంది? అనే విషయం ఆడియన్స్ కి వెంటనే తట్టదు. స్క్రీన్ ప్లే కూడా కాస్త గందరగోళంగానే నడుస్తుంది.టేలర్ బ్లూమెల్ కెమెరా పనితనం బాగుంది. ఫారెస్టు నేపథ్యంలోని సన్నివేశాలు .. నైట్ ఎఫెక్ట్ తో కూడిన సీన్స్ ను చిత్రీకరించిన విధానం ఆకట్టుకుంటుంది. గ్యాని నేపథ్య సంగీతం ఫరవాలేదు. చోటా.కె ప్రసాద్ ఎడిటింగ్ ఓకే.

 ఆర్టిస్టులు అంతా కొత్తవారు కావడం వలన .. కథ అంతా ఫారిన్ లో జరగడం వలన .. ఇది డబ్బింగ్ సినిమానేమో అనే అనుమానం కలగక మానదు. దర్శకుడు ఈ కథకి ఒక రూపం తీసుకుని రావడానికి చాలా కష్టపడే ఉంటాడు. ఈ సినిమాను అర్థం చేసుకోవడానికి ప్రేక్షకులు కూడా కాస్త కష్టపడవలసిందే.  

Trailer

More Movie Reviews