సీఎం రిలీఫ్ ఫండ్ కి స్త్రీనిధి ఉద్యోగుల ఒక రోజు వేతనం విరాళం
కేటీఆర్ కి అందచేసిన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
హైదరాబాద్, ఆగస్టు 12: గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలోని పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో పని చేస్తున్న స్త్రీ నిధి ఉద్యోగులు తమ ఒక రోజు వేతనాన్ని కరోనా బాధితులకు ఉపయోగించడానికి వీలుగా తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి అందచేశారు. ఒక రోజు వేతనం రూ. 4 లక్షల 491 ల చెక్కుని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బుధవారం ప్రగతి భవన్ లో రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కల్వకుంట్ల రామారావుకి అందచేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ స్త్రీ నిధి బ్యాంకు ఉద్యోగులను అభినందించారు. అలాగే మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ, చిరుద్యోగులైనప్పటకీ, వాళ్ళంతా తమ ఔదార్యాన్ని చాటారని, వారిని అభినందిస్తున్నామని అన్నారు. కాగా, స్త్రీ నిధి మహిళా బ్యాంకులో 425 మంది ఉద్యోగులు ఉన్నారు. వాళ్ళంతా తమ నెల జీతంలోని ఒక రోజు వేతనాన్ని సీఎంఆర్ఎఫ్ కి అందచేశారు.