త్వరలో "లాజిస్టిక్ పాలసీ" ప్రకటిస్తాం: మంత్రి కేటీఆర్
- హైదరాబాద్ "లాజిస్టిక్ హబ్"
- హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో ఓఆర్ఆర్ వెంట మరో ఎనిమిది లాజిస్టిక్ పార్కులు
- బాటసింగారం లాజిస్టిక్ పార్క్ ప్రారంభోత్సవంలో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్
గురువారం బాటసింగారంలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ) ఆధ్వర్యంలో పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్(పిపిపి)లో ఏర్పాటు చేసిన లాజిస్టిక్ పార్క్ ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా స్థానిక ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. గౌరవనీయులు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు గారు ఎంతో దూరదృష్టితో తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చెందే విధంగా విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటున్నారని తెలిపారు.
అందులో భాగంగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు గారు టీఎస్ ఐపాస్ పాలసీని తీసుకురావడం వల్ల ఇప్పటి వరకు 14వేల పరిశ్రమలు రాష్ట్రానికి వచ్చాయని తెలిపారు.
ఒక అంతర్జాతీయ సంస్థ నివేదిక ప్రకారం హైదరాబాద్ పరిసరాలు మరో కోటిన్నర చదరపు అడుగుల లాజిస్టిక్ పార్కుల అవసరం డిమాండ్ అని మంత్రి కేటీఆర్ తెలిపారు.
ప్రస్తుతం 50 లక్షల చదరపు అడుగుల లాజిస్టిక్ పార్కుల సదుపాయం మాత్రమే అందుబాటులో ఉందన్నారు. రాష్ట్రానికి వస్తున్న పరిశ్రమలు వాటి ఉత్పత్తులకు తగ్గట్టుగా లాజిస్టిక్ సదుపాయాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని, ముందు ముందు మాన్యుఫ్యాక్చరర్స్ రంగంలో మరిన్ని పరిశ్రమలు రాష్ట్రానికి రానున్నాయని మంత్రి ప్రకటించారు.
వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో హైదరాబాద్ భవిష్యత్తులో "లాజిస్టిక్ హబ్"గా రూపొందుతుందని, దానికి అనుగుణంగా సకల సదుపాయాలు కల్పించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక "లాజిస్టిక్ పాలసీ"ని రూపొందిస్తుందని మంత్రి కేటీఆర్ ప్రకటించారు.
త్వరలో లాజిస్టిక్ పాలసీ క్యాబినెట్ ఆమోదం పొందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. లాజిస్టిక్ పార్కుల డిమాండ్ దష్ట్యా ప్రస్తుతం అవుటర్ రింగ్ రోడ్డుకు అనుసంధానంగా ఉన్న ప్రధాన ఎనిమిది(8) రహదారుల వెంట హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో కొత్త లాజిస్టిక్ పార్కులను ఏర్పాటు చేస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు.
ప్రపంచ స్థాయి టెక్నాలజీతో రూపొందుతున్న ఫార్మా సిటీని కొందరు రాజకీయ రాద్ధాంతం చేస్తున్నారని మంత్రి కేటీఆర్ విమర్శించారు. ప్రపంచ దేశాలకు కరోనా వ్యాక్సిన్ అందజేసిన హైదరాబాద్ ఫార్మా రంగానికి మరింత చేయూతనివ్వాలి అన్న లక్ష్యంతో ఫార్మాసిటీ ఏర్పాటుకు నిర్ణయించినట్లు చెప్పారు.
గతంలో లాగా కాకుండా పర్యావరణ పరిస్థితులు ఏమాత్రం దెబ్బతినకుండా ఫార్మాసిటీలో ఏర్పాట్లు జరుగుతాయని, అక్కడ పని చేసే ఉద్యోగులు సైతం ఫార్మాసిటీ పరిసరాలలోని కాలనీలోనే నివసిస్తారని మంత్రి స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, రంగారెడ్డి జడ్పీ చైర్మన్ అనిత రెడ్డి, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి (హెచ్ఎండిఎ) మెట్రోపాలిటన్ కమిషనర్ అర్వింద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.