బర్డ్ ఫ్లూ నేపథ్యంలో అప్రమత్తమైన తెలంగాణ అటవీ శాఖ
- బర్డ్ ఫ్లూ నేపథ్యంలో అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ వన్యప్రాణి విభాగం
- అన్ని రాష్ట్రాల సీఎస్ లకు వన్యప్రాణి విభాగం ఐజీ రోహిత్ తివారీ లేఖ
- కేంద్రం ఆదేశాల మేరకు చీఫ్ కన్సర్వేటర్లను, అన్ని జిల్లాల అటవీ అధికారులను అప్రమత్తం చేసిన పీసీసీఏఫ్ ఆర్.శోభ
తాజా పరిస్థితుల్లో ఈ వైరస్ పెంపుడు జంతువులు, పక్షులకు విస్తరించే అవకాశం ఉంది. వైరస్ వ్యాప్తి చెందకుండా అన్ని రాష్ట్రాలు తక్షణమే అన్ని రకాల చర్యలు తీసుకోవాలి. పక్షులను పూర్తి స్థాయిలో పెంచడంతో పాటు నిఘా ఉంచాలి. ఏవైనా లక్షణాలు కనిపిస్తే అరికట్టేందుకు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచనలు జారీ చేసింది.
అన్ని రాష్ట్రాలు తక్షణమే తగిన చర్యలు తీసుకొని వ్యాధి వ్యాప్తి చెందకుండా చూడాలని కోరింది. ఈ నేపథ్యంలో కొన్ని రాష్ట్రాల్లో పక్షులు కూడా ఈ వ్యాధి బారిన పడినట్లు సమాచారం. దీంతో తెలంగాణ అటవీ శాఖ కూడా అప్రమత్తం అయ్యింది. కేంద్రం ఆదేశాల మేరకు చీఫ్ కన్సర్వేటర్లను, అన్ని జిల్లాల అటవీ అధికారులకు పీసీసీఏఫ్ ఆర్.శోభ సమాచారం ఇచ్చారు.
జూ పార్క్ లతో పాటు, అటవీ ప్రాంతంలో ఏవైనా అసహజ మరణాలు ఉంటే నమోదు చేయాలని, తగిన పరీక్షల ద్వారా వ్యాధి నిర్ధారణ చేయాలని ఆదేశించారు. ఈ సీజన్ లో వలస పక్షుల సంచారం వుంటుందని వాటిని కూడా పర్యవేక్షించాలని తెలిపారు. ఎవరికైనా సంబంధించిన సమాచారం ఉంటే అటవీ శాఖ టోల్ ఫ్రీ నెంబర్ కు 18004255364 ఫోన్ చేయాలని కోరారు.