డ్రైవింగ్ సిమ్యులేటర్ ను ఏర్పాటు చేసిన మంత్రి పువ్వాడ

ఖమ్మం రవాణా కార్యాలయంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చొరవతో డ్రైవింగ్ సిమ్యులేటర్ ను ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఆయా సిమ్యులేటర్ ను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడారు.

ప్రస్తుత కోవిడ్ తరుణంలో అనేక మార్పులు చేర్పుల అనంతరం కొన్ని కొత్త ప్రయోగాలకు శ్రీకారం చుట్టామన్నారు. వినియోగదారుడు కార్యాలయంకు రాకుండానే అనేక సేవలు ఇప్పటికే ఆన్లైన్ చేశామన్నారు. ఇటీవలే జులై 24వ తేదీన మరో 5 సేవలు ఆన్లైన్లో పొందుపరిచామని ఇది వినియోగదారుడికి ఎంతో సౌకర్యవంతంగా మారిందన్నారు.

రాష్ట్ర ప్రభుత్వనికి ఆదాయం సమకూర్చే శాఖలో రవాణా శాఖ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. కోవిడ్ కి ముందు దాదాపు 350 కోట్ల రూపాయల ఆదాయం ప్రభుత్వంకు రాగా ప్రస్తుతం అది 300 కోట్ల వారికీ వస్తుందన్నారు. అయితే ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చడంలో చాలా మెరుగు పడ్డామని పాత పరిస్థితులు మెల్లగా వస్తున్నాయని పేర్కొన్నారు.

హైదరాబాద్ రవాణా కార్యాలయంలో ఉండే ప్రతి సౌకర్యాన్ని విస్తరించాలని తలచి నేడు సిమ్యులేటర్ ను అందుబాటులోకి తెచ్చామన్నారు. కార్లు, భారీ వాహనాలు నేర్చుకోదలచిన వారు మొదట సిమ్యులేటర్స్‌పైన తప్పనిసరిగా శిక్షణ పొందాల్సిందేనని అన్నారు. రోడ్డుపై వాహనాన్ని నడిపేందుకు ముందు సిమ్యులేటర్‌ ద్వారా డ్రైవింగ్‌ మెళకువలను తెలుసుకోడం తప్పనిసరి అని, ఇందుకోసం రవాణాశాఖ స్వయంగా సిమ్యులేటర్‌ శిక్షణకు శ్రీకారం చుట్టిందన్నారు. లెర్నింగ్‌ లైసెన్సు పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులను సిమ్యులేటర్‌ శిక్షణకు ప్రోత్సహించేందుకు ఖైరతాబాద్‌లోని రవాణా శాఖ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సిమ్యులేటర్‌ మాదిరిగానే తొలిసారిగా ఖమ్మంలో ఈ సౌకర్యం కల్పించడం జరిగిందన్నారు.

ఈ నేపథ్యంలో ప్రతి డ్రైవింగ్‌ స్కూల్లో సిమ్యులేటర్‌ శిక్షణ తప్పనిసరి చేయనుమని పేర్కొన్నారు. తద్వారా ప్రాథమిక దశలోనే వాహనదారులకు రహదారి భద్రత, ట్రాఫిక్‌ నిబంధనలపైన అవగాహన ఏర్పడుతుందన్నారు. రోడ్డుపైన వాహనాన్ని నడపడం కంటే ముందే డ్రైవింగ్‌ లో మెళకువలను నేర్పించడం వల్ల రెట్టింపు ప్రయోజనం ఉంటుందని తెలిపారు.

ట్రాఫిక్‌ రద్దీలో గందరగోళానికి గురి కాకుండా, ఎలాంటి శాస్త్రీయత లేకుండా, నాణ్యమైన పద్ధతులు లేకుండా లభిస్తోన్న శిక్షణ స్థానంలో సిమ్యులేటర్‌లు శాస్త్రీయమైన పద్ధతులకు దోహదం చేస్తుందని వారు అన్నారు.

సిమ్యులేటర్ తో అనేక ప్రయోజనాలు ఉన్నాయని వివరించారు.
◆ డ్రైవింగ్‌ పట్ల భయం తొలగిపోతుంది. ట్రాఫిక్‌ రద్దీ, వాహనాల రద్దీ వంటి పరిస్థితుల్లో గందరగోళం లేకుండా వాహనం నడిపే అవగాహన ఏర్పడుతుంది.
◆ క్లచ్, గేర్, ఎక్స్లేటర్, స్టీరింగ్, ఇండికేటర్, హెడ్‌లైట్, వైపర్‌లను ఎలా వినియోగించాలో, ఏ సమయంలో ఏం చేయాలనేది నేర్చుకోవచ్చు. 
◆ ట్రాఫిక్‌ రద్దీ దృష్ట్యా రోడ్డుపైన ఏ ట్రాక్‌లో వాహనం నడపాలనే అంశంపై అవగాహన ఉంటుంది. ట్రాఫిక్‌ రద్దీ తీవ్రతకు అనుగుణంగా ట్రాక్‌లలో మార్పులు చోటు చేసుకుంటాయి. 
◆ కుడి, ఎడమ ఇండికేటర్స్‌ ఎలా విని యోగించాలో తెలుసుకోవచ్చు. ‘యు’ టర్న్‌ తీసుకొనేటప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలు తెలుస్తాయి. 
◆ ఘాట్‌రోడ్లు, లోతట్టు ప్రాంతాల్లో వాహనం నడిపేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలపైన సిమ్యులేటర్‌లు అవగాహన కల్పిస్తాయి. 
వర్షాకాలం, మంచుకురిసే సమయాల్లో హెడ్‌లైట్లను తప్పనిసరిగా వేయాలి. వైపర్‌ల కండీషన్‌ ముఖ్యం. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలను పాటించకపోవడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. సిమ్యులేటర్‌ శిక్షణ డ్రైవింగ్‌తో ముడిపడిన ప్రతి అంశంపైన అవగాహన కల్పిస్తుంది. 
◆ సిగ్నల్‌ పడిన సమయంలో ఎంత దూరంలో వాహనం నిలపాలి. పార్కింగ్‌ సమయంలో ఎలాంటి మెళకువలు పాటించాలి వంటి అన్ని అంశాలపైన యానిమేషన్‌ చిత్రాల ద్వారా అవగాహన కల్పిస్తారు. 
◆ వివిధ రకాల రోడ్లు, సైన్‌బోర్డులు, జాగ్రత్తలు, హెచ్చరికల సూచీకలపైన అవగాహన కలుగుతుంది. 
◆ ప్రమాదాలు జరిగినప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలు తెలుస్తాయి. 
◆ అన్ని విషయాలపైన స్పష్టమైన అవగాహన కలుగుతుంది. ఆ తరువాత రోడ్డుపైన ఎలాంటి గందరగోళం లేకుండా తాపీగా నేర్చుకోగలుగుతాడు. 
◆ రోడ్డు భద్రతపై అవగాహన పెరుగుతుంది. సిమ్యులేటర్‌ ద్వారా శిక్షణ పొందేవారికి అనేక అంశాలపైన కచ్చితమైన అవగాహన కలుగుతుంది. ముఖ్యంగా రోడ్డు భద్రతా నిబంధనలు తెలుస్తాయి. 
◆ వాతావరణం, ట్రాఫిక్‌ రద్దీలో వచ్చే మార్పులకు అనుగుణంగా వాహనం నడిపే తీరు, వేగనియంత్రణ, వివిధ రకాల విడిభాగాలను వినియోగించే పద్ధతిని ముందుగానే తెలుసుకొని ఆ తరువాత వాహనం స్టీరింగ్‌ పట్టుకోవడం వల్ల డ్రైవింగ్‌ పైన అపోహలు, ఆందోళన తొలగిపోతాయి.

More Press News