కేంద్రమంత్రికి, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ కు లేఖ రాసిన తెలంగాణ మంత్రి!
బాక్సింగ్ లో మంచి ప్రతిభను అంతర్జాతీయ స్థాయిలో కనబరుస్తున్న తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రముఖ బాక్సర్ నిఖత్ జరీన్ ను టోక్యో - 2020 ఒలింపిక్స్ కు 51 కేజీల విభాగంలో ఎంపిక చేయాలని తెలంగాణ రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ కేంద్ర క్రీడశాఖ మంత్రి కిరణ్ రిజిజుకి, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ కు లేఖ రాశారు.
తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లాకు చెందిన నిఖత్ జరీన్ బాల్యం నుంచే బాక్సింగ్ క్రీడ లో మంచి ప్రతిభను కనబరుస్తూ అంచెలంచెలుగా రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో ఛాంపియన్స్ షిప్ లలో బంగారు పతకాలు సాధించి దేశానికి, తెలంగాణ రాష్ట్రానికి కీర్తి ప్రతిష్టలు తీసుకవచ్చారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రశంసించారు.
మంచి ప్రతిభను కలిగిన నిఖత్ జరీన్ ను 2020 లో టోక్యోలో జరిగే ఒలింపిక్స్ కు ఎంపిక చేస్తే ఒలంపిక్ పథకంను సాధించే అవకాశం ఉందన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. నిఖత్ జరీన్ ఒలింపిక్స్ ఎంపికపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి దృష్టికి తీసుక వెళ్తామని నిఖత్ జరీన్ తండ్రి జామీల్ అహ్మద్ కు మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్పోర్ట్స్ ఛైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి పాల్గొన్నారు.